పుట:కాశీమజిలీకథలు -01.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

లేదు. ద్వీపాంతర మందున్నది. అచ్చటికిబోయి దాని క్షేమ మరసి వచ్చువా రిచ్చట నెవ్వరు గలరు? ఏమి చేయుదును? ఇందులకే చింతించుచుంటి ననిన నతఁ డిట్లనియె.

తరుణీ! కలగన్నందులకే చింతింపవలయునా? స్వప్న మెన్నఁడేని యదార్ధ మగునా? అయినను, మన యొద్దనున్న వీరుని నంపినచో నెంతదూరమైనను దేవతాతురగముమీఁద బోయి శీఘ్రముగా రాగలడు. మీ చెల్లెలు క్షేమ మరయ నతని నంపెదను నీవు చింతింపకుము అని యోదార్చిన విని, యది సంతసించుచు నాథా! యతని వేగముగాఁ బంపవలయును. వానితో నేను గొన్ని మాటలు చెప్పవలసియున్నవి. నాయొద్ద కనుపు మనిన నతం డందులకు సమ్మతించి యప్పుడే సింహదమనులకు వార్త నంపి యా ప్రయాణ మెఱింగించెను.

ఆ బల్లిదుం డందుల కియ్యకొని సయ్యన నయ్యతివయున్న యంతఃపురమున కరిగి అది బ్రహ్మరాక్షసి యని యెఱుంగక నా పత్నిమాతయే యనుకొని యామెతో అమ్మా! నేను సింహదమనుండ. నీవు పొమ్మన్నచోటునకుఁ బోవసిద్ధముగ నుంటి అత్తావెద్దియో యెఱింగింపుమనిన సంతసించి యానక్తంచరి యిట్లనియె.

మహావీరా! నీ పరాక్రమ మిదివరకే వినియుంటిని. నీవుగాక మరియొఁక డచ్చటి కరుగనోపఁడు. వినుము. ఇచ్చటనుండి దక్షిణదిక్కుగాఁ బోయిన మళయాళదేశము మీఁద లవణసముద్రము గనంబడు. ఆ సముద్రంబు నూఱుయోజనములు దాటినంత నొక లంక బొడసూపును. అందు గనఁబడిన రాజమార్గంబునంబడి బోవఁబోవ నూఱుయోజనంబులపైన మూఁడు పర్వతంబులు జూడనగును. వానిలో నడిమిదాని శిఖర మెక్కిన విశాలంబగు పాషాణమొకటి పొడకట్టు. ఆ రాతిమీఁద నగ్ని ప్రేల్చి నాయిచ్చిన పొడి యగ్నిలో వైచినంత నా రాయి పగిలి దారియిచ్చును. ఆ దారింబోయిన మాచెల్లెలు నివసించు మందిరము గనంబడును. దానింజూచి యీ యుత్తరంబిచ్చి దానియొద్దనుండి మరల నుత్తరము తీసికొనిరమ్ము . పొమ్మని సెలవిచ్చిన నా వీరుఁ డా యువతి యిచ్చిన చూర్ణమును నుత్తరమును నందుకొని నమస్కరించి యటనుండి వెడలి తన యింటికి వచ్చెను.

తల్లులకు నమస్కరించి నే నిప్పుడు రాజుపంపున ద్వీపాంతరమున కరుగుచుంటిని. నేను వచ్చువరకు భద్రముగ నుండుఁడు. మీ కుపచారములు చేయఁదగిన పరిచారకుల నియమించితిని. నాకుఁ బోవ సెలవియ్యుఁడని వేడిన వారు సమ్మతింపక కొంతసేపు చిక్కులబెట్టిరి. కాని యెట్టకేల కతని యనునయవాక్యంబులచే నొప్పుకొనిరి. అంత నా సింహదమనుండు, జట్టివేషము బూని చంద్రహాసము చేతఁబట్టికొని యా దేవతాతురంగ మెక్కి జయపరమేశ్వరా యని శుభముహూర్తంబున నిల్లువెడలి దక్షిణాభిముఖుఁడై యాకాశమార్గంబున నరుగుచుండ సాయంకాలమున కొక పురము గనంబడినది.