పుట:కాశీమజిలీకథలు -01.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వేడిమి నంటుకొని మాడ నారేఁడు నడువ నాయాస మెక్కుడగుటచే నొగర్చుచుఁ బాఱుఁడా నిలునిలు మింకెంతదూర మరుగవలసి యున్నది. నాకు శ్రమగా నున్నది. నడువలేనన రమ్ము రమ్ము దాపునకే వచ్చితిమి . ఈ మాత్రమునకే యాగలేరా? అని నడుచుచుండెను.

మరికొంత దూరమరిగి యా నరపతి యేమయ్యా! నా యాయాసము చూడక యూరక పరుగిడుచుంటివి. నా కాళ్ళంటుకొనుచున్నవి. నేనిక నడువనోపఁ గొంచెము సేపు విశ్రమింపవలయు నని యడుగుచుండ నతఁ డోహో! విశ్రమింపకు విశ్రమింపకుము విశ్రమించినచో నా మంత్రశక్తి కంతరాయము గలుగును. మన మింటికి జేరలేము. ఓపికబట్టి రమ్ము దాపుచేరితిమి. భూనాభి యూరకయే కనుపించునా? యని మరల నడువజొచ్చెను.

ఆ మాటలకు వెఱచి రాజు యెంత కాళ్ళుకాలినను నొప్పి పెట్టినను గూర్చుండక యోపికతో నడువలేక మరికొంత దూరము నడిచెను. పిమ్మట దాహమై నోరెండ జొచ్చి మాటరాక అయ్యో బ్రాహ్మణుఁడా! నన్నూరక చంపెదవా యేమి? నాకు భూమధ్యభాగము జూపింపనక్కరలేదు. నాకింత దాహము దెచ్చియిచ్చి నన్నింటికిఁ జేర్చుము. నీకుఁ జాలపుణ్యముండును. ఇంటికరిగిన వెనుక నీకుఁ బారితోషిక మిత్తునని బ్రతిమాలఁదొడంగెను.

అప్పుడు తిమ్మర్సు రాజుం జూచి యింత యశక్తుఁడ విట్టి కోరిక కోరనేటికి? ఇల్లుచేరుట సామాన్యముగా లేదు. మంత్రిశక్తిన వేగము వచ్చితిమిగాని తిరుగనరుగుటకుఁ బదిదినములు బట్టును. మంత్రశక్తిని బాసి యరిగినచో మృగములు భక్షించును. రమ్ము ప్రాంతములోనే యున్నది అని యెట్లో మరికొంత దూరము నడిపించెనుగాని యతి సుకుమారవంతుఁడగు రాజు వడదాకి మూర్చపడి యేమైననుసరే యని యొక చెట్టునీడం జతికిలంబడి బ్రాహ్మణుఁడా నాకు భూమధ్యభాగ మక్కరలేదు. చూచినదాని కన్న వేయిరెట్లు సంతసించితిని. నాకు దాహముతెచ్చి బ్రతికింపుము. కొంచెము సేపులోఁ బ్రాణము పోవునట్లు తోచుచున్నది. చచ్చినవెనుక నీ ప్రశ్నములతోఁ బని యేమి? నీ మేలెన్నటికిని మరువనన యతని పాదంబులం బట్టుకొని ప్రార్థించెను.

అప్పుడా తిమ్మర్సు రాజా! నీ ప్రాణములవంటివే గదా యితరుల ప్రాణములు. అసాధ్యప్రశ్నలు వేచి యుత్తరము చెప్పలేనిచో మంత్రిని జంపబ్రయత్నించుట నీకు మాత్రము దగునా? నీ విప్పుడెంత పరితపించుచుంటివో మంత్రియు నా దివసమున నంత తపించెనే. ప్రజల న్యాయాన్యాయములఁ బరిశీలించు ప్రభువే యన్యాయముచేయ యత్నించినచోఁ బ్రజలెవ్వరితోఁ జెప్పుకొందురు. ఇటమీఁదట నిట్టి ప్రశ్నములవైచి ప్రజల బాధింపనని ప్రమాణము చేసినచో నా మంత్రశక్తిచే నీ యాపదఁ దృటిలోఁ