పుట:కాశీమజిలీకథలు -01.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

జొచ్చు నతని వెత యెఱింగి తిమ్మర్సు అట్టె నిలబెట్టి వయస్యా! ఇది యేమి! ప్రతిమఁ జూచినంతనే యింత వికారమందుచుంటివి. నిజముగా నాగజయానత జూచినచో మన గుట్టు బయలు పెట్టెదవని తోచుచున్నది. అట్లు చేసినఁ బ్రాణహానియగును సుమీ ! యెంత తమియున్నను మనంబుననే యడంచుకొని యూరక, వెఱ్ఱిచూపు చూడక యెద్దియో మిషచేఁ దదీయరూపవైభవంబంతయుఁ జూచి, నేత్రపర్వంబు గావించు కొనుము. ఇది బాగుగా జ్ఞాపకముంచుకొనుము. ఇఁక నీకుఁ జెప్పుటకు వీలుండదు. కళానిలయ వచ్చువేళ యైనదని బోధించు సమయమునఁ గళావతి చెలికత్తెయొకతె ప్రక్కనున్న గుమ్మమునకు భిత్తికాతుల్యముగాఁ గన్పడియున్న తెరదప్పించుకొని వచ్చినఁ జూచి రాయలు, గళానిలయయే యనుకొనెను గాని, తిమ్మర్సు చేసిన కనుసన్నచే యట్లూహించుకొనెను. కాని అదియు వారి తెలివిని బరీక్షించుటకై కళానిలయచేఁ బంపఁబడినది. కాని దాని యాటమి తిమ్మర్సునొద్దఁ బనికివచ్చునా? అది యాకారంబున నెక్కుడుగా నున్నను దాని హస్తపాఠంబుల కాఠిన్యమునుఁ బరీక్షించియే తిమ్మర్సు దాని గురుతుపట్టెను. అదియు నిటునటు నొక్కింతసేపు తిరిగి వారు తన్ను దాదిగాఁ దెలిసికొనిరని గ్రహించి వారి బుద్ధకౌశల్యమునకు మెచ్చుకొనుచు నందొక త్రాడులాగిన జల్తారుతోను, బట్టతోనుఁ గట్టబడిన యొక విచిత్రపు జాలరు వారి ముందుగ వ్రేలఁబడినది.

పిమ్మట నాకొమ్మయు లోనికరిగి యత్తరుణితో అమ్మా! వారు విద్యలనెట్టివారో నాకుఁ దెలియదు. లౌకికమం దసమానప్రజ్ఞల గలవారుగా నున్నారు. వారు విద్యలలో నిన్ను జయింతురేమోయని భయమగుచున్నది. ఇదివరకు వచ్చిన పండితు లెల్లఁ నన్నుఁ జూచిన నీవే యనుకొని మర్యాదగా లేవబోయి మాట్లాడుచుండిరి. వీరు నన్ను గౌరవింపక పల్కరింప మానివేసిరి. వీరితోఁ గడుతెలివిగా మాట్లాడవలయుఁ జుమీ యని బోధించిన సంతసించుచు నా కళావతి విద్వజ్జనులు మ్రోలమాట్లాడఁదగిన యలంకారము వైచుకొని యాచెలికత్తెల కైదండంగొని హంసగమనంబునం జనుదెంచి మెఱపువలెఁ దళుక్కుమని మెరయుచు నాగదిలోఁ బ్రవేశించుటయు, అది కళావతియని రాయల కెఱింగించుచు లేవఁబోవున ట్లభినయించుచుండ నయ్యండజయాన హస్తసంజ్ఞచే వారించి నమస్కరించుచు నిట్లనియె.

గళానిలయ - (సంస్కృతములో) శ్లో॥ యూ యంభో భజధ మహీసురా సతింమే.

తిమ్మర్సు – కళాణం భవతు కళాన్వితే భవత్యై.

కళా - దాతవ్యా నివసితుమత్ర సాధ్వనుజ్ఞా

తిమ్మ - స్థాతవ్యం సుఖమబలె బలేనవర్తుం.

అని యిట్లు సంస్కృతముతో శ్లోకపూర్వకముగా నిచ్చిన ప్రశ్నలకు శ్లోకపూర్వకముగానే యుత్తరం బిచ్చినంత వెరగుబడుచు మరల నాంధ్రములో-

కళా - క. వందినమిదె గొనుఁడు ధరా, బృందారకులార

తిమ్మ - సుందరి! కళ్యాణం బందుము