పుట:కాశీమజిలీకథలు -01.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహిని కథ

213

పిమ్మట నాచెంచు లావస్తువులు తెచ్చి రాజుముందర బెట్టిరి. దానిం జూచిన తోడనే సింహదమనునికిఁ గలిగిన దుఃఖ మింతని చెప్పుటకు నలవికాదు. గుఱ్ఱము పైనుండి నేలఁబడి మూర్చిల్లి కొంతసేపటికిఁ పరిచారకులు చేసిన యుపచారములచేఁ దెప్పరిల్లి అయ్యయ్యో! యెంత మరపుజెందితిని! మోహిని యడవిలో నేమైనదోగదా! ఏమేమి? ఇది స్వప్నమా? లేక నిజముగా రాజ్యమే చేయుచుంటినా? నాకు రాజ్యమెట్లు వచ్చినది? మోహినియు నేనును పాతాళభవనములోనేకదా యుంటిమి. లేదు లేదు. ఆటబయలు వెడలి యడవిలోఁ జెట్టుక్రింద నున్నప్పుడు సింహము మూలముగ విడిపోతినా? జ్ఞాపకమువచ్చినది. ఈ చిలుక నేను తెచ్చినదేకదా? ఈ గ్రుడ్లు మా తల్లులవి కావా! అన్నన్నా? ఎన్నాళ్ళయినది. రాజ్యమదము నన్నింత మరపు జెందించునే యని యనేకప్రకారముల వెర్రివాడుం బోలె బలకరించుచు నాచెంచులఁ జీరి యోరీ? మీ కివి యెచ్చట దొరికినవో చెప్పుఁడని యడిగెను.

వాండ్రు ఫాలంబులఁ జేతులుచేర్చి మ్రొక్కుచూ సామీ! మేము వీనిని దొంగతనము చేసి తీసికొనిరాలేదు. అడవిలోఁ దిరుగుచుండ నొకచెట్టుక్రింద దొరికినవి. ఇవి మాకు దొరికి చాలదినములైనవి గాని యిన్నాళ్ళవరకుఁ గ్రామాలకు రాలేదుగానఁ తీసికొనిరాలేదు. మా గుడిసెలలోనే దాచియుంచితిమి. పెట్టెలోనివేమియో మాకు దెలియకున్నవి. ఏలినవారికిఁ గావలసినచోఁ దీసికొనుడని చెప్పిరి. ఆ మాటలు విని యతండు గన్నులనీరు గార్చుచు నోరీ! ఆ చెట్టుక్రింద నొక చిన్నదాని జూడలేదా యని యడిగెను. వాండ్రు అయ్యో! ఆ చెట్టుదగ్గిర మా కెవ్వరును గనంబడలేదు. ఈ పెట్టెయుఁ బంజరము మాత్రమే యున్నవి. మనుషుల జాడలున్నవని చెప్పిరి.

అంత నాసింహదమనుం డపారమగు శోకముతో నాపంజరమును పెట్టెయు దీసికొనిఁ యప్పుడ సభాంతరమునకు నరిగి ముఖ్యామాత్యుని రప్పించి ఆర్యా! నాకు గార్యావసరములు గొన్ని యున్నవి. దేశాంతరమున కేగుచుంటిని. నేనుదిరుగ వచ్చు దనుక నీ వీరాజ్యంబు పాలించుచుండుమని చెప్పి తనముద్రిక లిచ్చివేసెను. తర్వాత నతఁడు అంతఃపురమున కరిగి కాంచనమాలతో నేదియో మిషజెప్పి యెట్టకేలకు నావిడ నొడబరచి యాచిలుక పంజరమును పెట్టెనుమాత్రము గైకొని యొకడే యేకాంతముగాఁ బురము వెడలి యడవిమార్గంబునం బడి మున్ను తాను మోహినిని విడిచిన తావు నరయుచు దిరిగెను. ఎందును నామెజాడ యగుపడినదికాదు—

ఆతం డెనలేని విచారముతో నొడలెల్ల భస్మము బూసికోని బైరాగియై యా రెండువస్తువులను విడువక యనేకపురములు నదులు దీర్థంబులు దిరుగుచుండెను. అట్లు దిరుగుచు నొకనాడు ఒకగ్రామంబున వీథివెంబడి వేఱుదండంబులకుఁ గట్టిన పటములఁ ద్రిప్పుచున్న రాజభటులఁ గొందరగాంచి సింహదమనుఁ డాపటములో నేమి