పుట:కాశీమజిలీకథలు -01.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

'పూర్వ మొకప్పుడు మీ యమ్మ దేశసంచారము చేయుచు నొక సంస్థానము మీఁదబఁడి దానినంతయు జనశూన్యముగాఁ జేయుచు నందుఁ దన కన్నులకు మిగుల ముద్దుగాఁ గనంబడిన యారేండ్ల ప్రాయముగల యీ చిన్నదానిం జంపక తన చిత్రశాలలో నుంచుకొనవచ్చునుగదా యని యూహించి తెచ్చి యందుఁ బెట్టినది. ఈచిన్నది యిప్పుడు ప్రాయము గలిగియున్నది: దీని సంరక్షణమంతయు నేనే కనుగొనుచుంటిని. దీనికి లోకవ్యవహారములును విద్యయు నేనే కొంత నేర్పితిని. ఇది మిగుల తెలివి గలది' అని దానికథ చెప్పినది. అతండు దాని నిజమైన వెలఁదిగా నెఱింగి సాభిప్రాయముగాఁ జూచి మూర్ఛ మునింగి యెట్టకేలకు లేచి అయ్యారే! యిట్టి మోహనాంగి నెందును గని విని యెఱుఁగ దీని మేనికాంతికిఁ గుందనము తళ్కుగూడ చాలదని చెప్పవచ్చును. దీని యవయవము లన్నియు మొలచినట్లే యున్నవి అని పెక్కు తెరంగుల వర్ణించుచు పిన్నమ్మా! దీనిమాట మాయమ్మ యొకసారి నాతో జెప్పినది. జ్ఞాపకము వచ్చినది. నాకుఁ బెండ్లి జేయుమని యడిగితిని. అప్పుడామె అబ్బాయీ! నీ కొఱకు చక్కనికన్యను బెంచుచుంటిని. దానిం బెండ్లి యాడవచ్చునని సమాధానము చెప్పినది. నేఁడు నా కన్నులు ధన్యత్వమొంద జూచితినని పలికిన నది వత్సా! అలాగునా? అట్లయిన యుక్తముగానే యుండును నీ కిష్టమున్న చెప్పుము. ఇప్పుడే మీ యిద్దరకుఁ బెండ్లి చేయుదుననిన, సింహదమనుండు సంతసించుచు, పిన్నమ్మా! యిందులకు మాయమ్మ యొప్పుకొనినదిగదా! నీవును సెలవిచ్చినచో నట్లే పెండ్లి యాడెదనని పలికెను.

అప్పుడది యాచిన్నదానితో పట్టీ! ఈ కుమారుని మాయక్క పెంచుకొనినది. వీనికిఁ నిన్నుఁ బెండ్లిజేయ నిష్టపడినది. నీ యదృష్టము మంచిది. ఇట్లీ విజన ప్రదేశ మందున్నను దగిన మగనిఁ బడసితివి. ఇందు మీ యిరువురు యథేష్టసుఖంబు లనుభవింపుఁడని పలికిన యా రాక్షసి భోజనము చేయుటకై మొదటఁజూచిన యింటిలోనికిఁ బోయినది.

పిమ్మట నమ్మగువయు, వానిఁజూచినది మొదలు సజాతీయవస్తుదర్శనసంతోషము జెంది యతనిం గామించినది. సింహదమనుని హృదయంబు ననురాగసూచకములగు విలోకములను త్రాళ్ళచే నాకర్షించెను. అప్పుడు సింహదమనుఁడు పైకొనిన తమకముతో దానిశయ్యం జేరి గాఢాలింగనముఁ జేసుకొని నాతీ! నీ పేరేమి ? ఈ పాతాళగేహంబున నొంటిగా వసించి నీ యవ్వనమంతయు నీఁట గలుపుచుంటి వేమని యడిగిన నప్పడఁతి వాని కిట్లనియె.

ఆర్యా! నా తల్లిదండ్రు లెవ్వరో నే నెఱుంగను. నన్ను బాల్యమందే యిచ్చటికిఁ దీసికొని వచ్చినదట. నాకు మోహినియను పేరు పెట్టినిదియు నిదియే. నేనింతకు మున్ను నిన్నుఁగాక మరియెవ్వరిని మగవారిని జూచియుండలేదు. లోకవ్యవహారము