పుట:కాశీమజిలీకథలు -01.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహిని కథ

205

వచ్చిన ధనమున కిబ్బడిగా నిత్తునని పలికెను. ఆ యిరువురి మాటలను విని వేరొక్కఁడు ఓహోహో! మీరేనా భాగ్యవంతులు! మీసాటి వలపును సొమ్మును గలవారు వీరిలో నెవ్వరుగలరు? అమ్మవారికి బలి యియ్య పేరుపెట్టిరి గాన నూరుకొంటిని గాని యీయూహ నాకు మొదటనే పుట్టినది. దీనినే నాకు భార్యగాఁ జేసినచో మీ వంతునకు వచ్చిన ధనము నిత్తుమని పలికిరిగాని నేను మీ యందరకు నెలకు నూరుమాడలవడుపున యావజ్జీవము వేతనము నిత్తునని పలికెను.

ఈ రీతి నందరకును గ్రమంబుగఁ గామవృత్తులు మనంబుల నంకురించినవి. అమ్మించుబోణి తమకే కావలయునని యెల్లరును గోరి కలహము పెంచుకొని కత్తులం దీసి కోపముతోఁ బెద్దతడవుపోరి తుదకు నొకరిచేత నొకరు చంపబడిరి. ఆహా! పూర్వము విష్ణుండు జగన్మోహినియై రాక్షసులనెల్లఁ బరిమార్చినట్లు ఆ మోహనియు దొంగల భంగపెట్టెను. ముచ్చులందరు నట్లుచచ్చిన వెనుక యచ్చేడియ విధిచేష్టకు నాశ్చర్యపడుచు నయ్యయ్యో! దైవము నన్నింక నెన్నిబాదలు పెట్టుటకోగదా చావనియ్యలేదని శరకంపము చేయుచు నా గుడిలో నమ్మవారిని ధ్యానింపుచుండ నింతలో నా హృదయాంధకారంబుతోఁ గూడ దిక్కులు చీఁకటివాసి తెల్లవారెను. అప్పుడు ప్రాంతమందుఁ బ్రజల కోలహలధ్వని వినంబడిన నది యొక పట్టణప్రాంత మనియు నూరిలోనికిఁ బోవచ్చుననియుఁ గొంతదైర్యముగా నుండెను. ఇంతలో నా యమ్మవారి పూజారి గుడికివచ్చి యందు రతీదేవియుం బోలెఁ బ్రకాశించుచున్న యాచిన్నదానిం జూచి యద్భుతపడుచు అమ్మా! నీ వెవ్వరిదాన వీగుడిలోనికేమిటికి వచ్చితివని యడిగిన నప్పడఁతి యిట్లనియె.

అయ్యా! నా కెవ్వరును దిక్కులేరు. నాభర్త యీయరణ్యములో నన్ను విడచి మృగమును హింసింసనరిగి తిరుగా రాలేదు. మృగముచేత హింసింపఁబడెనేమో తెలియదు. నన్ను దొంగలు పట్టుకొని యాభరణములన్నియుఁ దీసికొనిపోయి తుదకు నా మూలముగనే యొకరినొకరు కొట్టుకొని మృతిఁజెందిరి. అదిగో! వారి కళేబరము లందున్నవి. చూడుము. నీ మొగముచూడ మంచివాఁడవులె నుంటివి. మీ యింటఁ గొన్నిదినంబు లుండెదఁ గాపాడదవే యని యడిగిన నతండు తల్లీ! నీ కేమియు భయములేదు. మాయింటఁబెట్టుకొని పుత్రికవలె జూచుకొనియెద రమ్ము. నీ భర్తను బొందఁగలవని యోదార్చుచు నప్పుడతిని యింటికిఁ దీసికొనిపోయెను. అతని భార్య మిగుల గయ్యాళి. ఆ యిల్లాలిం జూచి కోపముతో నీ పడుచు నెచ్చటినుంచి తెచ్చితివి? ఇది యెవ్వతెయని యడిగిన దానికతం డిట్లనియె. ఓసీ ! ఇదియొక రాజకుమార్తె. పాపము కారణాంతరమున బంధువులతో విడిపోయినదఁట. అమ్మవారి గుడిలో చేరినది. కొన్ని దినములు మనయింట నుండును. దీని మర్యాదగాఁ జూడమనుటయు నక్కులట పండ్లు పటపట గొఱుకుచు నీ యాశయము నే నెఱుంగుదును. ఇది చక్కనిది గదాయని జేర్చి నే నేమైన నందునని యిట్లనుచుంటివి. నాకన్న యిది యందము గలదియా? అదియునుఁగాక చెడిపోయినట్లు కనుపించుచున్నది. ఇంతకుపూర్వ మెందర నుంచుకొని విడిచినదో. ఇట్టిది మనయింట నుంచినచో మనకుఁగూడ నల్లరివచ్చును.