పుట:కాశీమజిలీకథలు -01.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దలంచుకొని వారిచిక్కులఁ బాపుటకై మిక్కిలి తొందరపడ పయనంబగుటయు మణిమంజరియు మోహినియుఁ యజ్ఞదత్తుఁడుగూడ ప్రయాణమున కుత్సహించిరి. చతురంగబలముతోఁ గూడుకొని శుభముహూర్తంబున సింహదమనుఁడు వెడలి మార్గంబున నెడనెడ పటకకుటీరంబులు నిర్మింపించి విడియుచు గొన్ని పయనంబులకు విజయపురంబు జేరెను.

అందు బాహోద్యానవనంబున బసజేసి రహస్యముగాఁ దల్లులకు వార్త నంపి వారి రప్పించి మున్ను విన్న పసరుతోఁ దాఁదెచ్చినగ్రుడ్లు వారి నేత్రముల కంటించెను. అప్పుడా రాజభార్యలు తేజోవంతములైన నేత్రములతోఁ బ్రకాశించిరి చతురంగబలముతో నూరిబైట వ్యూహము పన్నియున్న సింహదమనుని యౌద్దత్యమంతయుం విని శత్రుంజయుఁడు భయపడి యూరు విడిచి పారిపోవఁదలచి దన్ను మాయచేయు చున్న రక్కసియున్న యింటికరిగి దానితో జెప్పెను.

అప్పుడది బెదరక రాజేంద్రా! వెరవకుము. నేను గలుగ నీకేమి కొరఁత. నాకు యుద్ధముచేయు పాటవము గలిగియున్నది. నిజముగా వారు మనమీదఁకు యుద్ధమునకే వచ్చినచో నన్నుఁ బంపుము. ఆ సంగతి రాయబారము మూలముగాఁ దెలిసికొన మని పలికిన నతండు వెరగుపడుచు నప్పుడే యొక బుద్ధిమంతుని వారివార్త దెలిసి కొనుటకై యంపెను. వాఁడును రాజశాసనంబున సింహదమనుండున్న శిబిరమున కరిగి సగౌరవముఁగాఁ దమయేలిక సందేశమును విన్నవించెను.

సింహదమనుఁడు నవ్వుచు దూతా! మీ రాజుతోఁ గొన్ని రహస్యములు మాట్లాడవలసియున్నది. ఇచ్చటికిఁ దీసికొనిరమ్మని చెప్పెను. వాఁడును వేగంబునం బోయి సింహదమనుని యాజ్ఞను శత్రుంజయులతో జెప్పిన నతం డిట్లనియె. ఓరీ ! నేనిప్పుడు శత్రు మధ్యమునకు నొంటిగాఁ బోవచ్చునా? వారు నన్నుఁ బట్టి బద్ధునిచేసినచో నేమి సేయనగు. వారి బలాబలము లెట్లున్నవి? శాంతముగా నుండిరా? యుగ్రముగా నుండిరా? తెలుఁపుమని యడిగిన, వాడిట్లనియె.

దేవా! వారిని మన మెట్లును గెలువలేము. వారిముఖవిలాసములను జూడ శాంతముగానుండిరి. వారియెడఁ గ్రౌర్యముఁ జూపట్టదు. మిమ్ము రప్పించి నమ్మించి మోసము చేయ వారికెంత యవసర మేమి? యుద్ధము చేసి జయింపలేరా? వారి యుద్దేశము మీతో సంధిమాటలు మాట్లాడుకొనుటకే యని తోచుచున్నది. వారి మాటలన్నియు బ్రసాదాభిముఖములుగానే యున్నవి. నిజముగా వారు తలంచుకొనిన మీకుఁ బారిపోవుటకు శక్యమగునా? కావున మీరు గొన్ని కానుకలు దీసికొనిపోయి వారిని బ్రసన్నులఁ జేసికొనుటయే యుత్తమమని పలికిన వానిమాటలు పాటించి శత్రుంజయుఁడు తగు పరిచారకులతోఁ బెక్కు కానుకలు తీసికొని సింహదమనునియొద్ద కరిగెను.