పుట:కాశీమజిలీకథలు -01.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

171

బాయజేయుదునని విని రాజు బ్రాహ్మణుఁడా! నాకు బుద్ధివచ్చినది. యెన్నడును నిటుమీఁద నిట్టి ప్రశ్నముల నెవ్వరి నడుగను. నీ మంత్రదేవతసాక్షి యని ప్రమాణికము చేసిన తిమ్మర్సు ఆ ప్రాంతమందే పాతించన స్తంభము చెంతకుఁ దీసికొనిపోయి ఇదిగో భూమధ్యభాగము చూడుమని యా స్తంభము చూపించిన రాజు సంతసించి చూచితినిగాని నాకు నాకలియు దప్పియు నగుచున్నది. ఎట్లు తీర్చేదవో నా ప్రాణము నీ యధీనమైనదని వేడిన నతండు రాజా! చింతింపకుము. నా మంత్రశక్తిచే నాహారాదికము నిచ్చటనే పుట్టించెదనని యంతకుమున్ను ప్రచ్ఛన్నముగా నాహారపదార్థములు మంచినీళ్ళును దెప్పించి యందొకచోట దాపించియున్న వాడగుట నొక పొదరింట నుండి యవి తీసికొనివచ్చి భుజింపుమని రాజు మ్రోలనుంచెను..

రాజు వానిం జూచి యతని మంత్రశక్తికి నద్బుతమందుచు నా పదార్ధములనే నాఁకలి యడంచుకొని బ్రాహ్మణోత్తమా! నీ ఋణం బెన్నటికిని దీర్చుకొనలేను. నా రాజ్యంబంతయు నిచ్చినను సరిపడదు. నన్నింటికి జేర్పుము సాయంకాలమగుచున్నది. రాత్రి యీ యడవిలో మృగములబాధ మెండుగా నుండునని తోచుచున్నది నీ మంత్ర శక్తిఁ జూపింపుమనిన నతండు రమ్ము పోదము. నా మంత్రసామర్ధ్యమున జీకటిపడక పూర్వమే యిల్లుజేర్చెద నని పూర్వము మెలికలుగాఁ దీసికొని వచ్చిన మార్గమునగాక విదానముగానున్న దారిని నడచినంత ప్రాంతమందే పట్టణమున్నది. సాయంకాలము లోపుననే యూరుజేరిరి. రాజు తన్నుఁ జచ్చి బ్రతికినవానిగాఁ దలఁచి మరునాటిసభలో నా బ్రాహ్మణుఁడు తన ప్రశ్నములకుఁ జెప్పిన యుత్తరములకై సంతసించుటయేగాక నడవిలో దనకుజేసిన మేలును గురించి పెద్దయుందడవు స్తోత్రములు జేసెను

పిమ్మట మంత్రియు సభ్యులును ఆతఁడు పన్నిన యుక్తులకు వేతెరంగుల సంతసించి మంత్రి యాపదఁ దొలగించుటకు వచ్చిన భగవంతుఁడుగాఁ దలంచి జయ జయధ్వనులతో బెక్కు స్తోత్రములు చేసిరి. రాజును మంత్రియు, తిమ్మర్సును బుష్పములచేఁ బూజించి అయ్యా! తమకిష్టమైన కోరిక యెద్దియేని యుండిన సెలవిండు. దానంజేసి మా కృతజ్ఞత జూపించుకొనియెదమని యడిగిన తిమ్మర్సు వారితో నయ్యా! మీరు సంతసించుటకంటె నాకుఁ గావలసినది యేమియులేదు. మీ యిరువురకు మంచి వాఁడనైతి. ఇదియే పదివేలు. పోయివచ్చెదము సెలవిండు తీర్థయాత్ర కరుగుచున్న వారమని వారిచే సబహుమానముగా ననిపించుకొని యప్పురంబు వెడలి క్రమంబుగఁ గోపాలపురంబు జేరిరి. అందొక శ్రోత్రియబ్రాహ్మణుని యింట బసఁజేసిరి. ఆ విప్రుండును భక్తిపూర్వకముగా వారి కాతిథ్యం బిచ్చి భోజనంబైన వెనుక వినయంబున నాగమనకారణం బడిగిన నతనికి తిమ్మర్సిట్లనియె.

ఆర్యా! మేము విద్వాంసులము. మాకుఁ బెక్కువిద్యలలోఁ బాండిత్యము