పుట:కాశీమజిలీకథలు -01.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గలిగియున్నది. ఇప్పుడు కాశి కరుగుచుంటిమి. ఈ పట్టణపు రాజునొద్ద నెవ్వరేని బండితులున్నచో వాదించి రాజుగారిచేఁ బారితోషికంబంది యరుగవచ్చితిమి. అని పలికిన విని యా కుటుంబి పక్కున నవ్వి, యీ రాజునొద్ద బహుమతిఁ తీసికొనివెళ్ళు విద్వాంసుఁడు గలఁడా! పాపము మీరెఱుఁగక వచ్చితిరి. ఈ రాజు కూఁతురు చరిత్ర మీరు వినలేదు కాఁబోలు. ఆ చిన్నది సకలవిద్యలలో నసమానపాండిత్యము గలిగి యున్నది. రూపంబునఁ ద్రిలోకకోకస్తనులుఁ దాని కీడురారు. విద్యారూపంబులఁ బరిశీలించియే దానికి నుభయార్థ ప్రతిపాదకంబగు కళానిలయ యని పేరుపెట్టిరి. ఇదివర కెంతలేసి పండితులు వచ్చినను వారిని సులభంబున నోడించి జయపత్రికల నందు చున్నది. తనకు సాటియగు విద్వాంసుఁడు లేడని పలుకుటయేగాక దేశదేశంబులకు వార్తాపత్రికల బంపుచున్నది. మరియు నది యెట్టి రాజకుమారుఁడు వచ్చి పెండ్లి యాడుమని యడిగినను దన కెనగాడని నిరసించుచున్నది. మీరా తలోదరితోఁ దులగావాదము జేయుదురని నమ్మజాలను. ఊరక మీ గౌరవమేల చెడఁగొట్టుకొనియెదరు? మఱియొకరాజు నాశ్రించరాదా? గౌరవింపక యిచ్చు బహుమానము గొనుటకంటె నీచముండునా? నా మాటవిని రాజనగరి గరుగకుఁడని యుపదేశించిన నవ్వుచు నా పాఱునకు వారిట్లనిరి.

ఆర్యా! ఆ కాంతవలన మాకు లేశమును భయములేదు. దీని తాతలవంటివారి దగ్గర జయపత్రికలను బుచ్చుకొంటిమి. మాకొక యాఁడుది లెక్కా? అనిన నతం డయ్యో! ఆ కన్యను సామాన్యముగాఁ దలంచుచున్నారే. ప్రతి పండితుఁడును మొదట నీలాగుననే బింకముగా బలుకుచుఁ దుదకు నా సుదతితో వాదించి యోడి జయపత్రిక నిచ్చి భిన్నముఖుండై యరుగుచుండును. నేను జెప్పవలసినమాటఁ జెప్పితిని. పిమ్మట మీ యిష్టమనుటయు రాయలు ఆ బ్రాహ్మణున కిట్లనియె.

అయ్యా! ఆ తొయ్యలి మిక్కిలి చక్కఁదనము గలదనియు నెవ్వరిం బెండ్లి యాడలేదనియుం జెప్పితిరిగదా? పెండ్లి యాడనిచో నా చక్కదనమునకు సాద్దుణ్య మేమి? దాని యభిప్రాయుము పెండ్లియే యాడననియా? తగిన వరుఁడు దొరకలేదనియా? దెలుపుఁడనిన నతం డయ్యా! అఖిలవిద్యాపారంగతురాలగు నయ్యంగన పెండ్లియాడక పోవుటకు జోగురాలా యేమి? తనకుఁ దగిన వరుఁడు దొరకలేదనియె మానివేసినది. అధముడగు వరుని వరించుటకంటె వాల్గంటికి హైన్యమున్నదా? మీరింత సాభిప్రాయముగా దానిగురించి యడుగుచుంటిరేమి? అయ్యబల విద్వాంసులైన బ్రాహ్మణులకుఁగాని దర్శనం బియ్యదు. వారై నను నన్యథా బుద్ధిశృంగారవిలోకనములఁ జూపిరేని గ్రహించి యుగ్రదండనలకుఁ బాత్రులుగా జేయును. ఆమెతో మాట్లాడునప్పుడు మిగుల నేర్పుగా మాట్లాడవలయును. మాటలచేతనే లోని యభి