పుట:కాశీమజిలీకథలు -01.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వధూటీ! మాటాడవేమి? నన్ను జూచిఁ సిగ్గుపడుచుంటివా? నన్నన్యునిగా భావింపక నీ వృత్తాంత మెఱింగింపుమని తరిమి తరిమి యడిగిన నక్కపటపు టక్కులాడి యొక్కింత తలయెత్తి నాతో నీ కేమి పనియున్నది? నీ వచ్చిన త్రోవం బోవ రాదా? యేకాంతముగానున్న కాంతల బురుషులు పలుకరింపవచ్చునా? చాలు చాలు. మగవారి చెయువులు నే నెఱుఁగనివి కావు. మొదట మృదువైన పలుకులచే మదవతుల మతుల గరగించి పిమ్మట జిక్కులు పెట్టెదరు. నన్నూరక పలుకరింపకు. నీ త్రోవంబట్టి పొమ్మని నిరసించి పలికిన నక్కలికి మాటలచే ననురాగ మంకురింప నతఁడు మెల్లన నిట్లనియె.

వాల్గంటీ! అట్లంటి వేమి? మగవారి గుణంబు లేమి పరిశీలించితివి? నన్నుఁ బురుషసామాన్యునిగా దలంపకుము. నీ కథ తెలుపుము. పిమ్మట నా యభిప్రాయ మెఱింగించెద ననుటయు నప్పాటలగంధి ఆహా! రాజుల మాటలు మరియు నమ్మఁదగినవే. అడవియం దేకాంతముగానున్న శకుంతలను మోసముచేసి క్రీడించి పిమ్మట నిడుములు పెట్టిన దుష్యంతుని కథ నీ వెఱుఁగవు కాబోలు. మొదట నతండును నింతకన్న నెక్కుడు మాటాడలేదా? మరి మాటాడక నీ దారిని నీవు పొమ్మని పలికిన నమ్మగువ పలుకులు రాజహృదయమునకు లంకెలై తగులుకొనిన మించిన తమకముతోఁ గ్రమ్మర నిట్లనియె. నారీమణి! సారెకు నన్నిట్లు వట్టిమాటల నలయించనేల. నీ పలుకులచేతనే నీవుఁ బెండ్లి కానియట్లు తోచుచున్నది. బాలా! విను, నన్ను నీవు స్వీకరించినచో సర్వకృత్యములయందు నీవు చెప్పినట్లు నడుచువాఁడు. పెక్కేల, నా రాజ్యంబే నీ యధీనంబు జేయుదు. నీ తెరం గెరిగింపు మనిన, నల్లన నవ్వుచు నక్కురంగనయన యిట్లనియె.

రాజా! అట్లైన నా కథ వినుము. నేను అవంతీశ్వరుని కూఁతురును నా పేరు సూర్యప్రభ. నాకు జవ్వనము పొడసూపినంత మా తండ్రి వివాహముసేయ ప్రయత్నించెను గాని మగవారి ద్రోహకృత్యము లెఱింగిన నాకు వివాహమునందే యిష్టము గలుగమిఁవలదని మా తండ్రితోఁ జెప్పితిని. అతండును నాకు బెక్కు తెరంగుల బోధించెను. నా యనుమతిలేని యప్పుడేమి చేయగలఁడు? అట్లు నేను కన్యాత్వవ్రతంబు బూనియున్న యప్పు డొకనాఁడు సిద్ధవ్రతుం డను యోగి వచ్చెను. అమ్మహానుభావునకు శుశ్రూషచేయ నా తండ్రి నన్ను నియమించెను. నేనును ఆయనయందు భయభక్తి విశ్వాసములు గలిగి శుశ్రూషఁ జేసితిని. దాని కతండు మెచ్చి వెళ్ళబోవునపుడు నన్ను పిలిచి నీ కెద్దియేని యిష్టమైన వరం బడుగుమనిన నే నేమియుఁ గోరక మనోహరోద్యానవనమునం దేకాంతముగా విహరింప వేడితిని.

అత్తపోధనుఁడు సంకల్పమాత్రంబునం బ్రభవించిన యీ యుద్యానవనంబు నా యధీనంబుజేసి యెక్కడికేని జనియె. నేనును మా తండ్రి యనుమతి వడసి నాఁటి నుండియు నిందు గ్రీడించుచుంటిని. ఇంతకుమున్ను నిన్నుగాక యిందువచ్చిన వారినిఁ గానను. నిన్ను జూచిననాటఁగోలె నా డెందమునఁ గామక్రీడాభిరతి జనించినది. కాని పూర్వుల చర్యలఁ దలంచుకొనినంత స్వాంతము విరాగ మందుచున్నది.