పుట:కాశీమజిలీకథలు -01.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నుండు అంగడికరిగి దానిం గొనదలఁచిన వారు తొలుత నాకత్తి నెత్తి చూడవలయుం గానఁ జులకనగా నావాలు కేల నమర్చి యాతత్తిడిపై కెగిరి యచ్చటివారెల్ల జూచుచుండ క్షణమాత్రములోఁ బహుదూరము పోయివచ్చి నిలిచెను. అప్పు డచ్చటనున్నవా రాతని బలపరాక్రమములు శ్లాఘించుచు రాజునకుం దెలియజేసిరి.

ఆ నృపతి యద్భుతము జెందుచు అట్టివీరుం డెవ్వఁడు? వాఁడు నాకొలువున నుండినచోఁ గోరిన వేతన మిత్తునుకద! పోయి చూచెదంగాక యని కడువేగముగా నతనియొద్ద కరిగెను. సింహదమనుని రూపంబు జూచినంత రాజుమిగుల వెరగు పడుచు నౌరా! యీ కుమారుండు సుకుమారుండు. ఇతని పరాక్రమమేగాక సౌందర్యము గూడ ననన్యసామాన్యమై యున్నది. ఇట్టివాఁడు నాయొద్ద వేతనంబునకు నిలుచునా? వీఁడు నిజముగా దలఁచికొనినచో నారాజ్యమే కాదు భూలోకమంతయు తన వశము జేసికొని పాలింపగలఁడు అయినం బ్రార్థించి చూచెదంగాక యని యతనితో వినయముగా ఆయ్యా, యీగుఱ్ఱమును సవారు చేసినవారు తమరేనా? మీ దేశ మేమి? మిమ్ము గన్న తలిదండ్రులెవ్వరు? వారెట్టిపుణ్యము చేసిరోగదా? యెవ్వరేని మీకుఁ దగినవేతన మిచ్చినచో నుందురా? అని యడిగిన సింహదమనుం డారాజు తన తండ్రియని యెఱింగియు నింకను తన్నెఱింగింపరాదని యతనితోఁ గులదేశనామంబుల మఱుగుపెట్టి చెప్పి యీగుఱ్ఱమును నాకుఁ గొనియిచ్చి నెలకు నూఱుమాడలు జీతమిచ్చినచో మీయొద్ద నుండెదనని యుత్తరము చెప్పెను.

అప్పుడు రాజు మిగుల సంతసించుచు నతఁడు కోరినట్లొప్పుకొని యావెల కాఘోటకమునుఁ గత్తితోఁగూడ గొనియిచ్చి తన సభకుఁ దీసికొనిపోయెను. అది మొదలు సింహదమనునకు రాజసభకు రాకపోకలు గలిగియుండెను. ఆ విచ్చుకత్తిని జేతంబూని యాగుఱ్ఱమెక్కి వీధివెంబడి నరుగునప్పుడు సింహదమనుని జూడ నెంత వానికైన భయము పుట్టకమానదు.

గోపాలా! భూపాలుని వంచనజేసి రాజు భార్యల నడవికి ద్రోయించి రాత్రుల ఘోరకృత్యములు చేయుచున్న యా రక్కసి కొన్నిదినములు మాత్రము రాజునకు నమ్మకము బుట్టుటకై జీవహింససేయుట మాని తరువాత మరల రాత్రులందు బయలుదేరి పూర్వమువలెనే గజాశ్వహింస సేయదొడంగినది. రాజు పెక్కుగతుల చింతించి యెన్నియో ప్రతీకారము లాచరించెను. ఏమియు పనికివచ్చినవి కావు.

సింహదమనుఁడు తన కొలువునఁ జేరిన వెంటనే యారాజొ క్కనాఁ డతనితో నా హింస విషయమై ముచ్చటించి దానిబాధ తొలగింపుమని బ్రార్ధించెను. అప్పుడు సింహదమనుఁడు మందహాసము చేసి చంద్రహాసము జళిపించుచు రాజా! వెరవకుము.