పుట:కాశీమజిలీకథలు -01.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నంత పూర్వవృత్తాంతమంతయు నతనికి జ్ఞాపకమువచ్చినది. అప్పు డతఁడు మిగులఁ దన్ను నిందించుకొనుచు భార్యతో రమణీ ! నావంటి మూఢుం డెందును లేడు. తల్లులును దండ్రియు నచ్చట శత్రుబాధితులై చిక్కులుపడుచుండ నిచ్చట సుఖం బనుభవింపుచుంటి. ఆ రక్కసి మా తండ్రి నెన్నిచిక్కులు పెట్టుచున్నదియో! వేగఁ బోవలయునని చెప్పి యప్పుడ చిలుక పంజరమును, కనుగ్రుడ్డులున్న పెట్టెను మాత్రము గైకొని మోహినితోఁ గూడ గుహాముఖంబునకు వచ్చి యచ్చట పూర్వము దానెట్లు విడిచెనో యట్లేయున్న యా యద్భుతతురంగముపై భార్య నెక్కించి పంజరము పెట్టెయు గూడ దాని మూపుమీఁద నమర్చి మునుపట పొడి నిప్పులో వైచెను. అప్పు డచ్చటి రాయి పగిలి దారి యిచ్చినది.

పిమ్మట సింహదమనుండు తానుగూడ గుఱ్ఱమెక్కి జయపరమేశ్వరా! యను నంతలో నాగుఱ్ఱము దారింబడి వెడలి యతివేగముగా మున్ను వచ్చినట్లు నడుచుచుఁ దృటికాలము లవణసముద్రంబు దాటి యవ్వలియొడ్డు చేరెను. మోహిని భూలోక మెన్నఁడును జూడలేదు కావున నందుఁ జూచినదియెల్ల నాబిడకు వింతగానే దోచు చున్నది.

ఆమె వింతలు చూచుటకై గుఱ్ఱమును వేగముగా నడువనీయక మెల్లగా నడిపించుచుఁ జిన్న చిన్న మజీలు చేయించుచుండెను. ఇట్లు నడుచుచు నొకనాఁడు సాయంకాలమున నొకయడవిలో బసఁజేసిరి. రాత్రియొక చెట్టుక్రిందఁ బరుండి సింహదమనుండు భార్యతో నిష్టాలాపము లాడుకొనుచుండఁ బ్రాంతమున నొక సింహధ్వని వినంబడినది. దానికి దద్దరిల్లి యప్పల్లవాధరి వరునిఁ గౌగలించుకొనినను భయము తీరక మేనెల్ల వణకఁజొచ్చెను. అప్పుడు సింహదమనుండు భార్యకు ధైర్యముజెప్పుచు నామెను చెట్టుమ్రోల నిలఁబెట్టి కత్తి చేతంబూని గుఱ్ఱమెక్కి సింహధ్వని వినఁబడిన దిక్కు పరిశీలింపుచుండ నాదండనుండి యొకసింహము మొగంబు దెరచికొని తోకఁ యాడింపుచు నా చెట్టుమ్రోల కేతెంచు నంతలో సింహదమనుండు వెరువక యతిసాహసముతో గుఱ్ఱమును దానిమీఁదికి ద్రోలెను. అప్పుడా సింగము బెదరి వెన్నిచ్చి పరవఁజొచ్చెను. విడువక సింహదమనుండు దాని వెంటఁబడి తరుముచుండెను. ఈ రీతి నతిరయముగా సింహమును, సింహము వెనుక సింహదమనుండును పరుగిడు చుండ నడుమ ననేకవృక్షలతాగుల్మాదులు నుగ్గయిపోయినవి.

అట్లేకవిధముగాఁ దెల్లవారువరకుఁ బరుగెత్తెను. ఎంతదూరము వచ్చెనో చెప్పుటకు వీలులేదు. తెల్లవారినంత నాసింహము సింహదమనునికిఁ గనబడినదికాదు. దానికతండు వెరఁగుపడుచు నయ్యయ్యో! యీ సింగమెందేగెనోకదా? నా వచ్చిన పయనంబంతయు వృధయైనదే. దీనింజంపక మగుడనని ప్రతిజ్ఞ జేసితిని. యూరక మరలిపోయినచో మోహిని పరిహాసము చేయునేమో? ఇదియునుం గాక నా వాల్గంటి