పుట:కాశీమజిలీకథలు -01.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

165

అంతట వారొక్క శుభముహూర్తమునఁ దీర్థయాత్రాకైతవంబునఁ బురంబు వదలి యుకచోఁ బ్రచ్ఛన్నముగాఁ బ్రభువేషముల దీసివైచి శ్రోత్రియు బ్రాహ్మణవేషంబు వైచుకొని బ్రాహ్మణత్వం బాకృతిగైకొని నట్లొప్పుచు వేదంబులు వర్ణించుచు ధవళయజ్ఞోపవీతంబుల వ్రేళులకు జుట్టి పనసల రువ్విడుచుఁ జూచువారలకు నేత్రపర్వమాపాదించుచుఁ గతిపయప్రయాణంబు లరిగి యొకనాఁడు సాయంకాలమునకుఁ గాంపిల్యంబను పురంబుజేరి యందు బ్రాహ్మణులలో నన్నదాత లెవరని యడిగి యాపట్టణపు రాజుగారి పురోహితుండుగాఁ దెలిసికొని వారింటికరిగి సోమశర్మయను నా బ్రాహ్మణుడు అప్పుడింట లేకున్నను నతని గృహిణి వాడుక చొప్పున వారి సత్కారములనే నాదరించి వారి విశ్రమింపజేసి యతివేగంబునఁ బాకంబు గావించెను. సద్గుణవంతులగు సతులు దొరుకుట పతుల భాగ్యముగదా! ఇంతలో నాసోమశర్మయు నింటికివచ్చి యెద్దియో విచారముతో నతిథులఁ బరామర్శింపక యొకగదిలోఁ బండుకొని చింతించుచుండెను.

వంటయైన పిమ్మట నతనిభార్య యతిథులతోఁగూడ బతిని భోజనమునకు లెమ్మని పలికిన నతండు ప్రాక్షమిత్రుండగు మంత్రి రే పురిదీయ బడనుండ నాకీ రేయి నన్న మెట్లు నోటికిఁ బోవును? నీవును నతిథులు భుజింపుడు నాకన్న మక్కర లేదని యుత్తరము చెప్పెను. ఆ మాటలు విని యామె మంత్రికెద్దియు నాలోచన తోచలేదా! తోచనినాఁడు మూఁడు దినంబులు మితియిచ్చి యుండెనే ఇంతలో నెవ్వరినేని యడిగి తెలుసుకొనలేకపోయెనో? యూరక చావవలసి వచ్చెనా? పాపమయ్యయ్యో! యని వగవఁ దొడంగినఁ బురోహితుండు భార్యతో, నారీమణీ! మంత్రికిఁ దోచునంత తెలివిగలిగియున్నచో మొదటనే తోచును. ఆతనిబుద్ధి మన మెఱుంగనదియా మూఁడుదినంబులుగాదు, సంవత్సరము మితి యిచ్చినను యతనికిఁ దెలియదు. మరియు నతనికి బోధింపనంత మతిచమత్కృతిగల తిమ్మర్సులిం దెవ్వరున్నారు. పాపమత డూరక చావవలసి వచ్చినది. బుద్ధినైపుణ్యము లేనివాఁడైనను మంత్రి సుగుణంబులకే గొనియాడఁ దగినవాడు సుమీ! క్రూరులగు ప్రభువులయొద్ద నుత్తములు పనికిరారు నాకు మిత్రనాశనశోకంబుగాక వేరొక్కచింత పుట్టుచున్నది. ఈవేళ మంత్రి నురిదీయుచున్నాఁడు. రేపు నన్నెద్దియో యడిగి చెప్పలేకపోయినచో మంత్రివలె నన్ను నురిదీయ నాజ్ఞవేయును. అననుకూలప్రశ్నములకు నుత్తరం బెవ్వఁడు చెప్పగలఁడు. అవివేకరాజును సేవించుటకంటె ముష్టియెత్తుకొనుటయే యుత్తమమని చెప్పుదురు. ఎట్లయినను నీరాజు కొలువు మానుకొనుటయే మేలని విచారముతో బలుకుటయు నా బ్రాహ్మణుని మాటలన్నియు విని తిమ్మర్సు రాయలతో నాలోచించి యా విప్రుదరికరిగి యతని కిట్లనియె.

అయ్యా, మేము యజమానుఁడు భుజింపనిచో భుజించువారముకాము. మీ రెద్దియో యావన్మూలమున విచారించుచుంటిరి. ఆ యాపద యెట్టిదో యెరింగింపుడు. మఱియు నట్టి యాలోచన చెప్పుటకుఁ దిమ్మర్సులు లేరని యంటిరి. తిమ్మర్సును మీ లెరుగుదురా! యని యడిగిన వారి కాబ్రాహ్మణుం డిట్లనియె. ఆర్యులారా! నేను