పుట:కాశీమజిలీకథలు -01.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నట్లు వ్రాసినది. నీ వాయుత్తరము నా కందియ్యనిచోఁ జంపుదును సుమీ! క్షమింప వేడెదను. ఈ మాట నాయక్కకుఁ దెలియపఱచకుము. నాయందుఁ గోపము జేయును. నీవు తనకు బెంపుడ పుత్రుఁడవనియుఁ మిగుల సహాయము చేయుచున్నావనియును, చాలమర్యాద చేయుమనియు వ్రాసినది. ఇటు రమ్ము. ఇందున్న వింతలన్నియుం జూపించెదఁ జూడుము. మన యింటిలోనున్న వింత లేలోకమునను లేవు. అనేక మహారాజులం జంపి తెచ్చిన పుఱ్ఱెలమాలిక అదే చూడుము. ఇప్పుడు మీ యమ్మ మాయలోఁబడిన శత్రుంజయుని తలయు నిందులోనే చేరును. అచ్చట మా యక్క సుఖముగానున్నదియా! ఆ మధ్య నెవ్వఁడో సింహదమనుండను వీరుని యవరోధము కొంచెము తనకుఁ గలిగెనని వ్రాసినది. వాని సంగతి యేమైనదో యెఱుంగుదువా ? మీ యమ్మగుట్టు తెలిసికొనలేక రాజు భార్యయే యని నమ్మియుండెనుగద అని యనేక ప్రకారముల గుట్టువదలి మాట్లాడుచున్న దానిమాటల చేతనే యథార్థమంతయు సింహదమనునకుఁ బోధపడినది.

అతండు దానిమాటల కనుకూలముగా నుత్తరము చెప్పుచు నంతరంగంబున నిట్లు వితర్కించెను. అన్నన్నా! నాతండ్రి యెంత మూఢుడో! కంకాళియను పేరుగల రాక్షసిని సుందరి యనుకొని యంతఃపురంబునఁ బెట్టుకొనియె. అదియేకాఁబోలును మాయజేసి నా తల్లులగ్రుడ్లు పీకించి యడవికిఁ ద్రోయించినది. రాత్రుల బయలుదేరి యేనుఁగుల దినుచున్నదియు నదియే. ఈ మాట నాకప్పుడే తెలిసినచో నా కత్తికి బలిఁగా జేయకపోదునా! నా బాధ కాగలేకయే యుత్తరమిచ్చి దీనియొద్ద కంపినది. ఉత్తరములో నన్ను జంపమనే వ్రాసి యుండునుగాని, మణిమంజరి చూచి యీ యుపకారము చేసినది. ఔనౌను! జ్ఞాపకము వచ్చినది. నిద్దురపరాకునఁ బరామర్శింపలేక పోతిని గాని యప్పుడెద్దియో యుత్తరము జదివినట్లు వ్రాసినట్టు కొంచెము కొంచెము జ్ఞాపకము వచ్చుచున్నది.

ఆహా! ఆ చిన్నది చేసిన మేలునకుఁ బరిమాణమున్నదా? దీని గుట్టంతయుఁ దెలిసికొని దీనిం బరిమార్చి వేగబోయి మణిమంజరిని గాఢాలింగనము జేసికొని దాని ఋణంబు తీర్చుకొనియెదనని పెక్కు తెరంగుల దలపోయుచు దానివెంట దిరుగుచు నా యింటనున్న వింతలన్నియుఁ జూచుచుఁ నిట్లనియె.

అమ్మా! నిన్ను మాయమ్మ చాలచాల నడుగమని చెప్పినది. దాని కేమియు లోపములేదు. రాజు దానికి లోఁబడియే యుండెను. సింహదమనుండను వాఁడు అ నడుమ రెండుదినములు గస్తు దిరిగెను. గాని వాఁడు వాని దేశమునకుఁ బోయెను. ఇప్పుడు వానిబాధ యేమియును లేదు. నాతో నీ పాతాళగృహము తెరగు దరుచు