పుట:కాశీమజిలీకథలు -01.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రత్నాంగి కథ

153

నిత్యము పూర్వదివసంబున వనితాద్వేషి మహారాజుగారును బెక్కుసైన్యము చుట్టునుగొలిచిరా స్త్రీలు దూరముగాఁ బోవలయునో యను చాటింపు ముందు వెలయ నించుమించుగా బురుషద్వేషిణి బయలుదేఱువేళకే బయలుదేఱుచుఁ గేళీసరోవరంబున కరిగి కొంతసే పందు జలక్రీడలనాడి మధ్యాహ్నమున కింటికి వచ్చుచుండును.

పురుషద్వేషిణియు నావిహారదీర్ఘికకు వనితాద్వేషిణి మహారాజుగారు కొత్తగాఁ గట్టిన యూరుమీఁదుగానే యరుగువలయును గాని నప్పుడట్టి చాటింపు విని వెరఁగు పడుచు నెదురుపడకుండ మారుత్రోవను బోవుచుండును. అట్టి చాటింపులు రెండును విని వనితాద్వేషి వచ్చునప్పుడు స్త్రీలును బురుషద్వేషిణి వచ్చునప్పుడు పురుషులును జాటున కరుగచుండి రట్టి బాధలు పడలేక నొక్కనాఁ డాయూరి ప్రజలు రాజునొద్ద కరిగి యిట్లు చెప్పుకొనిరి.

మహారాజా! ఇదివరకే తమ కూఁతురు స్నానార్థమరుగుచుండ వీధులయందెట్టి యగత్యపుపని చేయుచున్నను మగవారు వానిని విడిచి తటాలున లోనికరుగవలసి వచ్చుచున్నది. పులిమీఁద పుట్రయనునట్లు మగవారికేగాక యిప్పుడు స్త్రీలకుగూడ నట్టి యుపద్రవము వచ్చినది. వనితాద్వేషి యను పేరు పెట్టుకొని యెవ్వరో యీ యూరిబైట నొక గ్రామము కట్టుకొని యచ్చట స్త్రీలను బైటకు రానీయక బాధించుచున్నారు. మన పురుషద్వేషిణి పురుషులన్న నెంత యలుగునో యాతండు స్త్రీలుమాటఁ దలపెట్టినంత నంతను నిబ్బడిగా నలుగుచుండునఁట. వారిరువుర వలన నీ యూరి స్త్రీపురుషులు కాపురము సేయనోపరు. బాధలుడిగింతువేని యుందుము. లేనిచో నెక్కడికేని లేచిపోయెదమని మొరపెట్టుకొనిన పౌరులతో నా నృపతి యిట్లనియె. ఔను. ఇదివరకే యా రాజకుమారుని విపరీతచర్యలు వినియుంటిని. మీబాధ లుడిగించెదఁ జింతింపకుడని వారి నోదార్చి యంపి యప్పుడ యొక్కపరిచారకుని, సగౌరవముగా నొక యుత్తరము వ్రాసియిచ్చి వనితాద్వేషి మహారాజునొద్ద కంపెను. వాఁ డాచీటిం గొనిపోయి బహుశ్రుతునితోఁ గూడుకొని కొలువున్న విక్రమసింహుని కిచ్చెను. బహుశ్రుతుఁడు దానిం బుచ్చుకొని చదివి వేరొక్కచీటి యిట్లు వ్రాసెను.

అయ్యా! తమరు వ్రాసిన యుత్తర మందినది - అందలి సంగతులు బోధపడినవి. మా వనితాద్వేషి మహారాజుగారి నొకసారి యచ్చటికి దయచేయుమని కోరి నందుల కెంతయు సంతసించి యాయన యట్టి ప్రయాణమున కాజ్ఞ యిచ్చియున్నారు. మా రాజుగారి వృత్తాంతమంతయు నిదివఱకే మీరు వినియుండవచ్చును. ఆయన వచ్చునప్పుడు వీథులలో స్త్రీలుండకుండునట్లును, మీ సభలోనికి నాడువారిని రానీయనట్లును, నాజ్ఞ చేసితిమనే జాబు వ్రాయించిన తక్షణము బయలుదేరివచ్చుచున్నారు.