పుట:కాశీమజిలీకథలు -01.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

177

క - ఏమి చెవులు మూసికొనుచున్నారు? నా చదువు మీకుఁ కర్ణకఠోరముగా నున్నదా?

అనుటయు తిమ్మర్సు కళావిలయ కిట్లనియె. కాంతా! దాని యర్థము మాట పైన చూచుకొందము కాని ముందు నీకు వేదము చదువ నధికార మే గ్రంథములోఁ జెప్పబడినదో చెప్పుము. స్త్రీ మూలమునుండి వేదోచ్చారణము వినినవాని చెవులలో యమదూతలు సూదుల జొనుపుదురని శాస్త్రములు చెప్పుచుండలేదా? అనిన విని నప్పడఁతి యుల్లము ఝల్లుమన నేమియు బలుకలేక తెల్లబోయి యొక్కింత తలవాల్చి యంతరంగమున నోహో! ఇతం డెవ్వఁడో గూఢవేషుఁడువలె నున్నాఁడు. ఇంతకు మున్ను వచ్చిన పండితులలో నొక్కండైన నన్నీ ప్రశ్న చేయలేదు. వారు ధనకాంక్షచే నట్లు బలుకలేకపోయిరి. ఇతనికి ధనమం దాశ లేనట్లు తోఁచుచున్నది. కపటంబున నన్ను వంచించుటకై వచ్చినవానివలె నున్నాడు. పరీక్షించెదగాక యని గోడ ప్రక్కల వ్రేలంగట్టియున్న చిత్రపటంబులన్నియు బరిశీలించి చూచి వీరా! తెలిసినది . ఇతండు తిమ్మర్సు. నన్నుఁ దదేకదృష్టిగాఁ జూచుచున్నవాఁడు కృష్ణదేవరాయలు. రాయలకు నాయందనురాగము గలిగియున్నట్లు ఇంతకుమున్నే వినియుంటిమి. అతండు నన్నుఁ జూచుటకై యిట్టి వేషము వైచుకొని తిమ్మర్సుతోఁగూడ వచ్చెను. ఈతండు తిమ్మర్సు కానిచో నన్నిట్లు వంచనచేసి మాట్లాడగలఁడా? అయ్యయ్యో! ఈరాజు నా మానభంగము జేసెనే. ఈ దాసీపుత్రుఁడు నన్నుఁజూడ నర్హుడా? చీ! ఈ నీచుని జంపించినను నాకు దోషములేదు. వీనిని పట్టించెదనని, తిమ్మర్సుతో మాట్లాడుచునే వీరు కేవలము బ్రాహ్మణులుకారు. ఒకఁడు కృష్ణదేవరాయలును, రెండవవాఁడు అతని మంత్రి తిమ్మర్సును నన్నుఁజూచు తాత్పర్యముతో వారిట్టి వేషములు వైచుకొనివచ్చిరి. నా మానభంగము చేసిరి. వీరి నురిదీయ నాజ్ఞయిండని యొక చీఁటివ్రాసి తండ్రికనిపినఁ దానిం జదువుకొని యతం డయ్యో పాప మూరక యింటికి వచ్చిన బ్రాహ్మణులం జంపుమని వ్రాయుచుంటివేమి? రాయలును మంత్రియు నిట్టి వేషముతో నిచ్చటి కేల వత్తురు ? నీవు తలంచినది యసత్యము . వారు వీరగుటకుఁ దగిన నిదర్శనము జూపించిన వెనుకగాని యట్టి యాజ్ఞ యియ్యనని, మరల జీఁటివ్రాసి కూఁతున కంపెను.

దానిం జదువుకొని కళానిలయ అయ్యో! మా తండ్రి యేమియుం దెలియని వాఁడు యెక్కుడు నిదర్శన మిచ్చినగాని యట్టిపని చేయఁడు. ఆలస్యమైనచో గ్రహించి వీరు లేచిపోదురు. కానిమ్ము నే నొక మార్గంబున వీరి నానవాలు పట్టజేసెదనని యూహించి యత్తెరగంతయు జీటిలో వ్రాసి తండ్రి కనిపెను. ఆ రాజు చీఁటిలోనున్న ప్రకారము జరుపఁ బరిచారకుల నియమించెను.

ఆ చిన్నదాని తొట్రుపాటంతయుం జూచి తిమ్మర్సు తమ్మా కొమ్మ గ్రహించి యెద్దియో మోసముచేయఁ బ్రయత్నించుచున్నట్లు తెలిసికొని యచ్చేడియతో, మానినీ! మాకనుష్ఠానమునకు వేళ యతిక్రమించుచున్నది. పోయివత్తుము, సెలవిమ్ము. మరల