పుట:కాశీమజిలీకథలు -01.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహిని కథ

215

అయ్యా! తమదేశమేది? ఈ పటముం జూచి యేమిటికి శోకించితిరి? యథార్థము చెప్పుడు. మీకేమియు భయములేదని సగౌరవముగా నడిగిన విని యతం డిట్లనియె. అయ్యా! బైరాగిగానున్న నాకు భయమనునది యొకటిగలదా! నేనొక కారణమున నాపటమును జూచి శోకించితిని. నా శోకమున మీకేమి నష్టమువచ్చినది ? నా వృత్తాంతము మీతో నేమని చెప్పుదును? సిగ్గు సిగ్గు. నా యిడుములన్నియు జెప్పుకొనుటకు పది దినములుబట్టును. నన్నుఁ బోనిండు పోయెదననుటయు యజ్ఞదత్తుఁడు అతని మాటలచేతనే తన తండ్రియని బాగుగా నిశ్చయించి యిట్టనియె. అయ్యా! మీవంటి మహాత్ముల యిడుమల గనుంగొని తీర్చుట రాజునకు ముఖ్యమైన పనియై యున్నది. నాతోఁ జెప్పిన నేమి లోపమున్నది? నన్ను మీ పుత్రునిగాఁ దలంచి మీరీ పటమును జూచి శోకించిన కారణం బెఱిగింపుండని వేడుకొనెను.

అప్పుడా బై రాగి యజ్ఞదత్తునితో అయ్యా! వినుండు. నా ప్రాణ ప్రియురాలగు మోహినియను దానిని నిష్కారణముగ నడవిలో విడచిపోయితివి నేను దుర్మార్గుడను. ఆ నేరమునకై నన్ను శిక్షింపుఁ డనిన నతండయ్యా! తమరు మోహిని నడవిలో నేటికి విడిచితిరి? ఆమె యెచ్చటికిఁబోయినది? మీ యుదంతంబు విన ముచ్చట యగుచున్నది. యెరింగింపుఁడనిన నతండు దాచక తనవృత్తాంత మామూల చూడముగా వక్కాణించెను. కన్నుల నీరు గార్చుచు నామోహినియొక్క రూప మీపటములో నున్నది. దానిఁ జూచినట్లే యున్నది. అందులకు శోకించితిని. ఇదియే నావృత్తాంతమని పలుకుచున్న సమయంబున యజ్ఞదత్తుఁడు సింహాసనము డిగ్గ నురికి యత్యంత సంతోషముతో నతని పాదంబులబడి, తండ్రి! నేను నీ పుత్రుండ. నా పేరు యజ్ఞదత్తుఁడు మణిమంజరి యందు జనించితిని. మోహినియుఁ గొలది దినములై నది ఇచ్చటికే వచ్చినది. అని తన వృత్తాంతమంతయుఁ జెప్పిన సింహదమనుండు ఆ! యేమీ? ఇదంతయు స్వప్నముకాదుగద ! కాదు. నిజమేయని సంతోషంబను సముద్రంబున మునుంగుచుఁ బుత్రుని గౌఁగలించుకొని కన్నుల నానందబాష్పములుగారఁ బెద్దయుం బ్రొద్దు నొడలెఱుంగ కుండెను.

పిమ్మట సింహదమనుఁడు అత్యాతురముతో బత్రునివెంట నంతఃపురమున కరిగి సంతతము తన్నే ధ్యానించుచున్న మణిమంజరిని, మోహినినిం జూచి పెద్దతడవు గాఢాలింగనము చేసికొని, యొక్కింతసేపు ఒకరినొకరు పలుకరించి మాటలురాక కంఠములు డగ్గుత్తికజెంద జిత్తరువు ప్రతిమలవలె నిలబడిరి. అప్పుడు వారికిఁగలిగిన సంతోష మింతింతయని చెప్పుటకు నలవికాదు. అట్టి సంతోషముతోఁ గొంత సేపు ఒకరినొకరు తమపడిన యిడుమలఁ చెప్పుకొనుచు నిష్టాలాపములచేఁ గాలక్షేపము చేసిరి.

పిమ్మట మణిమంజరి తానుదాచిన యుత్తరము దెచ్చి సింహదమనునికిఁ జదివి వినిపించి దానికి మారుగా వ్రాసిన యుత్తరము వృత్తాంతము జెప్పినది. అప్పుడు సింహదమనుఁడు మణిమంజరినిఁ బెక్కుగతులఁ గొనియాడి తనయున్నత దశకంతకు ఆమెయే కారణమని ప్రస్తుతిజేసెను. తర్వాత సింహదమనుఁడు తనతల్లులకు తండ్రిని