పుట:కాశీమజిలీకథలు -01.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహదమనుని కథ

193

యీ రాత్రియే నారాత్రించరి బాధయుడిగించెద. సుఖముగా నిద్రబొమ్మని దైర్యముఁ బలికి యతని యనుజ్ఞ వడసి యింటికరిగి పెందలకడ భుజియించి జెట్టిలాగును గాశికోరియు బిగించి చంద్రహాసము చేత నమర్చి, యా గుఱ్ఱమెక్కి రాత్రుల వీధియందు గస్తుదిరుగఁ జొచ్చెను.

ఆ రాక్షసియుఁ బూర్వమువలెనే యర్ధరాత్రంబున గృహంబు వెడలి యా యేనుఁగులుండు తోట కరిగెను. అందు భయంకరవేషముతో గుఱ్ఱమెక్కి కత్తిఝళిపించుచుఁ దిరుగుచున్న సింహదమనునిఁ జూచి యతని బలపరాక్రమము లంతకుమున్నే వినియున్నది కావున భయపడి చేరజేర యూరక మరలి నిజనివాసమున కరిగినది. మరునా డుదయంబున రాజు రాత్రి జంతుహింస జరగమికి నాశ్చర్యపడుచుఁ సింహదమనుని వేతెరంగులఁ గొనియాడి కొన్ని దినములు రాత్రుల నా రీతిగనే గస్తు దిరుగుటకు మిక్కిలి వేడుకొనెను.

అతం డాప్పార్థివుని ప్రార్థన మంగీకరించి రాత్రి ప్రతిదినమును గాచుచుండెను. ఆ రక్కసియు ననుదినము ఇల్లువెడలి యా యేనుఁగుల భక్షింపఁ బ్రయత్నించెనుగాని యతని రక్షణలోనున్న వానిని జేరలేక చింతతో నూరక నింటి కరుగుచుండెను.

అట్లు కొన్నిదినములైన వెనుక యారక్కసి యాహారములేక స్రుక్కి యొక్కనాఁ డిట్లు తలంచెను. అయ్యో! నాప్రాణమున కీవీరుఁ డెక్కడ నుండి వచ్చెనోకదా! నాకు వీనింజేర భయమగుచున్నది. వీఁడు రాత్రుల నొక్కనాఁడుగాని యేమరక తోటలో నేనుఁగుల గాపాడుచున్నాడు. ఎన్నిదినంబు లిట్లు తిండిలేక బ్రతుకగలను. వీఁడు యీ యూరు విడిచిపోపు నుపాయం బెద్దియేని బన్నినచో నాకు నాహారము దొరుకును. లేనిచో బ్రతుకలేదని నిశ్చయించి యొక యుపాయమూహించి నాఁటి రాత్రిఁ దలగట్టుకొని పరుండి యేడ్చుచుండెను.

అది యంతయుఁ జూచి దాని దాదులు పరుగునబోయి రాజుగారితో నా వృత్తాంతము జెప్పిరి. యతివేగముగా దాని యంతఃపురము కరిగి యందు డెందము పగుల నేడ్చుచున్న యా చిన్నదానిం జూచి రాజు దీనస్వరముతో మోహనాంగీ! నీ వింత శోకింప నేటికి ? నీ కెవ్వరేని యవమానము సేసిరేమో నుడువుము. వారికిప్పుడు తగిన దండన విధింతు ననుటయు నది యతని కిట్లనియె.

నాధా! నా దుఃఖకారణము మీతో నేమని చెప్పుదును? నాకు భ్రమరవేణి యను చెల్లెలు గలదు. దాని నా పంచప్రాణములలో నొకదానిగాఁ దెలిసికొమ్ము. ఆ చక్కెరగొమ్మ యిప్పుడు రోగపీడితయై బాధపడుచున్నట్లు స్వప్నము వచ్చినది. నాకల యెన్నడును వట్టిదికాదు. నా కేమియుం దోచకున్నది. పోయి చూతమన్నను సమీపమున