పుట:కాశీమజిలీకథలు -01.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అప్పు డప్పురుషపుంగవుండు ప్రాంతమందున్న హంసతూలికాతల్పంబు జేరి ముదితా! ఇదిగో యమృతంబు గ్రోలుచుంటిని. యెంత ద్రావినను దప్పి దీరకున్నది. దీని రుచి యేమని చెప్పుదునని పలుకుచు నధరరసం బానియాని కేళీరతుండై నంత నక్కాంత గంఠంబున నద్భుతకూజితంబు వెలయ నతనిచేతులు బెనంగి పట్టుకొనినది. వారట్లు తబ్బిబ్బగుచుఁ బెక్కుతెరంగుల మన్మథక్రీడలఁ దేలుచు ననేక విశేషములఁ దమ పాటవంబు తేటపడ నానందించిరి.

ఆయ్యవసరంబున సింహదమనుండు సొమ్మసిల్లి నిద్రాయత్తుండయ్యె. మణిమంజరియు నతనికి నిద్రాభంగము గలుగునని కదలక పాదంబు లొత్తుచుండెను. అప్పుడు ఆ యలజడిలో నతని యంగీజేబునుండి యొక యుత్తరము జారిపడినది. అది యేమియో యని యా మణిమంజరి యందిపుచ్చుకొని పై విలాసము చూచి యా లిపి పైశాచభాషలో నుండుటం జూచి యాభాష తాను జదివినదగుట నా పత్రిక విప్పి చూచిన నిట్లున్నది.

అనేక జీవహింసానిరతాత్మురాలగు మాచెల్లెలు లంబోదరికి మీయక్క కంకాళి యనేకాశీర్వచనములు. నేనిక్కడ శత్రుంజయుండను రాజును వంచనజేసి, యతని భార్యల నడవికిఁ ద్రోసి కన్నులం బెరికి వారి గ్రుడ్డుల నీయొద్ద కిదివరకే పంపితిని గదా? ఇంతవఱకును జరిగినకథ నీ వెఱిఁగినదే. మరియు నే నే యాటంకమును లేక రాత్రుల నిష్టము వచ్చినట్టు లేనుఁగులు మొదలగు జంతువులఁ జంపి తినుచుంటిని. గ్రుడ్డిరాజు ఆ సంగతి యేమియు గుఱుతెరుంగక యా హింసను గఱించి నన్నే యుపాయమడుగుచుండ నేను వానిని మోసము చేయుచుంటిని.

నాలుగు నెలల క్రిందట నీ వీరుఁ డీ యూరు జేరి యీ రాజునొద్ద నుద్యోగమునకుఁ గుదిరెను. వీఁడు రాత్రుల నద్భుతమైన గుఱ్ఱముపై నెక్కి గస్తుదిరుగుచు నా జంతువులఁ గాపాడుచున్నాడు. వీనిఁ బరిభవించుటకు నాకు సామర్థ్యములేదు. వీఁడు సాధారణుఁడు గాడు. సురాసురులైన వీని జయింపజాలరు. వీనికి మన భాషరాదు. ఈ యుత్తరమిచ్చి నీయొద్ద కనిపితిని. వీనిం బరిమార్చి నాకుఁ దెలియజేయుము. నీ యుత్తరమున కెదురుచూచుచున్నదాన.

కంకాళి వ్రాలు

అనియున్న యుత్తరము జదువుకొని మణిమంజరి గుండెమీఁదఁ జేయివైచుకొని ఆయ్యా ! యీ యుత్తరములో నేమి వ్రాసినదియు నెఱుఁగక యీ సుందరుఁడు రాక్షసియొద్ద కరుగుచున్నవాఁడు పాప మీతని కీభాష రానియట్లు స్పష్టమైనది. వీఁడు నా యొద్దకు రానిచో నిష్కారణముగా చచ్చునుగదా! దైవమే వీని కీ యుపకారము చేసేను. కానిమ్మని యా యుత్తరము దాచి మఱియు నిట్టు వ్రాసెదనని యాలోచించి నా చెల్లెలను దీవించి కంకాళి వ్రాయునది యేమంటే, ఇదివఱకు నేను నీ యొద్ద కంపిన కంటిగ్రుడ్డుల యుత్తరము మూలముగ నన్ని సంగతులు బోధపడినవి కదా!