పుట:కాశీమజిలీకథలు -01.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రత్నాంగి కథ

157

ఆర్యులారా! ఈతండు పూర్వజన్మంబున నా మగండు. ఇప్పుడు మీతో నితండు చెప్పిన కథలో తానుజేసిన నేరములన్నియు నా మీఁదబెట్టి యబద్ధము చెప్పుచున్నాడు. అ రత్నాంగిని నేనే. నేను నిద్రించుచుండ నన్ను బలాత్కారముగాఁ జంపెను. అ కోపముచేతనే నేనును పురుషులయెడ క్రౌర్యము బూను యిట్టి వ్రతము బట్టితి. నే జెప్పినదంతయు యథార్థమనిన విక్రమసింహుడును ఆర్యులారా! నాకీ రాజపుత్రిక పూర్వజన్మమందు భార్య. అప్పుడు నన్ను బలాత్కారముగాఁ జంపిన రత్నాంగి యిదే. దీని మూలముగానే నేనిట్టి వ్రతము పట్టితిని. ఇది తానుజేసిన నేరము నా మీఁద పెట్టుచున్నది. దీనిమాటల నమ్మవలదని పలికెను.

ఆ యిద్దరి మాటలను విని సభ్యులేమియు జెప్పలేక యొకరి మొగం బొకరు చూచుకొనుచున్న సమయంబున బహుశ్రుతుండు లేచి సభ్యులారా! వీరి తగవును గురించి నా కొక్కటి తోచుచున్నది. నే జెప్పినట్లు వినెదమని వీరొడంబడెదరేనిఁ జెప్పెదననుటయు నందుల కాచిన్నది యొప్పుకొనిన పిమ్మట విక్రమసింహుండు నెట్టకేల కొప్పుకొనెను.

పిమ్మట బహుశ్రుతుఁడు అయ్యా! వీరిరువురు పూర్వజన్మమునందు దంపతు లైనట్లును నొకరితో నొకరికిఁ బడక బలవన్మరణము నొందినట్లును వీరు చెప్పిన మాటలచేతనే తెల్లమగుచున్నది గదా! వీరిలో నిజముగా నపరాధమెవ్వరుచేసిరో తెలిసికొనుటకు మన వశంబుగాదు. వీరి జన్మమునందు మరల దంపతులై పూర్వ వైరమును స్మరించుకొనక యొండొరులయం దత్యంతానురాగంబున మెలంగినచో దానికి నిష్కృతి యగునని నాకుఁ దోచుచున్నది. ఇప్పటికి వీ రొడంబడదగునని పలికిన విని పురుషద్వేషిణి యేమియుం బలుకక తలవాల్చుకొని విక్రమసింహునిం జూచినది మొదలు వానియందు బద్దానురాగయై యున్నదిగాన బహుశ్రుతుఁడు చెప్పిన తగవు కెంతయు స్వాంతంబున సంతసించుచు విక్రమసింహు డందుల కొడంబడునో యొడంబడడో యను సందియంబు మనంబున బాధింప దా నొడంబడినయట్లు సూచించుచు, దండ్రిమొగంబుపై దృష్టి ప్రసారంబులు బరగించినది.

అ రాజు తదీయాభిప్రాయంబు గ్రహించి తానంతకు మున్నెన్నోదినములు పెండ్లి జేసికొమ్మని బ్రతిమాలినను వినక యప్పు డొప్పుకొనినందులకు మిగుల సంతోషించి, బహుశ్రుతునితో అయ్యా! మా చిన్నది మీరు చెప్పిన యట్టొప్పుకున్నది. మీ రాజకుమారునిఁ గూడ నొప్పింపుడనునంతలో నాకాంతకు సి గ్గెక్కడనుండి వచ్చెనో మేనుగురు పొడువ దిగ్గునలేచి యంతఃపురమున కరిగినది.

బహుశ్రుతుండును రాజుగారితో అయ్యా! మారాజు పెండ్లి యాడుటకు సులభముగా నొప్పుకొనడు. ఇంటియొద్ద నెమ్మదిగా బోధించి యొప్పించెద. ఇందులకు