పుట:కాశీమజిలీకథలు -01.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

179

గాని నేను భుజింపను . వారిని వెదకిపట్టి తెప్పించి నామ్రోల జంపించినం జంపింపుఁడు లేనిచోఁ బ్రాణంబులు విడుతునని, యెక్కుడుపట్టుగాఁ బలికిన కూఁతు నోదార్చి రాజు మిగులఁ గోపముతోఁ నా క్షణము యాకారములు వ్రాసియిచ్చి, వారు గనబడినచోట రెక్కలు విరుగఁగట్టి నాయొద్దకు దీసికొనిరండని యాజ్ఞాపించి నలుదిక్కులకుఁబంపెను. రాజభటులలోఁ గొందరు వారి నెందును గనుగొనలేక విసిగి మరలివచ్చుచుండఁ ద్రోవలోఁ కాశికరుగుచున్న యిద్దరు బ్రాహ్మణులు కాలవశమున వారి కన్నులం బడిరి.

వీరినే వారనుకొని రాజసేవకులా పాఱులకు సంకెళులువైచి రాజసముఖమునకుఁ దీసికొనివచ్చి రాజద్రోహులం బట్టితెచ్చితిమని విన్నవించిన రాజు వారినందరఁ గూతునొద్ద కనిపెను. బుద్ధిశాలినియగు నమ్మగువ వారింజూచి నవ్వుచు మందులారా! వీరు అంతఃపురద్రోహులుకారు. వీరు నిజముగా బ్రాహ్మణులే, నిష్కారణముగా వీరినేల బట్టితిరి? తిమ్మర్సుతోఁ గూడికొనియున్న రాయలు మీకుదొరుకునా! పోపొండని వారి నదల్చి నిరపరాధులమని మొరపెట్టుచున్న యాపాఱుల కపారసువర్ణం బిచ్చి సంతోషము గలుగఁజేసెను.

పిమ్మట మఱికొందరు రాజభటులువచ్చి అమ్మా! వారు మీరనుకొనునట్లు రాయలును మంత్రియేసుఁడీ! అంచెగుఱ్ఱములెక్కి పరుగిడుచుండ మేమడ్డము వెళ్ళితిమి గాని వారు విచ్చుకత్తులతో మమ్ము బరాభవించిరి. వారికి వెరచి పారిపోయివచ్చితిమి. వారు సాధారణముగా మాకు వశమగుదురా! యెద్దియో, యెక్కుడు ప్రయత్నమున వారిం బరిమార్చ యత్నించుమని పలికి తమ నివాసంబుల కరిగిరి. పిమ్మట నక్కాంత యత్యంతసంతాపముతో అన్నన్నా! నేనొక నీచజాతుల కన్నులంబడితిని కదా? ఒక యధముని కన్నులంబడి వేరొకని నెట్లు పెండ్లి యాడుదును? అయ్యయ్యో! ఆ దురాత్మున కేమి లాభము వచ్చినది? అంతమాత్రముననే నేను వానిం బెండ్లి యాడుదు ననుకొనెనా? తిమ్మర్సుయొక్క బుద్ధినైపుణ్య మంతయు నాయెడ వినియోగ పరచెనే. కానిమ్ము. ఆ దురాత్ము నెట్లయినను సాధించి పిమ్మటఁ బ్రాణంబులు విడుతు నని నిశ్చయించి తండ్రికిఁ గొన్ని రహస్యములు బోధించి యతనిచేఁ గృష్ణదేవరాయల కిట్లు శుభలేఖ వ్రాయించినది.

"రాజాధిరాజ రాజపరమేశ్వరాది బిరుదాంకిత కృష్ణదేవరాయ మహారాజుగారి సన్నిధికి గోపాలవల్లభుఁడు వ్రాయు శుభలేఖార్థములు ఆధునికనృపాలురలో నధికవిఖ్యాతిగల మీకు సకలవిద్యాపరిపూర్ణయగు కళానిలయ యను సార్ధకనామముగల మదీయతనూజ నిచ్చి వివాహము జేయ నిశ్చయించినారము గాన నిందువ్రాసిన శుభముహూర్తమునకు సకలపరివారసహితముగాఁ తరలి రాఁగోరుచున్నాను" అని