పుట:కాశీమజిలీకథలు -01.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రత్నాంగి కథ

155

దాచక చెప్పవలయునని బృహస్పతి నీతిలో నున్నది. మఱియు వీరు మిమ్మిట్టి యుగ్రవ్రతము పట్టుటకుఁ గారణ మడుగుచుండిరి. కాని వ్రతము మానుకొనుమని చెప్పుట లేదు. తమ యంతరంగమున కట్టి ప్రసంగము సంతోషభంగమైనను సహింప తత్కారణం బెఱుగఁగోరుచున్న యీ సభాసదుల మదుల కామోదము గలుగఁజేయుఁడని యడుగుటయు, గోడమాటునుండి యీమాటను వినుచున్న పురుషద్వేషిణి యారాజకుమారుని యభిప్రాయము తెలిసికొనవలయునని నభిలాష గలిగియున్నది గానఁ జేసన్నలచే సఖులరొద చేయవలదని వారించుచు నతండేమి చెప్పునో యని చెవియొగ్గి వినుచుండెను.

అప్పుడు విక్రమసింహుఁ డెట్టకేలకు మోము పై కెత్తి విధిలేక చెప్పువాఁడుం బలె నెల్లరు విన నిట్లనియె. సభ్యులారా! నేను పూనిన వ్రతంబు సకలలోకవిరుద్ధం బైనను నా చెప్పఁబోవు వృత్తాంతము వినినచో మీకు యుక్తమేయని తోచకమానదు. నాకు జాతిస్మృతి గలిగియున్నది. వినుండు నేను పూర్వజన్మ మందొక వర్తకుని కుమారుండ. నా పేరు కాంతివర్మ, నాకు యుక్తవయస్సు వచ్చినప్పుడు మాతండ్రి పెక్కురు వరదక్షిణలతోఁ గన్య నిత్తుమని వచ్చినను నంగీకరింపక రూపమునకు నాశపడి యొక వర్తకుని కూతురు రత్నాంగి యనుదానిం బెండ్లి చేసెను.

అది పెండ్లియైన కొలదికాలమునకే కాపురమునకు వచ్చినది. "భార్యారూపవతీ శత్రుః" అనునట్లు దాని చక్కదనమే నా దుఃఖమునకు మూలమైనది. దాని దుర్గుణములను గురించి యెన్నియో నీతులు చెప్పి మందలించితిని గాని నాబోధ యేమియు దాని మది కెక్కివది కాదు. నా తలిదండ్రులు నా భార్య కాపురమునకు వచ్చిన వెంటనే చనిపోయిరి. గాన నింటిపెత్తన మంతయు దాని యధీనమేయైనది. అది సొమ్మంతయు దుర్వ్యయము చేయుచు స్వల్పకాలములోనే నన్ను ఋణస్థునిగాఁ జేసెను. ఒకనా డది నేను వలదని యెన్ని విధములఁ జెప్పినను వినక తన పుట్టింటికి లేచిపోవఁ బ్రయత్నించిన నపకీర్తి భయముచే నేనును వెనుకొని యరిగితిని.

నేనుఁగూడ వచ్చుట యిష్టములేక మార్గమధ్యమం దొకనూతిలోఁ దొంగి చూచుచుండ నన్ను బలాత్కారముగా నందు ద్రోసి పుట్టింటి కరిగినది. దైవవశమున నందొక మఱ్ఱిమొక్క నా చేతికిఁ దొరికినఁ బట్టుకొని నీటిపై తేలుచున్న నన్నుఁజూచి యా దారి నరుగుచున్న పుణ్యాత్ములు కొందరు బైకిఁ దీసిరి. క్రౌర్యమనునది స్త్రీ జాతికి సామాన్యమేగదా యని యూహించి యప్పుడుగూడ గోపము వహింపక యత్తవారింటి కరిగితిని.

అందు నన్నుఁ జూచినతోడనే విభ్రాంతయై తెలతెలపోవుచు నిలుచున్న యా తరుణి నెరుగనివాఁడువలె బలుకరించి మంచిమాటలని దాని దిగులు వాపితిని. దాని