పుట:కాశీమజిలీకథలు -01.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహిని కథ

211

నాకు నరణ్యములోఁగల వింతలన్నిటి జూపుచు నొకనాఁడు రాత్రి యొక చెట్టు క్రింద బసజేసి మాట్లాడుకొనుచుండ వొక సింహము మమ్ముఁ జంపవచ్చినది . అప్పు డతండు గుర్రమెక్కి కత్తిదీసికొని దానిపై బడెను. అదియు బారిపోయిన దానివెంట నతండు తరుముకొనిపోయెను. ఆ సింహమును సింహదమనుండును నెచ్చటికిఁ బోయిరో కాని యా రాత్రియు మరునాఁడుగూడ రాలేదు. నేను జింతించుచు నడవిలో దిరుగుచుండఁ గొందరు దొంగలువచ్చి నన్నుఁ బట్టుకొని వస్తువులు దోచికొనియు విడువక అమ్మవారికి బలినియ్య గుడియొద్దకు! దీసికొనివచ్చిరి గాని పాపము నామూలముగనే వాండ్రెల్లరు మృతినొందిరి. పిమ్మటఁ దెల్లవారుసమయమున నీయూరివాఁడు యాగుడి యర్చకుఁడు వచ్చి నన్నాదరించి తన యింటికిఁ దీసికొనిపోయెను.

వారియింట నేను కాలము గడుపుకొనుచుండ నొకనాఁ డుదయమున నేను లేచు నంత నా మంచము క్రింద నీశవము బడియున్నది. కారణము నాకుఁ దెలియదు. దీని గుర్తించి పూజారి భార్య నామీద నెంతయో కల్పనజేసినది. ఎట్లయినఁ జచ్చుటయే మేలని యన్నిటికి నొడంబడి యూరకుంటిని. ఇదియే నాకథ. మీకుఁ దోచినట్లు చేయుఁడని యూరకున్నంత, యజ్ఞదత్తుడంతకుమున్నె తన తల్లివలన సింహదమనుని కథ వినియుండుట నతండే తన తండ్రియనియు మోహిని తల్లియనియు నెఱింగి గుండె ఝల్లుమన నెల్లరుచూచి వెరగందుచుండఁ దటాలున నా సింహాసనమునుండి లేచి యామోహిని పాదంబులంబడి యిట్లనియె.

తల్లీ ! నేను నీ పుత్రుండను. నీ పతి సింహదమనుండు మా తండ్రియే. నీవు చెప్పిన మణిమంజరియందు జనించి మాతామహర్జితమగు నీ రాజ్యంబు బాలించు చుంటిని. అన్నన్నా! నీవెట్టి యిడుమలుబడుచుంటివి. కానిమ్ము, నీవిఁక జింతింపకుము . మా తండ్రి బ్రతికియున్నాఁడు గదా! యెచ్చటనున్న వెదకి రప్పించెదను. నీవు పూర్వజన్మకర్మమూలముగా నిట్టిబాధలు పడుచుంటివి. కర్మ పరిపక్వమైనట్లు తోచుచున్నది. ఈ మిషగా నా యొద్ద జేరితివి. లేనిచో నెట్లు తెలియనగు! నంతఃపురమునకు బోదము రమ్ము మణిమంజరి నీకు శోకోపశమనము చేసెఁడుగాక యని పలికి ఆమె నిందబాపుటకై యా పూజారి భార్యవలననే నిజము వెల్లడిసేయఁదలచి యొక యినుపగునపము నెర్రగాఁ గాల్పించి యథార్థము చెప్పనిచో నర్చకునిభార్యను కాల్చమని యాజ్ఞాపించెను. అయ్యాజ్ఞానుసారముగా రాజకింకరులు గాల్చిన లోహపుగజము నంటించఁబోవు సమయంబున భయపడి ఆ చెడిపె గడగడ వడకుచు అయ్యయ్యో! నాకంటింపకుఁడు, అంటింపకుఁడు నిజము చెప్పెదనని మొర్రపెట్టుచు దాను మిఠాయిలో విషముంచి యానవాలు తెలియక యుపపతికిఁ బెట్టుటయ నతఁడు చచ్చినవెనుక దాను కోమటియు మోసికొనిపోయి మోహిని గదిలో నుంచుటయు నాబిడమీఁదనే నేరముంచుటయు