పుట:కాశీమజిలీకథలు -01.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నామె కాలికి శవము తగిలినది. దానికి బెదరి యమ్మదవతి అయ్యో! యిచ్చటనెవ్వరో యుండిరని యరచెను.

అప్పుడా పూజారి భార్య తలుపులు తెఱచిజూచి మోహినీ! కంసాలి యిచ్చటఁ బరుండి యున్నా డేమి? యని యడిగెను. ఆ మోహిని దానితో అమ్మా! యీతండిచ్చటి కెట్లు వచ్చెనో నే నెరుఁగనని చెప్పెను. అప్పుడా టక్కులాడి ముక్కుమీఁద వ్రేలు వైచుకొని భళిభళీ! యెంతదానివె ఇదియా, నీ గుణము తెలిసినది. వీనిఁ బెట్టుకొని యుంటివా? తెల్లవారినది లేపి వాని నింటి కంపుము. అని పలుకుచు బిమ్మట వాఁడు చచ్చియుండెనని యప్పుడే దెలిసిన ట్లభినయించుచు గుండెమీఁద జేయివైచుకొని అమ్మయ్యో! యేమి జరిగినదో జూచితివా? వీడిప్పుడు చచ్చియున్నాడు. యేమియు నెరుంగని దానివలె నట్లు తెల్లబోయెద మేమిటికి? యథార్థము చెప్పుము. నీ కతంబున మాకుగూడ మాట రాగలదు. నీ కులగోత్రములు తెలిసికొనక నింట బెట్టుకొనినందులకు నామగని కీపాటి శాస్తి కావలసినదే యని యనేక ప్రకారములుగా నా పతివ్రతను నిందించుచు వీధిబడి యో పెద్దమనుష్యులారా! యో రాజభటులారా! యిటురండు. మా యింటనున్న తొత్తు నరహత్య చేసినదని యరచిన విని రాజభటు లా యిల్లు చొరబడి కంసాలి శవమును, రెండవశవమువలెఁ గదలక ద్యానించుచున్న మోహినిం జూచిరి.

అప్పుడా రాజభటులు పూజారి భార్యం జూచి యా చిన్నది యెవ్వతె? మీయింటి కెట్లు వచ్చినదో చెప్పమని యడిగిరి అది పేరెలుంగునవారితో నిట్లని చెప్పదొడంగెను. అయ్యా! కొన్నినెలల క్రిందట నా మగఁడు ఈ లంజనుదెచ్చి యింటఁబెట్టెను. దీని వైఖరియంతయుం జూచి యప్పుడే వలదని చెప్పితిని. నామాట బాటిసేయకుండుట చేతనే యీరొష్టు తగిలినది. ఇది వచ్చినది మొదలు దీని యందమును వలచికాఁబోలు విటపురుషులు మా యింటిచుట్టు తిరుగుచుండిరి. ఈ కంసాలియుఁ దరుచు వచ్చుచుండెడివాఁడు. నాకేల యని యుపేక్షగా నూరకుంటిని. నిన్న రాత్రి యేమి హేతువు చేతనో వీనిం జంపినది. ఆ రహస్యము నాకుఁ దెలియక పూర్వమువలెఁ దెల్లవారుజామున లేవమి సందియ మందుచుఁ దలుపు చెంతకుబోయి లేపితిని. అప్పుడును లేచినది కాదు. పిమ్మట దలుపు దెరచిచూడ నిందీ శవము గనంబడినది. నేను భయపడి యిత డెవ్వఁడు యిట్లేల చచ్చియున్నాడని యెంత యడిగినను బెల్లముగొట్టిన రాయివలె మాట్లాడినదికాదు. అప్పుడు యీ నేరము మా యింట జరిగినది. కావున వెరపుజెంది వీధిఁబడి మిమ్ములను బిలిచితిని. ఇదియే నే నెఱిఁగిన కథ యని యా బోంకరి వారితో జెప్పినది.

పిమ్మట వారు మోహినిం జూచి దీనికి నీవేమి చెప్పెదవని యడిగిరి. అప్పుడా సాధ్వి మనంబున నది చేసిన కల్పనకు వెరగుజెందుచు దైవము తనకు మరలఁ దెచ్చిన