పుట:కాశీమజిలీకథలు -01.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

చెడుగుణంబు లెన్నేని సహించి కొన్ని దినంబు లందుంటినిగాని నా యునికి యిష్టము లేక యొకనాఁడు నేను నిద్రించుచుండ నన్నుఁ గటికివాఁడు పశువుంబలె గొంతుదరిగి చంపినది. అట్లు బలవన్మరణము నొందియు నీతిమార్గముగా సంచరించితిని గాన రాజునై పుట్టి పూర్వజన్మజ్ఞానము గలిగియుంటిని. ఎన్ని చెడుకృత్యములు సేసినను మనంబున నిడుకొనక పెక్కుగతుల దన్ననుసరించి దిరుగుచున్న నన్నెంత చేసెనో వింటిరిగద. సీ! దాని నొక్కదాని నననేల యా జాతియందు యట్టి క్రౌర్యము గలిగియున్నది. "మధుతిష్టతి వాచి యోషి తాం హృది హాలాహలమేవ కేవలం" అను వచనం బెఱింగినవారు స్త్రీలను నమ్ముదురా? తొలిజన్మమం దిన్నిపాట్లు పడితినిగాన నీ జన్మమునందుఁ బెండ్లి యాడనిచో నే కష్టము నుండదని యూహించి యిట్టి వ్రతమును పూనియుంటినని చెప్పుచున్న సమయంబునఁ నా మాటలన్నియు గోడచాటున నుండి యాలించుచున్న పురుషద్వేషిణి తటాలున లేచి యొక గుమ్మము వెంబడి సభాంతరమున కరిగి సభ్యులెల్లరు విస్మయమంది చూచుచుండ విక్రమసింహునితో నోహోహో నీతిమంతుడా! యేమి మాటలు చెప్పుచుంటివి. చాలు చాలు. నీ పూర్వోత్తర మెఱుఁగని వీరియొద్ద జక్కగా బొంకుచుంటివే. ఇప్పుడు నీవు చెప్పిన ఘోరకృత్యము చేసినవాఁడవు నీవా? నేనా? నీవుచేసి యెదుర నామీఁద పెట్టుచుంటివా? ఈ పాటి కూరకుండుమని యహంకారముగా బలికిన నక్కలికి పలుకుల కులుకుఁవాడువలె గన్ను లెఱ్ఱచేయుచు నోహో రత్నాంగి! మరల నా కిచ్చటఁ దటస్థించితివా? నన్నిట్లు గద్దరించినచో వీరు నిన్ను ముద్దరాలనుకొందు రనుకొంటివా ఏమి? అట్టి క్రూరకృత్యము నీవు చేయక నేనే చేసితినా? ఎట్టి క్రూరులై నను మగవారట్టి సాహసములకు దెగింతురా? ఇదియునుంగాక స్త్రీలకుఁ బురుషులకంటె సాహసమెక్కుడని చెప్పు గ్రంథములే సాక్ష్యములని పలికిన నతని నాక్షేపించుచు నా పద్మాక్షి బొంకులు పలుకువారికి సాక్ష్యముల కేమి కొరత. మేలు మేలు. సాక్ష్యము లిప్పించి యా నింద బాపుకొనదలంచిరిగాని యెట్లును నది మిమ్ము బాయదు. చేసితినని యొప్పుకొని పైన మాట్లాడుడనుటయు నతండు భళిభళి మంచి జాణవౌదు. నీదు మాటలకు మోసపోవుదు ననుకొంటివా? ఈ గడుసుతనం బుడుగుము. నేరంబున కొడంబడుమనియె.

ఇట్లయ్యిద్దరును పెద్దతడవు శ్వానంబులవలె మొఱగుచు హస్తంబులు సాచి నీవే నీవే యని పోరాడుచుండు సమయంబున సభ్యులును నా రాజును విస్మయముతోఁ జూచుచుండిరి. అప్పుడు బహుశ్రుతుఁడు నవ్వుచు వారిరువుర తగవులు వారించి యోహో! ధృడవ్రతులారా! మీ వ్రతములు జక్కగానున్నవి. ఇట్లూరక పోరాడనేల ఈ సభ్యులకు వివాదకారణం బెరింగింపుఁడు, పక్షాపక్షంబు లుడిగి వీరే నేరమొకరి యందు స్థాపింతురనుటయు నప్పుడా పురుషద్వేషిణి సభ్యుల దిక్కు మొగంబై