పుట:కాశీమజిలీకథలు -01.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వ్రాసిన యాచీటి బ్రాహ్మణుల చేతి కిచ్చి యంపిన వా రతిరయంబునఁ గృష్ణదేవరాయల నగరికిఁ జని యా వాచిక మారాజున కెఱింగించిరి. సంతసముతో నతండప్పుడ వచ్చి నిలిచియున్న తిమ్మర్సున కా చీఁటి చూపి యిట్లనియె.

మిత్రమా! నీ యుద్యమ మూరకపోవునా! ఇదిగో చూడుము. నేను గోరిన చిన్నది నన్నే కోరినది. నాకుఁ బెండ్లి కాఁగలదు. వేగమ వివాహసన్నాహము గావింపుమని పలికిన విని నవ్వుచు తిమ్మర్సు రాయల కిట్లనియె. ఔనౌను నీ పెండ్లి జేయుటకే వా రీశుభలేఖ నీ కంపిరి. పాపము నీ వాకపట మెరుఁగక అందలి యంశము లన్నియు నిక్కువమని నమ్మి సంతసించుచుంటివి. వారి యుద్యోగము వినుము. మనము అంతఃపురభంగము జేసితిమని తెలిసికొని కోపముతో నా రాచచిన్నది నిన్ను వివాహమిషచే నచ్చటికి బిలిపించి చంపనిశ్చయించినది. దీనికే సమాధానము చెప్పలేనిచో నా బుద్ధిసూక్ష్మత యేటిది? దీనికి దిరుగ సమాధానము పంపవలసియున్నదని యప్పుడే యిట్లు వ్రాసెను.

"గోపాలభూపాలుఁ డంపిన శుభలేఖార్ధములు చదువుకొని యెంతయు సంతసించి కృష్ణదేవరాయలు వ్రాయునది యేమనగా: మీ కన్యకను స్వీకరించుటకు సమ్మతించడమైనది. మీ శుభలేఖ ప్రకారము తరలివచ్చుటకు మాలో నాచారములేదు. మాకు మారుగా గులాచారప్రకారము కత్తి పంపుచుంటిమి. గనుక వైవాహికక్రియలన్నియు దానికే జరిగించవలయును" అని వ్రాసి యొక కత్తితో నా లేఖను మున్నువచ్చిన బ్రాహ్మణుల చేతికిచ్చి యంపివేసిరి.

అట్టివానిం జదువుకొని యా చిన్నది భళిరే! ఇప్పటికి దాటిపోయిరి. కానిమ్ము. ముందైనను దొరకరా! యెప్పటికైనం బగ సాధించెదం గాక యని మరికొన్ని దినములు గడచిన పిమ్మట తండ్రి పేరుపెట్టి మరల నొక చీటి వ్రాసినది .

"మీ యాజ్ఞానుసారముగాఁ గత్తికి బెండ్లి జేసితిమి. ఇది వసంతకాలముగాన, మీరువచ్చి పైకార్యములు జరిగించుకొనవలయును" అట్టి చీటిం జదువుకొని రాయలు కొంత సంతసించి యంతలో తిమ్మర్సు మాట జ్ఞాపకము తెచ్చుకొని యది కపటమని తెలిసికొని తిమ్మర్సును బిలిపించి యతనిచేఁ బ్రత్యుత్తర మిట్లు వ్రాయించెను. ప్రస్తుతము మాకు రాజ్యకార్యములు తొందరగ యున్నవి. వచ్చుటకు వీలులేదు. తీరికజేసికొని ముందు జాబు పంపెదమని వ్రాసినదానిం జూచి యా చిన్నది కొంచెము చింతించి కానిమ్ము. యెప్పటికైన రాకపోవునా? వాఁడు దొరకకపోవునా? యని యోపికపట్టి మరి కొన్నిదినములు గడపినది. ఇట్లు రెండు సంవత్సరము లుత్తరప్రత్యుత్తరములు తోడనే కాలము జరిగినది. కావి యామె కోపము దగ్గినదికాదు.