పుట:కాశీమజిలీకథలు -01.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహిని కథ

207

అందులో రెండు మిఠాయియుండలను మంచముక్రింద దాగియున్న యుపపతికి నందిచ్చినది. అది పెట్టిమీఁదనుండి మిఠాయి తీసికొనివచ్చునపుడు చీకటిలో నానవాలు పట్టలేక విషము గలిపిన యుండ యొకటి వానితో దీసికొనివచ్చెను. ఆ యుండయే యెఱుంగక యుపపతి కిచ్చుటచే నది తిని కొంచెములోనే వాఁడు మృతినొందెను. తానొకటి తలఁప దైవమొకటి తలంచునను సామెత తప్పునా? ఆ లంజ మగనికి నిద్రపట్టిన వెనుక మంచముక్రింద జేయిపెట్టి యతని పైకి రమ్మని సంజ్ఞ చేసెను. అతండు దానికి మరల నుత్తరము చెప్పలేదు. అపుడు వానికి నిద్రపట్టిన దనుకొని గట్టిగా లేపినది కాదు. తెల్లవారుజామున నర్చకుఁడు యథాప్రకారము గుడియొద్దకు బోయెను. తర్వాత నా రంకులాడి దీపము వెలిగించి యా కంసాలిని లేపెనుగాని యేమియుఁ బ్రయోజనము లేకపోయెను. వాఁడు చచ్చెనని గ్రహించి చీకటిలో విష ముంచిన మిఠాయియుండ యతని కిడితిఁ గాబోలునని పశ్చాత్తాపతప్తయై గుండెలు బాదుకొనుచు వాఁడు చచ్చిన శోక మొకటియేగాక యుదయంబున రాజభటులు జూచిఁ దన్ను శిక్షింతురను వెరపు మనంబునఁ బాధింపుచుండఁ బెక్కు తెరంగులఁ జింతించు చుండెను. ఇంతలో దెల్లవారునప్పుడు వచ్చు వైశ్యకుమారుఁడు గోడదుమికి లోపలకు వచ్చెను. వానిం జూచి యా రహస్యము వానితోజెప్పి యెట్లయిన నీ ముప్పు దాటింపు మని వేడుకొనెను . ఆ కోమటి యట్టిమాట వినినతోడనే గడగడ వడఁకుచు అయ్యో బాబు! నాకు గుండెలు కొట్టుకొనుచున్నవి. ఏమియుం దోచకున్నది. రాజభటులు జూచినచో నిన్నును నన్నునుగూడఁ దీసికొనిపోయి చెరసాలఁ బెట్టుదురు. నీ పాదములకు మ్రొక్కెదను నన్నేలాగుననైన మా యిల్లు చేర్చుము. సొమ్మేమైన గావలసినచో నిచ్చెదను. ఇందునిలువ నాకు భయమగుచున్నదని పిరికితనముగాఁ బలికిన నది వాని కిట్లయెను.

ఓయీ! నీవు వెరువకుము. దీని గురించి నీ కేమియు మాట రానియ్యను. మా యింటనున్న మోహినిమీదఁ నీ నేరమంతయుఁ ద్రోసివేసి దానిని శిక్షింపఁజేసెదను. ఈ శవమును మనము మోసుకొనిపోయి దానియింటఁ బెట్టుదము రమ్మని పలికిన యతండు కాలవైపు తాను తలయంపినిబట్టి యాశవమును మోసుకొనిపోయి మోహిని పరుండియున్న గదిలో మంచముక్రింద మెల్లగావైచి యామె లేవకుండునట్లు తలుపులు వేచి యరిగిరి. ఆ కోమటి యింటికరిగియు నుదయంబునఁ దనమీఁద నేమి పడునో యను వెరపుతోనుండెను. అంతట నా చెడిపె యుదయంబున లేచి పాఁచిచేయుచు మోహినీ! లెమ్ము లెమ్ము. తెల్లవారిన మాటయే యెరుంగకుంటివి. ఇంతయలపునకు రాత్రి యేమి చేసితివని లేపిన నులికిపడి యక్కలికి లేచినది. లేచినతోడనే మెత్తగా