పుట:కాశీమజిలీకథలు -01.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిమంజరి కథ

203

నొంటిగా నట్టడవిలో విడిచివచ్చితిని. అది నాకై యెంత పరితపించుచుండెనోగదా! యేమి మోసమువచ్చునో! యేమృగమైనను భక్షించునేమో! యెంత తెలివితక్కువాఁడ నైతిని. అప్పటి తొందరచే దానిమాట నిదానించనైతినే యని పరిపరిగతులఁ జింతించుచుఁ గడువేగముగా నాబిడయున్న తావు జేరఁదలఁచి రెండుమూఁడు క్రోశములు నడిపించిన నంతలో ప్రాంతమున నొకపట్టణము గనంబడినది.

అప్పుడు సూర్యోదయ సమయమైనది. దారి స్పష్టముగాఁ గనంబడుచున్నది. తానున్న దారి యాపట్టణ నడుమనుండియే పోయెను. దానింబడి వేగముగాఁ బోవుచుండ నాయూరి బయట పెద్ద కాలువ యడ్డము వచ్చినది. యతని గుఱ్ఱము కాకాలువ యొకలెక్కా! సులభముగా దానిందాటిన అతని గుఱ్ఱము గమన విశేషమునకు వెరఁ గందుచు నచ్చటఁ గాపున్న రాజభటులు వేగమేవచ్చి యా గుఱ్ఱమును కడ్డము నిలిచి యతనితో గుఱ్ఱము దిగుమని పలికిరి. అంతమాత్రమున కతండు జడియక నాకు గుఱ్ఱము దిగవలసిన యగత్యమేమో చెప్పుఁడని యడిగిన వారతని కిట్లనిరి.

అయ్యా! మా రాజశాసనమును జిత్తగింపుఁడు. ఈ కాలువ దిగక యెవఁడు దాటునో వాని నాయొద్దకుఁ దీసికొనిరండని నియమించెను. అట్లు నియమించుట యేమిటికో మాకుఁ దెలియదు. మీరు దీనిం దిగక గుర్రముతోడనే దాటిరి. రాజదర్శనమునకుఁ బోదమని రాజాజ్ఞను జూపించిన నతండేమియు ననలేక యెవ్వరికైనను రాజశాసన మనతిక్రమణీయముగదాయని తలంచి వారితోఁగూడ రాజుగారి దివాణమున కరిగెను.

ఆ వార్త వినినతోడనే యారాజు సింహదమనుని కెదురువచ్చి యుచితమర్యాదలతోఁ దీసికొనిపోయి యర్ధసింహాసనమునఁ గూర్చుండబెట్టుకొని యెల్ల బందువులను బౌరులను మంత్రులను రప్పించి వారెల్లరు విన నతని కులదేశనామంబులడిగి తెలిసికొని మిగుల సంతసించుచు నిట్లనియె.

ఆర్యా! నా పేరు ప్రతాపరుద్రుఁడు. నాకు బుత్రసంతానము లేదు. చిరకాలమునకు గాంచనమాలయను పుత్రిక జనించినది. అది రూపంబునను గుణంబులను మిగులఁ బొగడదగియున్నది. వెదకి వెదకి దానికిఁ దగినఁమగనిఁ గూర్పలేక విసిగి సాధారణుని కీయ నిష్టపడక యట్టిశపథము చేసితి. ఎవ్వడు మా యూరి బయటనున్న కాలువను దిగక దాటునో వానికిఁ గాంచనమాలను రాజ్యముతోగూడ నిత్తునని మనంబున నియమించుకొంటని. నాఁడు మొదలు నేఁటివరకు దీనిం దాటినవాఁ డెవండు లేఁడు. తుదకిట్టి శపథం బేటికిఁ బట్టితినని పశ్చాత్తాపమందుచుంటివి. నేఁడు నాభాగ్యవశంబున నీవు నా ప్రతిజ్ఞాభంగము గాకుండాఁ గాలువందాటితివి. నీకు నాపట్టిని రాజ్యంబుతో నిచ్చి వేసెదను. గైకొనుమనుటయు నతండు సంతసించి యంగీకరిం