పుట:కాశీమజిలీకథలు -01.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

161

నిజముగా నీ పని చేసినవారు మీరే కాని నేనా? అని యొడంబడిన పిమ్మట దనకు రాజుగారిచ్చు దానిలో సగము మీకిచ్చెదనని రాజభటుల నొప్పించి శుభముహుర్తమున నాందోళికమెక్కి తగిన వేషముతో జుట్టును రాజకింకరులు గొలిచిరా గతిపయ ప్రయాణంబుల నరసింహదేవరాయలవారి నికటంబున కరిగెను.

ఆ భూభర్త యా వర్తమానమువిని చిరకాలమునకు దగిన మంత్రి దొరికెగదా యని మిగుల సంతోషించుచు నెదురేగి పల్లకిలో గూర్చుండిన యతని వేషముజూచి "అకార సదృశః ప్రజ్ఞ!" అనునట్లు రూపమునుబట్టియే యతని బుద్ధిమాంద్యమును తెలిసికొని, పరీక్షించి చూచెదంగాక యని, దగుసత్కారముతో నతని సభాంతరమునకు గొనిపోయి యుచితపీఠంబునం గూర్చుండబెట్టి నిట్లనియె.

అయ్యా! యీ గీటు నిట్లు చేసినవారు మీరేనా? యని యడిగిన నా బ్రాహ్మణుఁ డెన్నడును రాజసభల కరిగినవాఁడు కాఁడు. సభాకంపముతో నెట్టకేలకు గద్గదకంఠమున నేనే, నేనే యని యుత్తరము చెప్పెను. ఆ స్వరంబుననే యతఁడట్టి నేర్పరి కాఁడని తెలిసికొని రాజు మరల విప్రునితో అయ్యా! మీ బుద్ధిచాతుర్యముఁ బరీక్షింప నింకొక పని చెప్పెదను. అది మీరు చేసినచో నిదియు మీరే చేసినట్లు నమ్మెదనని యా భవనాంతరమం దొకపీఠంబున మంత్రిముద్రికలనుంచి చుట్టును పరుపులు పరిపించి యవి త్రొక్కకయే పోయి యా ముద్రికలఁ దెచ్చుకొనుఁడని చెప్పిన నప్పని కేమియు నుపాయము తోఁచక బ్రాహ్మణుం డాకాశము దెసకు మోమెత్తి యిట్లు చింతించెను.

అయ్యో! యీ రాజు నా కెద్దియో బహుమానము జేయుననుకుంటిని గాని మరలా పరీక్ష జేయునని యూహింపనై తి. ఊరక వట్టిడాంబికముఁ గొట్టుకొనువారి కవమానము రాకుండునా? ఇప్పుడేమి చేయుదును. తిమ్మర్సునుగూడ వెంటబెట్టుకొని యైన రానైతిని దైవ మీయాపద నాకు దాటించినచో నిక నెన్నడును యిట్టి డంబములకుఁ బూనుకొనను. ఇప్పుడు యథార్థము చెప్పకతీరదు. నిజము చెప్పి రాజుపాదంబులంబడియెద ఇంతకన్న వేరొక్క యుపాయము లేదని యూహించి యా వైదికుఁడు గడగడవడకుచు భూవల్లభునితో మెల్లన నిట్లనియె.

దేవా! నేను బ్రాహ్మణుడను. కుటుంబముగలవాఁడను, నన్ను శిక్షింపక మన్నింతురేని యథార్థముఁ జెప్పెద నాకు భయంబున మాట తిన్నగ రాకున్నది. దేవరవారి చల్లనిమాట విని పిమ్మట జెప్పెదనని పలికిన నృపతి వాని పిరికితనమునకు నవ్వుచు బ్రాహ్మణుఁడా వెరవకుము. నీ కేమియు భయములేదు. యథార్థము చెప్పుము. నిను మన్నించితినని పలికిన పిమ్మట నా వైదికుఁడు తెరపితెచ్చుకొని అయ్యా యీ గీటు నేనుగీయలేదు. నాయొద్ద చదువుకొనుచున్న తిమ్మర్సను పేరుగల చిన్నవాఁడు దీని మర్మము గ్రహించెను. వాఁడు మంచిబుద్ధిమంతుఁడు. ఇప్పుడు వానిని బిలిపించినచో మీరు పన్నిన యుక్తులన్నిటినిఁ జేయఁగలవాఁడని పలికిన సంతసించి రాజు ఆ