పుట:కాశీమజిలీకథలు -01.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

లోనగువృత్తాంతమంతయుఁ జరిగినట్లు చెప్పెను. అపుడు సభ్యులెల్లరు తెల్లపోయి దాని నిందించు వాక్కులతోనే మోహిని యోర్పునుగురించియు యజ్ఞదత్తుని బుద్ధిసూక్ష్మతను గురించియు మిగుల స్తుతించిరి.

అంత ననంతకోపముతో యజ్ఞదత్తుండు అర్చకుని పెండ్లామునకు నురిదీయ నాజ్ఞాపించుటయు, మోహిని సమ్మతింపక యర్చకుఁడు ఆపత్కాలములోఁ దనకుఁ జేసిన యుపకారమునకు మారుగా దానిఁ గాపాడవలయునని యజ్ఞదత్తుని బ్రతిమాలుకొనియెను. తల్లి మాట ద్రోసివేయక యజ్ఞదత్తుఁడు దాని క్షమించి సామాన్యశిక్షతో విడిచిపెట్టెను.

పిమ్మట యజ్ఞదత్తుఁడు సగౌరవముగా మోహినిని మణిమంజరియున్న యంతఃపురమునకుఁ దీసికొనిపోయి యామెవృత్తాంతమంతయు దల్లి కిఁ జెప్పెను. మణిమంజరియు మోహిని సంతోషముజెందఁ బెక్కు తెరంగుల గారవింపుచు దుఃఖోపశమనములైన మాటలచే నోదార్చెను. మోహినియు మణిమంజరికి నమస్కరించి యామె చేసిన యుపకారమును గురించి సంతసించుచు సింహదమనుఁడు తనతోఁ జెప్పిన మాటలన్నియుఁ జెప్పుచు నావిడను అక్కగానే భావించి క్రమంబునఁ దానుబడిన యిడుమల గొంచెము మరువఁజొచ్చెను.

మణిమంజరియు మోహినియు నిరంతరము సింహదమనుని గుఱించియే చెప్పుకొనుచుఁ ధీనాధీనచిత్తలై విరాగమతులతోఁ గాలక్షేపము చేయుచుండిరి.

యజ్ఞదత్తుఁడును తల్లుల సంతాపము జూడలేక తండ్రినరయు నుపాయములు పెక్కు చింతించి యొక్కనాఁడు తన తల్లుల రూపములు చిత్రఫలకంబుల వ్రాయించి పరిచారకుల చేతికిచ్చి యాఫలకరూపంబుల సాభిప్రాయముగాఁ జూచినవారి నా యొద్దకుఁ దీసికొనిరండని యాజ్ఞాపించి యంపెను. రాజభటులు రాజశాసనప్రకారమా చిత్రఫలకంబులం గొని యనేక దేశములు దిరుగఁజొచ్చిరి.

అచ్చట సింహదమనుఁడు కాంచనమాలతో యథేష్టసుఖంబు లనుభవించుచు రాజ్యతంత్రరతుండై పూర్వస్కృతిలేక తిరుగుచు నొకనాడు విహారార్థ ముద్యానవనంబున కరుగచు నంగడిలో నొకచోట బదుగురు గుంపుగూడియుండుటఁ జూచి యది యేదియో కనుంగొని రండని కింకరులనంపిన వారు తెలిసికొనివచ్చి యిట్లు సెప్పిరి. అయ్యా ! అడవినుండి చెంచులొక చిలుకను బెట్టెతో నమ్మఁదెచ్చిరి పెట్టెలోదళుక్కురని నేమియో మెఱయుచున్నవి. వానినెవ్వరు నిరూపింపలేకుండిరి. ఆ పెట్టెయుఁ బంజరము నడవిలో వారికొక చెట్టుక్రింద దొరికినవఁట. ఆ చిత్రమును జూచుటకై యనేకులు గంపులుగూడిరి. సెలవైనచో దేవరవారి యొద్దకుఁ దీసికొనివత్తుమని పలికిరి. ఆ మాటలు విని యతఁడు ధ్యానించుచు నా వస్తువులతో వారినిటకుఁ దీసికొని రండని యాజ్ఞాపించెను.