పుట:కాశీమజిలీకథలు -01.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అని వ్రాసిన యా రాజభటుని చేతికే యిచ్చియంపి యట్టి యొడంబడికతో నుత్తరము రాగానే, బహుశ్రుతుండు గొన్ని రహస్యములు విక్రమసింహునకు బోధించి పెక్కండ్రు వీరభటులు వేత్రహస్తులై యిరువంకల నలంకరింప నతని బంగారుపల్లకి నెక్కించి తాను దోడ నడుచుచు స్త్రీలు దూరముగాఁ బోవలయునో యనుచాటింపుతోఁ బౌరు లాశ్చర్యపడి చూచుచుండ నతండు రాజసభ కరిగెను.

ఆ వింత జూచుటకై యంతకుమున్ను యా రాజు పౌరులకును సామంతులకును మఱియుఁ బెక్కండ్ర పెద్దమనుష్యులకును వార్త పంపియున్నవాఁడు. వారందఱు వచ్చి సభ నలంకరించిరి. పురుషద్వేషిణియుఁ జెలికత్తెల వలన నా వృత్తాంత మాలించి యతండట్టి వ్రతము పట్టుటకేమి కారణము చెప్పునో వినవలయునవి యా సభాభవనపు గోడప్రక్కకు వచ్చి సఖులతోఁ గూర్చుండి యుండెను. ఆ రాజును విక్రమసింహున కెదురేగి మంత్రితోఁ దోడితెచ్చి సాదరముగా నుచిత పీఠంబులఁ గూరుచుండఁబెట్టెను. అందఱును గూర్చున్న తర్వాత గొంచెముసే పాసభ నిద్రితమైనది వోలె నిశ్శబ్దమైయుండెను. అప్పుడు రాజశాసనంబున లేచి యతని మంత్రి విక్రమసింహుఁడు విన బహుశ్రుతునితో నిట్లనియె.

ఆర్యా! ఆదిని సృష్టికర్త తన శరీరములో నెడమభాగము స్త్రీనిగాను కుడిభాగము పురుషునిగాను జేసెను. అమ్మిథునంబువలననే ప్రజావృద్ధియైనట్లు మన పురాణములు చెప్పుచున్నవిగదా! ఇదియునుంగాక త్రిమూర్తులును భార్యలను శరీరమునందే ధరించుకొనే యున్నారు. దానింబట్టి చూడ ప్రతిపురుషునకు భార్య యుండవలసిన విధి గనంబడుచున్నది. తెలివిమాలిన యబల లెవ్వరేనిఁ బట్టినం బట్టుదురు గాని మీ రాజుగారు ప్రజాసృష్టి ప్రధానహేతుభూతంబగు స్త్రీజాతియందు బగబూని వ్రతంబుఁ బట్టుటకుఁ గారణము తెలియకున్నది. అట్టి హేతువు విను తాత్పర్యముతో మా రాజుగారు మిమ్మిందులకు రప్పించిరి. ఆ వివరం బెఱింగించి మా మనంబునం గల సందియం బుడిగింపుఁడని యడుగునంత నితాంతకోపంబునఁ గన్ను లెఱ్ఱఁజేయుచుఁ జెవులు మూసికొనియున్న విక్రమసింహుని శాంతిపరచుచు బహుశ్రుతుండు మరల వాని కిట్లనియె. ఆర్యా! ఈ రాజు స్త్రీప్రసంగము సహింపనోపఁడు. అట్టి మాటలఁ దలపెట్టినచోఁ నెట్టి హితులనైన నహితులుగా జూచుచుండును. జ్ఞానము వచ్చినది మొద లిట్టి వ్రతము పట్టియున్న వాఁడు. దాని కారణ మడిగి నేనును పెక్కుసారు లవమానింపఁబడితిని. ఇప్పు డిందఱుగోరి యడుగుచుండఁ జెప్పకునికి మంచి పరిపాటిగాదు. అడిగి చూచెదనని యతని దిక్కు మొగంబై యడుగుటకును భయపడు వానివలె నభినయించుచు నల్లన నిట్లనియె.

దేవా! ఎట్టి రహస్యమైనను పదుగురు పెద్దమనుష్యులు గూడి యడిగినప్పుడు