పుట:కాశీమజిలీకథలు -01.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వ్రాసిన న్యాయాధిపతి యభిప్రాయము తప్పని స్థిరపరచి సూక్ష్మబుద్ధియైన యజ్ఞదత్తుఁడు మోహిని నిరపరాధిని యని నిశ్చయించి యామెతో నిట్లనియె.

అమ్మా! నీ విట్లు మౌన మవలంబించి యుండుటచే నీమీదను నేరమే స్థాపింపఁబడుచున్నది. నీ మొగంబు జూడ నపరాధము జేసినట్లు గనంబడదు. నీ వెద్దియో యాపదజెంది ప్రాణత్యాగమునకై తెగించి మాట్లాడకుంటివి. నీ విరాగ మల్పమతులు తెలిసికొనలేక నీ వీ నేరము చేసినదానివే యని నిందింపుచున్నారు. లోకాపవాదము బాపకారణమే యని పెద్దలు జెప్పుదురు. ఊరక నీవట్టి యపవాదము బొందనేటికి? యథార్థముచెప్పి యీనింద బాపుకొనుమని పలికిన నామోహిని యతని చల్లనిమాటలచేఁ దన హృదయసంతాపము కొంత తొలంగ నొక్కింత తలయెత్తి యతని కిట్లనియె.

దేవా! అష్టదిక్పతుల యంశమువలనఁగదా రాజు జనించును. అట్టి దేవతాసంభూతులగు మీరు యెఱుఁగనిది గలదా? నేనీ నేరము చేయలేదని చెప్పినలాభమేమి? నన్ను నాపత్సముద్రంబున ముంపఁదలంచిన దైవసంకల్పమును నేను మార్పఁగలనా? ప్రయాసపడి యపరాధము తప్పించుకొని బ్రతికినను సార్దక మేమున్నది? కావున నా వృత్తాంతముతో మీకేమియు నిమిత్తములేదు. నాకు వేగమ యురికి యాజ్ఞ యిప్పింపుఁ డని వేడుకొనెను.

ఆ మాటలచే యజ్ఞదత్తునికి నా మెయందు మరియు నక్కటిము దొడమినది, తదీయ వేతృత్వమున కచ్చెరువందుచు మరలనిట్లనియె. అమ్మా ! యథార్థము చెప్పినచో నీకేమి లోపమున్నది. అన్యాయముగ నిన్ను నురిదీయ నాజ్ఞాపించుటకు నేనంత దుర్మార్గుఁడననుకొంటివా? నన్నుఁ బుత్రునిగా దలంచి నీవృత్తాంత మెఱింగింపుమని వినయ పూర్వకముగాఁ బ్రార్థించిన నతిని మాటలఁ ద్రోసివేయలేక మెల్లన నిట్లనియె.

అయ్యా! మీరిట్లు సారెకు నన్నడుగుచుండ జెప్పకునికి మూర్ఖతగా నుండును. వినుండు నా పేరు మోహిని. నన్ను బాల్యంబునచే యొకబ్రహ్మరాక్షసి యెత్తుకొని పోయి ద్వీపాంతరమందున్న పాతాళగృహములోఁ బెట్టి పోషింపుచుండెను. అచ్చటికి, గొంతకాలము క్రిందట సింహదమనుండను రాజకుమారుఁ డొక కార్యముమీఁద వచ్చెను. అతండును మణిమంజరి యను రాజపుత్రిక మార్చిన యుత్తరము మూలముగా నా రక్కసి గుట్టంతయు గ్రహించి దాని జంపి యందున్న నన్ను గాంధర్వవివాహంబున స్వీకరించి కొంతకాలమా గుహయందు గ్రీడావిశేషములనుభవింపు చుండెను. అంత నొక్కనాఁడు తల్లుల కన్నుగ్రుడ్డుల మూలముగాఁ బూర్వస్మృతి గలిగి యప్పుడే కదలి యద్భుతవేగము గలిగిన తన గుఱ్ఱముమీద నన్నెక్కించుకొని యా గుహ వెడలి సముద్రంబుదాటి యావలియొడ్డు చేరెను.