పుట:కాశీమజిలీకథలు -01.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

క్షణము భటుల గొందఱంబంపి వేరొక్క చతురంతయానమున సబహుమానముగా నా తిమ్మర్సును రప్పించెను.

రాజు తిమ్మర్సు ముఖవిలాసము జూచినంతటనే యతం డనన్యసామాన్యబుద్ధిచాతుర్యధురంధరుండని తెలిసికొని మిగుల సంతోషముతో గాఢాలింగనము జేసికొని యతనికి కైదండ యిచ్చి సభాంతరమునకుఁ దీసికొనిపోయి బాలుఁడా! యీ గీటు చిన్నదిగాఁ జేసిన వారెవ్వరని యడిగిన గురువేమి చెప్పెనో తనకుఁ దెలియమినతండు శ్లేషగా ఆయ్యా! అది మద్గురుప్రసాదంబున నట్లయినదని యుత్తరము చెప్పెను.

ఆ మాటలాలించి రేఁడు వాని మతిచమత్కృతివేర పరీక్షింప నవసరములేదని యెఱిగియు నెల్లరకు దెల్లము కావలయునని నీకు నేను మంత్రిత్వమిచ్చితిని. ముద్రిక లవిగో పీఠంబుపై నున్నవి. ప్రక్కలనున్న పరుపులఁ ద్రొక్కకయేపోయి వానిఁ గైకొనుమని యాజ్ఞాపించిన దిమ్మర్సు వల్లెయని మెల్లన నా పరుపులు చుట్టుకొనిపోయి యా ముద్రికలం దీసికొని మరల నా చుట్టలవిప్పి రాజుగారి ముందర నిలిచి ఇవిగో తెచ్చుకొంటిని పరుపులు త్రొక్కలేదు. చూడుడని పలికిన నాయుక్తి కెల్లరు సంతసించిరి. రాజు తిమ్మర్సును మిగుల గౌరవపరచి యా దినముననే మంత్రిత్వపదవికిఁ బట్టాభిషేకము జేసెను.

నాఁటినుండియుఁ దిమ్మర్సు వారి యాస్థానమునకు మంత్రియై సకలరాజ్యకార్యములు యథాప్రయోగములుగా నడుపుచుండెను. అతని బుద్దివిశేషముచేతనే కదా ! నరసింహదేవరాయలకుఁ గృష్ణదేవరాయలు జనించెను. ఆ కథ నీవింతకు పూర్వము విన్నదేకదా? తిమ్మర్సు మంత్రియైన కొంతకాలమునకు వృద్ధరాజు పరలోకగతుండయ్యెను. పిమ్మటఁ గృష్ణదేవరాయులు రాజయ్యెను. అష్టదిగ్గజములను బిరుదులు వడసిన కవీంద్రులును బుద్ధివిశారదుండగు మంత్రి తిమ్మర్సును చెంత నొప్పుచుండ నతని వైభ మాఖండలునకైన లేదని చెప్పుట యేమి యాశ్చర్యము. అతండు కవిత్వప్రియుండై భోజుండువోలె వితరణంబునకుఁ బండితబృందంబుల కానందంబు గలిగించుచుండ నతని కీర్తి దిగంతవిశ్రాంతమై యొప్పుచుండెను. కృష్ణదేవరాయల చరిత్రమంతయుఁ జెప్పుటకు బెక్కుదినంబులు పట్టునుగాన బ్రస్తుతోపయుక్తమగు కథను మాత్రము చెప్పెద నాకర్ణింపుము.

తిమ్మర్సుతోగూడ మిగులవిఖ్యాతిగా రాజ్యంబేలుచున్న రాయలకు దాసీపుత్రుడను కళంక మొకటిగూడ దేశంబున వ్యాపించియున్నది. దానంజేసి యతనికిఁ దిగిన రాజులెవ్వరు కన్నె నిత్తునని వచ్చినవారుకారు. అతఁడు బెద్దకాలము వివాహము లేకయే యుండెను. అట్లుండునంత నొకనాఁడు కళానిధియను బ్రాహ్మణుఁ డొకఁడు రాజదర్శనార్ధమైవచ్చి యతనిచే సత్కారములంది. తన విద్యాప్రౌఢిమ యంతయుఁ జూపించిన సంతసించి యతనితో రాయలు అయ్యా! మీ పాండిత్యము మిగులఁ గొనియాడఁదగి యున్నది. మీరు పెక్కు దేశంబులు తిరిగియుందురు. ఎందేని పాండిత్యముగల స్త్రీలను చూచితిరా యని యడిగిన నతండొక్కింత స్మరణ మభినయించి మహారాజా! సేతు