పుట:కాశీమజిలీకథలు -01.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఘోరకృత్యమున కాటంకము చేయనోపదయ్యెను. ఇట్లెంత ప్రయత్నము చేయుచున్నను జీవహింస తగ్గినదికాదు. అందులకుఁ జింతించుచు నొకనాఁడు రాత్రి తనయింట వాల్గంటిగానున్న యా రాత్రించరితో నిట్లనియె.

ముదితా! పదిదినములనుండి రాత్రులందు మాయూరి కొకబ్రహ్మరాక్షసి వచ్చి యేనుఁగు మొదలగు జంతువులం దినుచున్నది. ఎన్ని కాపులుంచినను లెక్క సేయుటలేదు. ఉపాయమేమియుఁ దోచకున్నది. తుదకుఁ బ్రజలను గూడఁ దిన మొదలుపెట్టునేమో యని భయమగుచున్నది. నీవును బుద్ధిమంతురాలవు. నీకేమైన నుపాయము తోచినఁ జెప్పుమని యడిగిన నది నవ్వుచు మీ కేమియుఁ దెలియదు కాబోలు. వేరే యెక్కడనుండియో బ్రహ్మరాక్షసి వచ్చు చుండుటలేదు. బ్రహ్మరాక్షసులు మనయింటనే యున్నవి. మీకు గోపము రానిచో నిక్కము వక్కాణించెదననుటయు రాజు తొందరపడుచు అక్కటా! అట్టి దుర్మార్గులు నా యింటనే యుండిరా! వారిం బేర్కొనుము. ఎవ్వరైన నుగ్రదండనలకుఁ బాత్రుల చేసెదనని యడిగిన నది నాథా! మాటలతో బ్రయోజనమేమి? రేపు సూర్యోదయమునకు రమ్ము. నీకుఁ బట్టి యిచ్చెదనని చెప్పిన నొప్పుకొని యతండు నిజనివాసమునకుం బోయెను.

ఆ రక్కసి రాత్రి బూర్వమువలె బయలుదేరి తోటలోనున్న పట్టపుటేనుఁగను పట్టిచంపి మాంసఖండబులం దినక రాజభార్యల వంటశాలలోఁబెట్టి యెప్పటియట్ల యంతఃపురమునకుం బోయెను. అంతమరునాఁడు రాజు దానియొద్దకుఁబోయి వాల్గంటీ! మన యింటనున్న రక్కసులెవ్వరో చూపించమని యడిగిన నది నవ్వుచు దేవా! మఱి యెవ్వరునుకారు. దేవరవారి భార్యలే! వారే రాత్రులు బయలుదేరి యిట్లు చేయుచున్నారు. దృష్టాంతము కావలసినచో వారి వంటశాలలఁ బరీక్షించుకొనుఁడు. రాత్రి చచ్చిన మృగముల మాంసఖండము లుండక మానవని పలికిన రాజు తెల్లబోయి యేమేమి! నా భార్యలే యట్టిపని చేయువారు? చూచినంగాని నమ్మనని యప్పుడే వారి యిండ్ల కరిగెను.

వారి వారి వంటశాలల భటులచేఁ బరీక్షించి యందు రాత్రి చచ్చిన భద్రగజము యొక్క మాంసఖండము లుండుట జూచి మితిలేని కోపముతో మరల నా రక్కసి యింటికరిగి తరుణీ! నీవు చెప్పినది యథార్థమే. నేను దెలిసికొనలేక పెక్కు చింతబోయితిని. ఈ రహస్యము నీ వెట్లు గ్రహించితివి? కటకటా! భార్యలని యెక్కుడు ప్రేముడిగాఁ జూచినందుల కెంత ఘోరకృత్యములు చేయుచుండిరో చూచితివా! సామాన్యపు రాజస్త్రీ లనుకొంటిగాని రక్కసులని యెఱుంగనైతిని. వారి కేమి శిక్ష విధింపవలయునో నీవే చెప్పుమని యడిగిన నది సంతసించుచు విట్లనియె.