పుట:కాశీమజిలీకథలు -01.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

163

హిమాచలాంతరమందున్న భూమియంతయుఁ దిరిగితిని. అందు విద్యావతులైన యువతుల నెందరేనిగంటి వారిం బేర్కొననేల వినుఁడు.

కుంతలదేశంబునకు రాజధానియైన గోపాలపురంబున గోపాలుండను రాజు రాజ్యంబేలుచుండెను ఆ రాజునకుఁ జిరకాలమునకుఁ గళానిలయ యనుపుత్రిక జనించినది. దానిపేరు సార్ధకమైనదిగాని సంజ్ఞామాత్రమునకై యుంచినదికాదు. కళలకును విద్యలకును నివాసభూమియగు నామగువ యిప్పుడు పదియారేడుల ప్రాయము గలిగి యున్నది ఆ చిన్నది యెట్టి రాజకుమారుఁడు వచ్చి యడిగినను దనకుఁ దగినవాఁడు కాఁడని వివాహమాడకున్నది. అనేక విదేశవస్తువిస్తారరుచిరంబగు సౌధాంతరమున వసించి పండితులైన బ్రాహ్మణులకు మాత్రము దర్శనంబిచ్చుచు నే విద్యయం దెంత పాండిత్యమున్న వారినైనను పరీక్షించి యోడించి జయపత్రికలఁ గైకొనుచుండును. పాండిత్యములేని మానవపశువులఁ జూడనని యామె శపథము జేసియున్నది. విద్య మాట యటుండనిమ్ము. ఆ యతివ సోయగ మనిమిషకామినులకైనను లేదని రూఢిగాఁ జెప్పగలను.

సర్వాంగసుందరయగు నత్తలోదరి యొక్కతెయ భూలోకంబులో స్త్రీలలోఁ గాక పురుషులలో సైతము విద్యామహిమచే బొగడఁదగియున్నది. ఆ యొప్పులకుప్పను దేవరవారికి కూర్చినచో జతురాననుండు చతురాననుండని నమ్మెదను.

భూమండలమున బండితరాయలని బిరుదుపొందిన నేనుగూడ నే విద్య యందును నా చిన్నదానితో సమముగా మాటాడనేరం జయపత్రికనిచ్చి యచ్చటినుండియే యిచ్చటికి వచ్చితిని. ఇంతకన్న నాయెఱిఁగినది లేదని చెప్పిన పండితుని మాట లాలించి కృష్ణదేవరాయలు శ్రవణరూపమైన దృగవస్థతోఁగూడ మనస్సంగమ మను రెండవ మన్మథావస్థ పాల్పడెను.

పిమ్మట నాపండితుని యథోచితసత్కారములచేఁ బూజించి యంపి మరికొన్ని దినములకు దన దర్శనంబునకు కొందఱు పండితులు వచ్చుటయు వారి నర్చించిన పిమ్మట బ్రస్తావముగాఁ గళానిలయ వృత్తాంతము మీకేమైనఁ దెలియునాయని యడిగెను. వారును ఆ చిన్నదానిగురించి మున్ను చెప్పిన బ్రాహ్మణునికన్న నెక్కుడుగా స్తోత్రములు చేయ దొడగిరి. నాటినుండియు రాయలు తనయొద్దకు వచ్చెడు పండితుల నెల్ల నడిగి తెలిసికొనుచు నామెయందు బద్ధానురాగుండై యట్లు మన్మథావస్థలకుఁ బాల్పడి క్రమంబున క్షీణింపదొడంగెను.

ఇట్లుండినంత నొక్కనాఁడు తిమ్మర్సు రాజుగారి యవస్థ యంతయుఁ బరిశీలించి శంకాన్వితస్వాంతుడై యక్కారణం బేమని యడిగిన నతండు మంత్రితోఁ తన యవస్థావృత్తాంతమంతయు చెప్పుటయే కాక యాకుముదవదనను దనకుఁ బెండ్లి జేయనిచోఁ గొద్దిదినములలోనే మేనం బ్రాణములు బాయుదునని చెప్పెను. ఆ మాటలాలించి తిమ్మర్సు నవ్వుచు రాజా! నీ కోరిక యసాధ్యముగానున్నదే. ఆ గోపాలుఁడు, మనకంటె నధికారముచేతను సంపదచేతను నధికుడు. అతని కూఁతు