పుట:కాశీమజిలీకథలు -01.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

చాలు చాలు మరియొక యింటికిఁ దీసికొనిపొమ్ము. ఊరిలో విటపురుషులు పెక్కండ్రు గలరని పలికిన నా మాటలాలించి యమ్మోహిని చెవులు మూసికొని శివ శివా ! ఏమయ్యా! యీమె యిట్లనుచున్నది? నీవు నన్నట్టి యుద్దేశముతో దెచ్చితివా యని యడిగిన నతం డిట్లనియె.

తల్లీ ! నీ యుల్లంబున నట్లెన్నఁడును తలంపకుము. నీవు నాకుఁ గూతురవు. ఈ నిర్భాగ్యురాలి కేమి తెలియును. అది యెప్పుడును మర్యాద తెలియక యట్లే కూయుచుండును. దాని సంబంధము నీ కేమియు లేదు. నీయిష్టము వచ్చినట్లు సంచరింపుమని పలికి పెండ్లామును తిట్టి యమ్మోహినిని సగౌరవముగాఁ దన యింటబెట్టుకొని కాపాడుచుండెను. మోహిని యర్చకుని యింట నున్నప్పుడు తనకుఁ దగిన కృత్యంబులు చేయుచు సంతతము తన భర్తను గురించి చింతించుచు, నితర ధ్యానము లేక కాలక్షేపము చేయుచుండెను.

ఆ పూజారి భార్య నొకకంసాలితోను కోమటితోను సాంగత్యము గలిగి యున్నది. నిత్యము రాత్రులయందు వారిరువురు నొకరు విడిచి యొకరు వచ్చుచుందురు. ఈరీతిఁ బెక్కుదినములనుండి జరుగుచున్నను నాపూజారి గుర్తెఱుఁగడు. ఒక్కనాఁడు రాత్రి మోహిని యెద్దియోపనికి వాకిటికి వచ్చెను. అప్పుడు కంసాలి గోడప్రక్కను పొంచియుండెను. అది చూచి మోహిని భయపడి దొంగ దొంగ యని యరచెను. ఆ ధ్వని విని పూజారి దీపము తీసికొనివచ్చెను.

వానికిఁ దప్పించుకొనిపోవ వేరదారి లేమింజేసి యాపూజారి ముందరినుండియే పారిపోయెను. ఆ పూజారి దీపము వెలుగున వాని నానవాలు పట్టి వాఁడు దొంగతనము చేయువాఁడు కాఁడనియు జారత్వమునకే వచ్చెననియు ననుమానపడి నాఁటినుండియు భార్య నితరమిషలచే దండింపఁ దొడంగెను. ఆయదలిం పాకులట గ్రహించి మోహిని మూలముగఁ దనగుట్టు బయలయ్యెనని యామెంజంపఁ ప్రయత్నించుచుండెను. ఆ పూజారి భార్య యొకనాఁ డెట్లో విషచూర్ణము సంపాదించి కొంత మిఠాయి చేసికొని, యుండలలో నావిషచూర్ణము కలిపెను. మంచియుండలును, విషము గలిపిన యుండలను గురుతుగా నొక పెట్టెమీఁద బెట్టెను.

ఆ రాత్రి పూర్వమువలె గంసాలివచ్చి దాని మంచముక్రింద దాగియుండెను. నాఁటిరాత్రి ప్రొద్దుపోవువరకు పూజారి నిదురపోలేదు. ఆ జారిణి తన విటుని యునికి బయలుపడునని దీపమార్పినది. అపుడు అర్చకుఁడు నిద్రపట్టక భార్యతో దీపమారిపోయినది. లేచి వెలిగింపుము నాకు నీ విందాక చేసిన మిఠాయి కొంచెము పెట్టుము అని యడిగెను. అ మాటలు విని యది యిటునటు దిరిగి దీపము వెలిగించు సాధన మెక్కడనున్నదో తెలియలేదని చెప్పుచు మందసము మీదనున్న మిఠాయి యుండలఁ కొన్ని తెచ్చి మగని కిచ్చినది.