పుట:కాశీమజిలీకథలు -01.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

విప్రా! నీవు నా ప్రశ్నములకు లెస్సగా నుత్తరము నీయఁగలవా? అని యడిగిన నతం డివి యెట్టివో తెలుపుఁడనియె రాజు వాని మూఁటిని జదివి వినిపించి సమాధానము చెప్పుమనిన నతం డయ్యా! మీ శంకలు సామాన్యములు గావు. మూఁడు ప్రశ్నములకు నొక దిన ముత్తరమీయ శక్యముగాదు. మూఁడునాళులు గడువిచ్చినచో దినమున కొకదాని కుత్తరమిత్తును. నేఁడు దేని కుత్తరమీయవలయునో నుడువుఁడనిన రాజు దానికి సమ్మతించి మొదటి దినంబున మొదటి ప్రశ్నము, సంతతము భగవంతు డేమి చేయుచుండును? అనుదానికి నుత్తరం బిమ్మనియె.

అప్పుడు తిమ్మర్సు నిలువంబడి, రాజేంద్రా! సకలలోకనిర్మాణరక్షకుండును, సచ్చిదానందస్వరూపుండును, అవాఙ్మానసగోచరుండునగు భగవంతుని దినచర్యలు చెప్పుట సామాన్యము గాదని యెల్లరు నెఱుంగునదియే. భగవదంశచే జనించిన మీ యలంకారములు నాకిచ్చి, నా బట్టలు మీరు గట్టుకొని, మీ సింహాసనముపై నన్ను గూర్చుండబెట్టి నా యెదుట మీరు నిలిచినచో నప్పుడు భగవచ్చర్యలు చెప్పుటకు నర్హత నాకుఁ గలుగును. అనుటయు నతం డందులకు నియ్యకొని తన యాభరణము లన్నియు నూడ్చి యతనికిచ్చి యతఁడు గట్టిన పాతబట్టలు దాను గట్టుకొని యతినిఁ దన సింహాసనమునఁ గూర్చుండబెట్టి తా నతని యెదుటఁ చేతులు జోడించుకొని యిప్పుడు భగవంతుఁ డేమి చేయుచున్నాడో చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

రాజా! నే నింతకుము న్నెట్లుంటినో యిప్పు డెట్లుంటినో చూడుము. నీ వెట్లుంటివో చూచుకొనుము. మునుపు సామాన్యవిప్రుఁడనైన నే నిప్పుడు కిరీటకేయూరకటకాద్యలంకారములు దివ్యాంబరములు దాల్చి రత్నసింహాసనమునం గూర్చుండి ప్రజాపాలనదక్షుడగు మహారాజునైతిని. పూర్వము మహారాజువగు నీవిప్పుడు సామాన్య బ్రాహ్మణుడవైతివి. భగవంతు డనుదిన మీరీతిని గొప్పవానిని కొలదివానిగాను, కొలదివానిని గొప్పవానినిగాను జేయుచుండును ఈ క్షణంబున భగవంతుడు నన్ను నిన్ను, నిన్ను నన్నునుఁ జేసెను. దీనికి శాస్త్రదృష్టాంతరము-

శ్లో॥ అంబోధిః స్థలతాం జలధితాం ధూళిలవశ్శైలతాం
     మేరు ర్మృణ్కభతాం తృణంకులిశతాం వజ్రంతృణప్రాయతాం
     వహ్నిశ్శీతలతాం హిమందహనతా మాయాతి య స్యేచ్ఛేయా
     లీలాదుర్లలితాద్భుత వ్యసనినే దేవాయ తస్మై నమః॥

అనగా, సముద్రమును దిబ్బగాను, దిబ్బను సముద్రముగాను, అణువును మేరువుగాను, మేరువు నణువుగాను, తృణము వజ్రముగాను, వజ్రాయుధమును తృణముగాను, అగ్నిని మంచుగాను, మంచు నగ్నిగాను నిత్యమును జేయుచున్న