పుట:కాశీమజిలీకథలు -01.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

169

భగవంతునకు ననేకనమస్కారంబులు అని చదివి యిదియే భగవంతుని దినచర్యయని యూరకున్న యతని సమాధానమునకు యుక్తికిని నెల్లరు సంతోషించిరి. రాజు తిమ్మర్సు మాటలకు సమాధానము జెంది సవినయముగాఁ దన యాభరణాదికము గైకొని యా దినంబునకు మంత్రితోఁ గూడ దిమ్మర్సును బస కనిపెను.

మరునాఁడు రాజు పూర్వమువలె సభజేసి యా బ్రాహ్మణుని రాక కెదురు చూచుచున్న సమయంబున తిమ్మర్సు యొడినిండ సన్నయిసుక పోసికొని మంత్రితోఁ గూడ రాజసభ కరిగెను.

రాజు వారి నుచితమర్యాదలఁ గూర్చుండఁబెట్టి తిమ్మర్సుతో నార్యా! ఈ దినమున రెండవ ప్రశ్నము నక్షత్రముల సంఖ్య యెంత? అనుదానికి నుత్తరంబీయు డనిన నతం డెల్లరు చూచుచుండఁ దన యొడిలో నున్న యిసుకను రాజుముందరరాశిగా బోసి రాజా! నేను చుక్కల లెక్కఁబెట్టుచో నొక్కొక్క చుక్కకు నొక్కొక్క యిసుము చొప్పున వడిలోవైచితి. ఇన్ని నక్షత్రములైనవి. చూచుకొమ్ము అనిచెప్పి యా యిసుక నతని ముందరఁ బోసెను. ఆ యుత్తరమునకు సభవారందఱు నొకరి మొగం బొకరు చూచుకొనుచు నోహో! ఈ బ్రాహ్మణు డసాధ్యుడు రాజప్రశ్నములకు దగినట్లుత్తరము చెప్పుచున్నాఁడు. కుక్కకాటునకు చెప్పుదెబ్బ యనునట్లు వీని కిట్లే చెప్పవలయును. లేనిచో నక్షత్రము లెవ్వఁడు లెక్కఁబెట్టగలఁడు. అని గుజగుజలాడఁ దొడఁగిరి. ఆ నృపతి యేమియుఁ జెప్పనేరక సరియే యని యొప్పుకొని యా దినంబునకు వారివారి బసల కనిపెను.

మూడవనాఁడు తిమ్మర్సు మంత్రితో నొకచోట నొక స్తంభము పాతించుమని ప్రచ్ఛన్నముగాఁ జెప్పి మునుపటికన్న గొంచెము ప్రొద్దెక్కించి రాజసభ కరిగెను. రాజుగా రతని రాక కెదురు చూచుచు వచ్చినతోడనే బ్రాహ్మణుఁడా! నేడింత యాలస్యము చేసితివి. నీకు వేళ తెలియదా యేమి? త్వరగా మూఁడవ ప్రశ్నము (భూమికి నడిభాగ మెద్ది) అనుదాని కుత్తరంబు చెప్పుమనుటయుఁ దిమ్మర్సు అయ్యా! భూమి యనంతము గదా! దానిం జూపుటకు మంత్రశక్తి కావలసియున్నది. ఆ దేవత నారాధన జేయుచుండుటచే నాలస్యమైనది . క్షమింప వేడెదను. భూమి నడిభాగము చూడ నాస గలిగినచో దేవరవారు బాదచారులై నాతో రావలయును. ఇతరు లెవ్వరును రాఁగూడ దనిన రాజుగా రందుల కొడంబడి. యప్పుడే యతనితో భూనాభిస్తంభమును చూడ వాహనాదికము లేకయే నడువజొచ్చెను.

తిమ్మర్సు ఆ రాజుగారిని కారెండలో నడిపించుచు నిసుక త్రోవలంబడి యడవిలో ద్రిప్పుచుండ గొండొకసేపునకుఁ గ్రిందఁ బాదంబులు మీఁద శిరంబు నెండ