పుట:కాశీమజిలీకథలు -01.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నీ కెట్లిచ్చును? ఇదియునుం గాక నీకు దాసీపుత్రుఁడను కళంకము జగద్విదితమై యున్నది. సంపత్కులంబులం దులగానివా డధికునితో సంబంధము చేయఁ దలంచుట పొట్టివాడు పెద్దచెట్ల ఫలములకై చేయి చాచినట్లగు. కోరరాని వస్తువులం గోరి యూరక వెతలఁబడ నేటికి? సాటిబోటిం బెండ్లియాడి వేడుకలం దీర్చుకొనుమని విరక్తి మాటలం బలికిన విని మరుమాటలాడక యిస్సురని నిట్టూర్పు పుచ్చుచుఁ గొండొకవడికి మోమింతయెత్తి యతని మొగంబుపై వేడి చూడ్కులు బరపించుచు నిట్లనియె.

వయస్యా! ఇదియా నీవు చెప్పునది, చాలు. లోకాతీతమతి చమత్కృతిగల హితుండు గలిగియుండు నాకేమి కొరత. నా కార్యమెట్లో సఫలము చేయుదువని సంతసించుచుంటిని గాని తుదకు నీవిట్టి పిరికిమాటలు చెప్పుదువని యెన్నఁడును దలంపనైతిని కానిమ్ము కానిమ్ము దైవంబేమి సేయదలఁచెనో చూచెదంగాక. నేను సామాన్యస్త్రీని బెండ్లియాడను నీకు సామర్థ్యమున్నఁ గళానిలయం బెండ్లి చేయుము. లేనిచో నూరకుండుము నేను సన్యాసినై దేశాటనంబు గావించెద రాజ్యంబు నీవే చేసికొనుమని వైరాగ్యముగాఁ బలుకుటయు తిమ్మర్సు రాజా! నీ వింతటి యల్పకార్యమునకే యలంతి మాటల నాడవలయునా? యొక పడంతుకకు నెక్కుడు ప్రయత్న మేమిటికని యిట్లంటి నిజముగా నట్టి కామితము నీకుఁ గలిగినచో నెట్లో కార్యము సమకూర్చెదం గాని పోనిత్తునా? వినుము. బుద్ధిమంతు డెన్నడును కొంచెము పలికి యెక్కుడు చేయును. నా సామర్థ్యముంతయుఁ గనపరిచి యత్తరుణి నీకుఁగూర్ప యత్నించెను. దైవప్రతికూలమున నొకవేళ కార్యము సఫలము కానినాఁడు మాత్ర మిట్టి యుగ్రప్రతిజ్ఞ పట్టగూడదు. నీవాంఛయంతయు దీర నా నారీమణిని నీకుం జూపించెద. ఇంత పట్టు శపథము చేయఁగలను. దీనికి నీ యభిప్రాయమేమని యడిగిన నతండు మందహాస ముఖారవింద మలంకరింప నతనిని గౌఁగలించుకొని మిత్రమా! నీవు నిక్కముగాఁ దలంచిన పని కాకపోవునా? ఎట్లయినను సరే. యొక్కసారి యక్కలికిని గన్నుల కరవుదీర జూచినం జాలు. అట్టి ప్రయత్నము చేయుమని తొందర పెట్టిన తిమ్మర్సు మరల నిట్లనియె.

రాజా! నీవు చూడగోరిన చేడియ యన్నిటను మిగుల ప్రోఢయని విని యుంటిని. దానింజూడ బాడవేషంబులం గాని పొసంగదు. నీవు నట్టివేషము వేయవలసి యుండును. ఇట్టి రాజవేషము తీసి బ్రాహ్మణవేషము వేయుమని చెప్పుటకు నాకు సందియముగా నున్నది. అని పలికిన నవ్వుచు రాయలు తిమ్మర్సుతో నిట్లనియె. మిత్రుడా! నీవు దీనికై సంకోచమందుచుంటి వేమి. నాయెడ రాజభావము వదలి మిత్రభావముగా మెలఁగుమని యిదివరకే చెప్పియుంటిని. ఈమాట మరచితివా యేమి ఇదియునుం గాక బ్రాహ్మణులు సర్వోత్కృష్ఠులుగదా! అట్టి వేషము వేయుట కేమి నీచము. ఆ పద్మాక్షి నీక్షింప బ్రాహ్మణవేషంబేగాదు, బైరాగివేషంబైనను వేయుమనినచో సిద్ధముగా నుంటినని పలికినఁ దిమ్మర్సు మిగుల సంతసించి కార్యనిర్వాహకత్వమునకు నొడఁబడెను.