పుట:కాశీమజిలీకథలు -01.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రేపు ప్రొద్దుట సభచేయుదముగాక యని యడిగిన నా తొయ్యలి యయ్యా! తొందర పడకుఁడు. కొంచెమైన ప్రసంగము జరుగలేదు. మీ మాటలకు సమాధానము చెప్పఁ నప్పువడియుంటిని. తగిన యుత్తరంబిచ్చెదఁ గూర్చుండుఁడని పలికిన నతఁ డంగనా! మరల వత్తుము బాగుగా నాలోచించి యుండుము. పిమ్మటఁ జెప్పెదవుగాని యని పలుకుచు దటాలున లేచి యొడలెఱుంగక మోహపరవశుండైన రాయలను హస్తంబు బట్టి లేవనెత్తి యతనితోగూడ నతిరయంబున నడుచుచు, ముందు సింహద్వారమునఁ జేతు లడ్డముగాఁబెట్టి నిలువఁబడియున్న యొక చాకలివానిఁ జూచి తిమ్మర్సు రాజుతో నిట్లనియె.

రాజా! ద్వారమున కడ్డముగా నిలిచియున్న చాకలివానిం జూచితివా ! ఆ చిన్నది మన స్థితిని గ్రహించి పరీక్షించుటకై యటు నిలిఁపినది . మన మిప్పుడు వానినిఁ జేతులు తీయుమని పలికినంతలో మనలను రాజభటు లాటంకము చేయుదురు. వాని చేతుల క్రిందనుండి దూరియుఁ బోరాదు. దీనికి నేనొక యుపాయముపన్ని వాని చేతులు దీయించెదఁ నంతలో నీవు దాటిపోవలయును. లేనిచో మోసము వచ్చును జుమీ! యని పలికిన సింహద్వారము దగ్గరఁబోయి తిమ్మర్సు రెండుచేతులు పాలనం బునఁ జేర్చి, యోహో! చాకలి మడేలుగారా! దండాలు, దండాలు దండాలండో యని, పెద్ద యెలుంగునం బలికెను. వాఁడెంత దిట్టముగా బోధింపబడిన వాఁడై నను బ్రాహ్మణుఁడు నమస్కరించినంత నూరకుండలేక మరల రెండుచేతులు జోడించి అయ్యయ్యో మీరు గొప్పవారు నాకుదండము పెట్టవచ్చునా? మీకేదండాలని పలుకుచుఁ జేతులెత్తినఁ గృష్ణదేవరాయలు దాటిపోయెను. రాజశాసనము జ్ఞాపకమువచ్చి వాఁడు అయ్యో! మోస మయ్యెనే! నన్నుఁ జేతులు తీయవలదని చెప్పినమాట మరచి దండము పెట్టుటకైఁ జేతులు తీసితిని. ఆ సమయంబున నాతఁడు దాటిపోయెను. రెండవానిని మాత్రము దాట నీయనని రెండుజేతు లడ్డముగాఁ బెట్టెను.

అప్పుడు తిమ్మర్సు బ్రాహ్మణుఁడే కావున వానిని జేతులు తీయమనకయే బాహువులు సందునుండి దూరిపోయెను. కోట దాటినతోడనే రాయలు మంత్రియు నంతకుబూర్వమే సిద్ధపరచియుంచిన యంచెగుఱ్ఱములెక్కి ప్రచ్ఛన్నముగా నిల్లుజేరిరి. బుద్ధిమంతుల కసాధ్యమైన పనులుండునా? వారఱిగిన వెనుక జరిగిన కథ యంతయు నా చాకలి, రాజసమక్షమందా చిన్నదాని కెఱింగించిన విని కళానిలయ యతిశోకముతో వారెంత మోసము చేసితిరో చూచితివా? నిజముగా బ్రాహ్మణులు గారని నేనెంత చెప్పినను వినకుంటివి. తిమ్మర్సు మాయజేసి చాకలివానిచే జేతులు తీయించి రాజును దాటించెను. తాను బ్రాహ్మణుఁడు. అభిమానము వహింపక దూరిపోయెను. దొరికినవారిని వృథాగా వదలితివిగదా! దాసీపుత్రుఁడు నా మానభంగము జేసెను. వానిం జంపించినం