పుట:కాశీమజిలీకథలు -01.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిమంజరి కథ

199

చెప్పుచుండ నేను వేడుకపడినంత యిచ్చట కంపినది. మనయిల్లు చూచినది మొదలు నాకు మిగుల సంతసముగా నున్నది. మరియు నాకుఁ దినుటకు మనుష్యభోజనపదార్థము లేమైనం గలవా! యని యడిగిన నది సంతసించుచు నొక మనుష్యుల భోజనపదార్థము లననేల. దేవతల భోజనపదార్థములు కూడనున్నవి. చూడుమని అనేక శాకములు, పచ్చడులు, పిండివంటలు మొదలగు రుచిగల పదార్థములు వండిపెట్టిన తృప్తిగా భుజించెను.

భుజించిన వెనుక దాని గుట్టంతయుఁ దెలిసికొనఁ దలంచి, అమ్మా! మన యింటిలోనున్న వింతలన్నియు నాకుఁ జూపవా? లేనిచో మాయమ్మ నన్నేమి చూచి వచ్చితివని యడిగిన నేనేమి చెప్పుదును; వేగలెమ్మని తొందరపెట్టిన నది యతని మీఁద మేడలోనికి దీసికొనిపోయి వత్సా! చూడు మవిగో రత్నరాసులు, ఇది కాంచనము, ఇవి నాణెములు, ఇవి నవధాన్యములు, ఇది చిత్రశాల, ఇందులోనున్న వింతలు ద్రిలోకములలో లేవు. రమ్ము చూడుమని యాశాల యందొక మూలనున్న పెట్టెలోనుండి తళుక్కున మెరయు కన్నుగ్రడ్డు లెత్తి యతనికిఁ జూపించుచు నివి యేవియో చెప్పుకొనమని యడిగిన నతండవి యానవాలు పట్టలేక నీవే చెప్పుమని పలికెను

అప్పుడది, అయ్యో! యివియే చెప్పుకొనలేక పోయితివేమి ? ఇవి రాజు భార్యల కంటిగ్రడ్డులు కావా! యిచ్చట నొక పొడిచల్లి దాచియుంచుటచే నింకను పచ్చగాయున్నవని చెప్పిన నతండు వెఱుఁగుపడుచు పిన్నమ్మా! యొకవేళ నీ గ్రుడ్డులు ఆ రాజు భార్య నేత్రముల కమర్చినచోఁ జక్కబడునా? యని యడిగిన నది నవ్వుచు నాయనా యట్టియవసర మేటికి వచ్చును? ఒకవేళ వచ్చినచోఁ దులసియాకు పసరుతోఁ గన్నుల నంటించినచో యధాప్రకారముగా నుండునని చెప్పెను. ఆ మాటలచే గొంత సంతసించుచు నాగ్రుడ్డులున్న పెట్టె గురుతుపట్టుకొని మరియున్న వింతలు జూచుచుండ రెండు పంజరములు గనంబడినవి. వాటిలోనున్న చిలుకను గోరింకను జూచి అమ్మా! ఇవి యెందులకిట్లున్న వని యడిగెను.

నాయనా! వీని పూర్వోత్తరము వినుము. ఈ చిలుకలో మీ యమ్మ ప్రాణములును. ఈ గోరింకలో నా ప్రాణంబులు నున్నవి. వీనికి భంగము వచ్చినప్పుడే గాని మఱియొకప్పుడు మాకు భయములేదు. ఈ రహస్యము నీవు మా కాప్తుడవు గావునఁ జెప్పితిని. మరియెవ్వరికినిఁ దెలియదు. అని చెప్పుచు వేరొక్క గదిలోనికిఁ దీసికొనిపోయినది. అందునొక శయ్యయందు పదియారేఁడు ప్రాయముగల చిన్నది యొకతె యున్నది. దానియాకారవిలాసంబులకు నాశ్చర్యమందుచు నతండు పిన్నమ్మా! ఇందొక బంగారుబొమ్మ యున్నది. దీని నెందులకై యుంచితివి? ఇది నిజముగా జిన్నదిలాగే యున్నది సుమా! యని యడిగిన వినియది నవ్వుచు కుర్రా! యది బొమ్మయనుకొంటివా? కాదు: నిజమైన చిన్నదియే. ఇది మిగుల చక్కదనముగలది కావున నట్లు కానంబడుచున్నది.