పుట:కాశీమజిలీకథలు -01.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిమంజరి కథ

201

లన్నియు వినుటయే కాని యీ జన్మమం దొక్కటియుఁ జూడలేదు. కూపకూర్మమువలె నీ గుహాగేహంబున వసించియుంటి నాపూర్వజన్మమం దెచ్చటనో కొంచము సుకృతము చేసియుంటిని. లేనిచో మీ యట్టి మనోహరుండు మనోహరుఁడుగా దొరకునా యని పలుకుచు నతనికి సంతోషము గలుగఁ జేసినది.

సింహదమనుండును నెచ్చెలి కనుకూలమగు కేళీవిలాసంబులు వెలయింపుచు నింపుపుట్టించెను. ఇట్టయ్యిరువురు దమకంబుదీరఁ గొంత తడవు గ్రీడించి యలసి సొలసియున్న సమయంబున నమ్మోహిని వాని కిట్లనియె.

ఆర్యపుత్రా! నీవు రాజకుమారుండవు. కంకాళి రాక్షసస్త్రీ. అట్టిదానికి నీవు పుత్రుఁడవగుట యెట్లో తెలియకున్నది. నీ వృత్తాంతము విన వేడుకయగుచున్నది. చెప్పుమని యడిగిన నతండు తన్వీ ! నా వృత్తాంతమంతయుఁ నీకు బిమ్మటఁ జెపెదం గాని యొకటి వినుము. ఇది రాక్షసి. రాక్షసులకు మనుష్యులు ఆహారవస్తువులు గదా. అట్టివారికి మనయెడ మక్కువ స్థిరముగా నుండదు. యెప్పుడో యాకలి యైనతరి నిది మనలను భక్షించును. కావున ముందు దీనిం బరిమార్చిన మేలగును. దీని యాయువు యిందులోనున్న గోరింకపిట్టలో నున్నది దానిం జంపిన నిది చచ్చునఁట. అట్లుచేయుట నీ కిష్టమేనా యని యడిగిన నదియును బెంచిన మోహమునఁ గొంచెము సంశయించుచు మగనిబోధచే నెట్టకేలకు సమ్మతించినది.

తర్వాత నారాజకుమారుండు దానిజాడఁ జూచి మెల్లన నా పంజరమున్నచోటి కరిగి యాపంజరములోఁ జేయిపెట్టి యాపిట్టను పైకిఁదీసి యొక్క పెట్టున దాని గొంతును పట్టి నులిమి చంపెను. ఆ పిట్ట చచ్చినతోడనే వంటశాలయం దారాక్షసియు గిజగిజ తన్నుకొనుచుఁ బ్రాణములు వదలెను. అప్పుడు రాజకుమారుఁడు మిగుల వేడుక జెందుచు నాసుందరితోఁ దన వృత్తాంతమంతయుఁ దెలియజెప్పి బోఁటీ! ఇంకొక నిశాటిని యున్నది. అది మాతండ్రిని మోసము చేయుచున్నది. దానిపనిగూడఁ బట్టవలయును. అది నన్నే చంపఁదలఁచి యిచ్చటికిఁ బంపెనుగాని మణిమంజరియను చిన్నదానివలన నా కా యాపదదాటినది. దానితో వేగము గలిసికొనవలయును. మరియు నా తల్లులు నాకై వేచియుందురని పలికి యక్కలికితో నాగృహవిశేషంబు లన్నియుఁ బరిశీలించి యందు గొన్ని దినంబులు యధేష్టకామంబు లందుచుండెను.

సింహదమనుండు మోహినితో నాపాతాళగృహంబునఁ బూర్వవృత్తాంతము మరచి కొన్ని యేడులు రాత్రియుఁ బగలను వివక్షతలేక కేళీసౌఖ్యము లనుభవించెను. అక్కాలమంతయు నతని కొకసంవత్సరములాగైనను తోచలేదు. తల్లులను దండ్రిని మణిమంజరినిఁ దన దేశంబును మరచి యిష్టసుఖంబు లనుభవింపుచుండ నొక్కనాఁ డతఁ డెద్దియో కార్యంబునకుఁ దల్లుల కంటిగ్రుడ్డులున్న పెట్టె తెరచెను. వానింజూచి