పుట:కాశీమజిలీకథలు -01.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

159

సామగ్రి దెమ్ము. పిమ్మట జెప్పెదనని బ్రతిమాలుకొని యెట్టకేలకు వానిచే నట్లు చేయించి భోజనానంతరమున మనోహరప్రదేశమునఁ గూర్చుండి యమ్మణిచే నాకథ యంతయుం దెలిసికొని యిట్లు జెప్పదొడంగెను.

తొల్లి యాంధ్రదేశాధీశ్వరుం డగు నరసింహదేవరాయలు ధర్మంబున రాజ్యంబు సేయుచుండ హఠాత్తుగా నతని ప్రధాని మరణము నొందెను. తగిన మంత్రి లేనిచో రాజ్యముజేయుట దుర్ఘటమని నరసింహరాజు తెలివిగలవానికి నాయుద్యోగ మిచ్చెదనని దేశదేశంబుల చాటింపించెను. అట్టివార్త విని బుద్ధిమంతులని పేరు పొందినవారు పెక్కండ్రు వచ్చి యాయుద్యోగము తమకిమ్మని వేడుకొనిరి.

రాజు వారి బుద్ధికుశలతకు మెచ్చుకొనక మంత్రిత్వపదవికిఁ దగినవారుకారని వారి ప్రార్థనాపత్రికలఁ ద్రిప్పివేసెను. లోకంబున నేర్పరులని పేరుపొందినవారు గూడ రాయలచే నిరసింపబడుటచే వారికి మునుపున్న కీర్తికిఁగూడ గళంకము రాఁదొడంగినది. అట్టి భయముననే యెట్టివాఁడును ఆపనికి ప్రయత్నము చేయుట మాని వేసెను. రాయలు మంత్రిలేని భారమెక్కుడైనను సహించెను గాని యల్పబుద్దిమాత్ర మా వుద్యోగమియ్య నియ్యకొనఁడయ్యెను.

ఒకనాఁడతండు పెద్దయుంబొద్దు చింతించి కొందరు పరిచారకులం జీరి యొక కాగితముమీద నాలుగంగుళముల గీత సిరాతో గీసి యోరీ! మీరీ కాగితము ప్రతి గ్రామమునకు గొనిపోయి కనఁబడిన వానికెల్ల చూపించుచు నీగీటు చెరపకయే చిన్నదిగాఁ జేయగలరా యని యడుగుఁడు అట్లు చేసినవాని నందల మెక్కించి నాయొద్దకుఁ దీసికొనిరండని యాజ్ఞాపించి పంపెను.

వారాపత్రమును దీసికొని యనేకపట్టణంబుల కరిగి పెక్కండ్రు బుద్ధిమంతులకుఁ జూపించి యాగీటు చిన్నదిగాఁ జేయుడని యడిగిన నెవ్వరు నప్పని జేయలేక పోవుటయేగాక యది యెట్లును నొనఁగూడని పనియని పరిహాసము చేయదొడంగిరి.

అయ్యా! మీ రాజెంత పిచ్చివాఁడోకదా! యేమియు లేనిదానికై యూర కింతప్రయత్నము చేయుచున్నవాఁడని కొందఱును, ఆహా! సిరాగీటు చెరపక యెట్లు చిన్న దగునని కొందరును, మేలు మేలు దీనిని చెరపక హ్రస్వముగాఁ జేయుటకు మా యొద్ద యంత్రశక్తిలేదని కొందఱు నవ్వసాగిరి.

లోకమునఁ దమకుఁ దెలియని పనులు అసంగతములే యని మందమతు లనుకొనిచుందురుకదా? ఎవ్వ రేమనినను గోపముజెందక రాజభటులు తమయేలిక యాజ్ఞ చొప్పున గనంబడిన వారికెల్ల కాగితము చూపింప దొడంగిరి.

ఒకనాఁ డొక్క యగ్రహారమున కరిగి యందలి వారలకుఁ జూపించుచు నొక బడిలో బాలురకుఁ జదువు జెప్పుచున్న యుపాధ్యాయునియొద్ద కరిగి యాతని కాకాగిత