పుట:కాశీమజిలీకథలు -01.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మును జూపించి అయ్యా తమ రీ గీటును జెడపక చిన్నదిగాఁ జేయగలరా? యని యడిగిన నతండట్లనియె. చాలు చాలు మీకుఁ బిచ్చిపట్టినదా యేమి. అసందర్భపుమాట లాడుచుండిరి. అట్లు చేయుటకు నా యొద్ద గారడీలేదు. పోపొండు మీకతంబున బాలురు చదువుట మానివేసిరి. అనుటయు వారు నిరాశులై మరలిచనుచుండ, నా బడిలో చదువుకొనుచున్న తిమ్మర్సను పదియారేడుల ప్రాయముగల బ్రాహ్మణకుమారుఁ డామాట లాలించి గురువుతో, అయ్యా మిమ్మెద్దియో యడిగి యూరక భిన్నముఖులై యరుగుచున్న వారే మనవుఁడు అతండు ఓహో! అసందర్భపు ప్రలాపంబులకుఁ దగిన యుత్తరంబెవ్వడియ్యంఁ గలండు సిరాగీటు చెరపక చిన్నది చేయవలయునట. అది బుద్ధి చాతుర్యంబునఁ దీరుప శక్యమైనదికాదు. మనయొద్ద గారడీలులేవు. అది మాకు శక్యముగాదని చెప్పిన నూరకచనుచున్న వారనిన, గురువుగారితో తిమ్మర్సు అయ్యా! ఆ పని నేను జేసెదను. వారిం బిలిపింపుఁడు అనునంతలో వారును ప్రాంత మందేయుండి యామాటలు విని తటాలున మరలివచ్చి యాచిన్నవానికా కాగితమును చూపించిరి.

అది చూచి నవ్వుచు, తిమ్మర్సు మేలు, మేలు యీ పాటి పనికే యింత దూరము వచ్చితిరి. ప్రపంచకంబింత నిపుణతా శూన్యమే యని పరిహసించుచు నా కాగితమును బుచ్చుకొని సిరాతో ఆ గీటు ప్రక్కను వేరొక్క పెద్దగీటు గీచి, ఇప్పుడు మీరు తెచ్చిన గీటు చెరుపకయే చిన్నదికాలేదా? యనిన వారు సంతసించుచు నోహో! నేఁడు మాపుణ్యమున బుద్ధినైపుణ్యముగల నిన్ను బొడగంటిమి. రాజశాసనమును చిత్తగింపుము. మీరిప్పుడు మా సంస్థానమునకు రావలయును. పల్లకీ తెప్పింతుము. పయనము కండని వినయపూర్వకముగాఁ బ్రార్ధించుటయు వారి మాటలును తిమ్మర్సు చేసిన పనియును జూచి యతని యుపాధ్యాయుఁడు మిగుల వెరఁగుపడుచు శిష్యునితో నిట్లనియె.

వత్సా! నీవు చేసినపని యుక్తిగా నున్నది. నిన్నింతవానిగా నేనెరుఁగను. ఈమాత్ర ముపాయము మాకెవ్వరికిం దోచినదికాదు. రాజు వట్టిప్రయత్నము చేయు మన్నాడనుకొంటినిగాని యింత తెలివిగలవాడని యూహింపనై తిని. యిప్పుడు రాజు నీకు గొప్ప బహుమానము చేయగలడని తోచుచున్నది. ఇంకొక్కటి వినుము. నీవు నాకు శిష్యుడవుగదా? శిష్యుని విద్యాగౌరవము గురువుదే యని చెప్పుదురు. నీవుజేసిన పని నేనే జేసితినని రాజుగారితో చెప్పెదను మంచి పారితోషికము దొరకగలదు. రాజ భటుల కెద్దియేల లంచమిచ్చి యట్లనిపించెదను. నీవు సమ్మతింపుము. మొదట దొరికిన బహుమానము గురుదక్షిణగా నిచ్చుట న్యాయమని యడిగినవిని తిమ్మర్సు ఆర్యా! దీనికై నన్నింత బ్రతిమాలవలయునా? ఇది యంతయు మీ యనుగ్రహమే కదా?