పుట:కాశీమజిలీకథలు -01.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

తిమ్మర్సు నెప్పుడును చూచియుండలేదు. కృష్ణదేవరాయల మంత్రియనియు మూడులోకముల నతనికి సమానుఁడగు బుద్ధిమంతుఁడు లేడనియు నతని చర్యలు కథగాఁ జెప్పుకొనుట విని యిట్లంటిని. మొన్న మారాజు మంత్రికి మూడుప్రశ్నము లిచ్చి వానికి నాలుగవనా డుత్తరము జెప్పలేకపోయితివేని నురి తీయింతునని కఠినముగా నాజ్ఞ చేసియున్నాడు. ఆమితి యీరాత్రితో సరిపడినది. వానికి నుత్తరము లతనికిఁ దోఁచకపోవుటయేగాక, యెవ్వరినడిగినను దగిన యాలోచనము చెప్పలేకపోయిరి. ఈలాటివానికఁ దిమ్మర్సు సమాధానముగా చెప్పఁగలడని యందఱు ననుకొనిరి గాని యంతదూర మరిగి తెలిసికొని వచ్చుటకు గడువు చాలినదికాదు. రేపే మంత్రి నురి తీయుదురు. నాకు మంత్రి మిగుల మిత్రుడగుటఁ దోచకున్నది. మీరు భుజింపుడు. నాకు నన్నము నోటికిపోదని పలికిన యజమానుని మాటవిని రాయ లతని కిట్లనయె.

అయ్యా! యీ బ్రాహ్మణుడు తిమ్మర్సునకుఁ బ్రాణమిత్రుఁడు. తీర్థయాత్రకై వెడలెనుగాని యెప్పుడు నతనియొద్దనే యుండువాఁడు, బుద్ధిచే నతనితో సమానుఁడె. ఆ మూఁడు ప్రశ్నములు నెట్టివో చెప్పుడు తప్పక నితఁడు సమాధానము చెప్పును. మీ పుణ్యము బాగున్నది. మీరు చింతింపకుఁడు మీ మంత్రి ప్రాణముల నితఁడు కాపాడగలడు. అని ధైర్యముగాఁ బలుకుటయు నతనిమాట లాలించి యత్యంత సంతోషముతో సోమశర్మ వారికి వందనములు జేయుచు నయ్యా వినుండు మా రాజు పెద్ద సభచేసి మంత్రికిచ్చిన ప్రశ్నములు :-

1. సంతతము భగవంతుడేమి చేయుచుండును?
2. నక్షత్రముల సంఖ్య యెంత?
3. భూమికి నడిభాగ మెద్ది?

అని మూడు ప్రశ్నములిచ్చి నాల్గవనాఁడు తగిన సమాధానము చెప్పనిచో నురి తీతునని యాజ్ఞాపించి మంత్రి నింటి కనిపెను. వానిలో నొక్కదానికైన మంత్రికి నుత్తరము తోచినదికాదు. ఇప్పుడే నేనతని యొద్దనుండి వచ్చితిని. అతండు భార్యా పుత్రులు చుట్టునుం బరివేష్టించి శోకింపుచుండ మరణకృతనిశ్చయుండై చింతించు చున్నాఁడు.

వీనికి మీ కెద్దియేని దోఁచినచో సెలవిచ్చి మంత్రి ప్రాణములు గాపాఁడుడు మీ పుణ్యమెవ్వరికీ రాదని వేడుకొనినఁ దిమ్మర్సు రాయలతో దీనికి మీకేమైనం దోచినదా? అని యడిగిన నతం డీప్రశ్నములకు నిజంబైన యుత్తర మెవ్వండును నియ్యజాలఁడుగాని కపటముచేసి రాజు నొప్పింపవచ్చునని పలికిన విని తిమ్మర్సు. ఔను. ఆలాగుననే చేయవలెను గాని నిజముగాఁ జెప్ప నెవ్వరి తరమని యొండొరులు మాట్లాడుకొనిన వెనుక తిమ్మర్సు సోమశర్మతో అయ్యా! ఈ కార్యము నేను జక్కబెట్టెదను. మీరు భుజింపుఁడు. భోజనంబైన వెనుక మంత్రి నొకసారి మా యొద్దకుఁ దీసికొని రండని పలికిన సంతసించి యా బ్రాహ్మణుఁడు వారితో నానందముగా భుజించిన వెనుక వేగంబున యింటికరిగి యతనితో నిట్లనియె.