పుట:కాశీమజిలీకథలు -01.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యున్నదని యడిగిన, వారు అయ్యా! చూడుఁడు అని యాపటముల వంచి చూపించిరి. సింహదమనుఁడు అందున్న విగ్రహములలో మణిమంజరిని గురుతుపట్టలేదు. మోహినిని గురుతుపట్టెను.

సింహదమనుం డట్లు మోహిని పటమును జూచి కొంతసేపు తానుగూడ చిత్తరుబొమ్మవలెఁ గదలక యట్టె నిదానించి చూచి మోహినీ నీవు మనుష్యరూపము విడచి దివ్యరూపము ధరించితివా? నన్ను మరచితివే. మాట్లాడవేమి. నన్నుఁ గృతఘ్నునిగాఁ దలిచితివా? నీ పాదంబులం బడియెదను. నా యపరాధము సైపుము. రాజ్యమదాంధుడనై నిన్ను మరచితిని. తప్పు మన్నింపుమని పలుకుచు జిత్తరువు నున్న యీ మోహినినిఁ గౌగలించుకొనబోవుచుఁ జెక్కుల ముద్దుపెట్టుకొనుచు విరహతాపం బంతకంతకు నతిశయించుచుండ నా పటమును విడువక నలిబిలి చేయఁ దొడంగెను.

అప్పుడు రాజకింకరులు అతని విరాళియంతముఁ జూచి పెక్కు తెరంగులఁ జింతించుచు సన్యాసీ! నీకేమైన పిచ్చిపట్టినదా? యూరక మాపటమును నలుపుచుంటివే? మా రాజునొద్దకు రమ్ము పోదమని నిర్బంధించిరి.

అప్పుడతఁడు కొంచెము మోహము మరలించుకొని అయ్యో! నేనేమి తప్పు చేసితిని. మీ రాజు నన్నూరక శిక్షించునా ! యొక కారణంబునం దొందరపడి యీ పటమును నలిపితిని. యీ మాత్రము తప్పుసైచుఁడు. నన్ను మీ రాజునొద్దకుఁ గొని పోకుఁడని బ్రతిమాలఁ దొడంగెను.

కింకరు లామాటఁ బాటింపక ఇదిగో రాజశాసనము— పరిశీలింపుము ఈ పటమును నలియఁ జేసినందులకు నిన్నుఁ గొనిపోవుట కాదు. సాభిప్రాయముగాఁ జూచుటయే నేరమని పలికి యతం డెన్ని చెప్పినను వినక బలత్కారముగా యజ్ఞదత్తుని వీటికిఁ దీసికొనిపోయిరి. సింహదమనుండు వారి నెదిరింప సమర్ధత గలిగియు నచ్చటిస్థితిని బట్టి యిట్టట్టనక వారివెంట నరిగెను. యజ్ఞదత్తుఁడు సభజేసియున్న సమయంబున రాజభటు లాబైరాగిని తీసికొనిపోయి రాజు ముందరబెట్టి, అయ్యా! మేము తమ యాజ్ఞానుసారముగానే పటములతో ననేకదేశములు తిరిగితిమి. ఎందును యెవ్వరును శంకింపలేదు. యీ బైరాగి దీనిని జూచినది మొదలు మోహిని! మోహిని యని పరితపించుచు నీ పటమును గౌఁగలించుకొని పెద్దతడవు విడువక గడబిడజేసెను. దానం జేసి యీతనిం దీసికొనివచ్చితిమని చెప్పిరి. యజ్ఞదత్తుఁడు తండ్రి నెఱుగమి యానవాలు పట్టలేదు. సన్యాసిగా నున్న నాజానుబాహుత్యాదిరూపసౌష్టవమును బట్టి సందియ మందుచు నతనితో నిట్లనియె.