పుట:కాశీమజిలీకథలు -01.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహదమనుని కథ

187

యదార్ధముగా నీవు నే చెప్పినట్లు చేసెదవేని నీవెంట వచ్చెదను. నిదానముగా విచారించి మరలఁ జెప్పుము. ఇంతకుమున్ను నీకుఁ గలిగియున్న భార్యలవలన నీకుఁ జిక్కులు రాఁగలవని యమ్మగువ పలికిన వచనంబులు విని యింతయేని సంకోచింపక యతం డిట్లనియె.

అబలా! నీవు వచ్చినం జాలును పదివేలమంది నీకు సాటియగుదురా! నీవు చెప్పినట్టు చేయుట యేమి యాశ్చార్యము? నాతో రమ్ము. నా మాటల సత్యాసత్యములు నీకే విశదములగునని పలుకుచుండ నా వగలాడి సంతసించుదానివలె నభినయించుచుఁ గొంచెములేచి యతని కంఠంబు బిగియ యమపాశంబులం బోలు హస్తంబులఁ దగిలించి గాఢాలింగనము జేసికొనుటయు నుల్లంబు గరంగి యక్కురంగనయనను స్వీకరించి కొంతతడవు తులలేని వేడుకతోఁ గైదండ యొసంగి మెల్ల మెల్లన నడపించుచుఁ గ్రమంబున సేనాముఖంబును కలిసికొని యామెతోడం గూడ రథంబెక్కి చతురంగబలంబులు గొలువఁ బురంబున కరిగెను.

అది యొక బ్రహ్మరాక్షసి. ఆ రాజును మోసము జేయఁదలఁచి యట్టిరూపము పూనియున్నది. పాపమా భూపాలుం డా కపట మెఱుంగక నిజముగా రాజనందనయే యనుకొని కాళరాత్రివలె దాని బురంబునకుఁ దీసికొనివచ్చి యందొక సుందరమందిరము దానికి నివసింపనిచ్చి తగిన యుపచారములుచేయు బెక్కండ్ర దాసదాసీజనంబుల నియమించెను. మరియు నిత్యము దానికి భుజింప సన్నబియ్యము మంచికూరలు శక్కరఘృతఫలాధికమగు నాహారపదార్థములఁ బంపుచుండునుగాని యవి యారక్కసి కేమి లెక్క. దాని నాకలిదీరక రాత్రులందా రాకాసి రహస్యముగా నిల్లు వెడలి రాజుగారి యేనుగులలో నొకదానిని భక్షించి తెల్లవారునంత మరలివచ్చి యంతపురములో నెప్పటియట్ల నివసింపుచుండును. ఆ రీతి బ్రతిదినంబును నర్ధరాత్రంబునం బయలుదేరి యేనుగులను గుఱ్ఱములను లొట్టియలను భక్షింపుచుండ గారణము తెలియక కావలివార లొకనాఁడు రాజునొద్ద కరిగి యిట్లనిరి.

దేవా! పదిదినములనుండి యొక బ్రహ్మరాక్షసి మన యూరిమీదఁబడి తోటలోని యేనుగులను గుఱ్ఱములను లొట్టియలను దినుచున్నది. నిత్యము అర్ధరాత్రంబున వచ్చుచుండును. ఆ చర్యను రహస్యముగానుండి నిన్నఁ గనిపెట్టితిమి. రక్తమును మాంసమును మాత్రము బీల్చి యెముకలు మిగుల్చును. దేవరవారు దాని కెద్దియేని ప్రతిక్రియ జేయనిచోఁ గొలఁదికాలములోనే మన యేనుఁగులు గుఱ్ఱములు లొట్టియలు నాశనమగును. అని యెఱింగించిన నదరిపడి యతం డేమేమి! బ్రహ్మరాక్షసి వచ్చినదా? దానిఁ బారగొట్టుట దుర్ఘటమే యని పలుకుచు వారివెంటబోయి యా యాస్థానములో నున్న జంతుశల్యంబులఁ బరీక్షించి వగచుచుఁ దక్షణమే రాత్రులయందు గస్తు దిరుగుటకై పెక్కండ్ర శూరుల నియమించెను. వారి కాపుదల యేమియు నా రక్కసి