పుట:కాశీమజిలీకథలు -01.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహిని కథ

209

చిక్కుల గురించి చింతించుచు నెట్లయినను జావఁనెంచియున్నది గావున వారికేమియు నుత్తరమియ్యక నేరము చేసినట్లే యొప్పుకొనుదానివలెఁ దలవంచి యూరకుండెను. అప్పుడా రాజభటులు ఆమెను నేరము చేసినదానిగా నిశ్చయించి సంకెళ్ళువైచి బందీ గృహంబునకుఁ దీసికొనిపోయిరి. వైద్యులా శవమును గోసి పరీక్షించి విషప్రయోగము మూలముగాఁ జచ్చినట్లు తెలియఁజేసిరి. అప్పుడు రక్షకపురుషులు పూజారి భార్యను సాక్ష్యము చెప్పుటకు నిశ్చయించి యానేరము న్యాయాధిపతి యొద్దఁ బెట్టిరి. ఆ న్యాయాధిపతి యంత బుద్ధిమంతుఁడు కాఁడు. ఆ సాక్ష్యమంతయు విచారించి ఆమె మాట్లాడకపోవుటయే నేరము చేయుటకు నిదర్శనమని నిశ్చయించి యా చిన్నదానికి నురిశిక్షకు నుత్తరమిమ్మని యప్పుడు రాజుగానున్న యజ్ఞదత్తునికి వ్రాసికొనెను.

గోపా! పూర్వము సింహదమనుండు ద్వీపాంతరమున కరుగుచు మేడమీఁద గొలువున్న మణిమంజరియను రాజపుత్రికతో నొకరాత్రి గ్రీడించి యేగిన వార్త నీవు వినియేయుంటివి. ఆ మణిమంజరి గర్భము ధరించినది. ఆ రహస్య మామె తండ్రి దాసీముఖంబుగాఁ దెలిసికొని గూఁతురుపై గోపముసేయక పండితులఁ బిలిపించి యా వృత్తాంతము వారికిఁజెప్పి మణిమంజరి దోషురాలా? యని యడిగెను.

అప్పుడు పండితులు విమర్శించి శకుంతల మొదలగు రాజస్త్రీలఁ గొందరఁ దృష్టాంతముఁజూపి గాంధర్వవివాహంబున స్వతంత్రముగాఁ బతిని స్వీకరించుట రాజపుత్రికలకు ధర్మమేయగుట నిర్దోషురాలే యని చెప్పిరి. పిమ్మట రాజు సంతసించుచు నుత్సవములు పెక్కు చేయించెను. ఆ మణిమంజరికి శుభలగ్నంబునఁ బుత్రుఁడు జనించెను. వానికి యజ్ఞదత్తుఁడను పేరుపెట్టిరి. ఆ కుమారుండు ఆకారంబునను, గుణంబులను, బరాక్రమంబునను, బుద్ధికౌశల్యంబునను, సింహదమనుని బోలియుండెను. పదియారేఁడులు వచ్చినతోడనే యారాజు దౌహిత్త్రుడైన యజ్ఞదత్తునికిఁ బట్టాభిషేకముజేసి తపోవనంబున కరిగెను . యజ్ఞదత్తుండును తల్లివలన దనతండ్రి వృత్తాంతమంతయు విని యా లోపమునకై పెక్కు తెరంగులఁ జింతింపుచుండెను.

అందు రాజ్యము సేయుచున్న యా యజ్ఞదత్తుడుఁ న్యాయాధిపతి వ్రాసిన జాబునుజూచి తాను సింహాసనమెక్కి కొలఁదికాలమెయయ్యెను. మొదటనే యొక యాఁడుదానికి నురిదీయ నాజ్ఞయిచ్చుటకు శంకించి యానేరమును గుఱించి జరిగిన గ్రంథమంతయుఁ దనయొద్దకుఁ బంపుమనియుఁ దానే వివారించి శిక్ష విధింతుననియు న్యాయాధిపతికి వ్రాసి యా గ్రంథమంతయుఁ దన చెంతకుఁ దెప్పించుకొనెను. విచారణ దివసంబున యజ్ఞదత్తుఁడు విద్వాంసులును, మంత్రులును, సామంతులును, పౌరులును, బెక్కండ్రు సభనలంకరింపఁ బెద్దకొలువుదీర్చి యచ్చటికి మోహినిం బిలిపించి పూజారి భార్యవలన మరల సాక్ష్యమును బుచ్చుకొని యాసాక్ష్యము మూలముగానే మోహిని నేరము చేయనట్లు దృఢపరచెను. సాధారణముగా జారిణికి నుపపతియందున్న మక్కువ యెవ్వరియందును నుండదనియు, నట్టి ప్రేమాస్పదుని విషముపెట్టి యేటికి జంపుననియు మౌనమవలంబించి యుండుటయే నేరము స్థాపించుటకు నాధారమగుచున్నదని