పుట:కాశీమజిలీకథలు -01.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రత్నాంగి కథ

151

యుత్కృష్ఠవ్రతంబు బట్టితిని. మీరు నాకుఁ బ్రాణతుల్యులు గాన నింతవట్టు శమించి యెఱింగించితిని. ఇఁక నెన్నఁడు వారిప్రస్తావము నాచెంతఁ దేరాదు. తెచ్చినచో క్షమింపక శిక్షింప నియమింతునని కన్ను లెఱ్ఱఁజేసి యుగ్రంబుగాఁ బలికినది. అక్కలికిపలుకుల కులికి వారేమియు ననక యామె యానతి కొడంబడిరి. పిమ్మట నాకొమ్మయు జెలులతో మరలఁ గొంతసేపు జలకేళిం దేలి యప్పూబోఁడులు సేవింప నెప్పటియట్ల నిజనివాసంబున కరిగినది.

పిమ్మట విక్రమసింహుఁ డమ్మించుబోణి జూచినది మొదలు పంచేంద్రియవ్యాపారంబులు నయనేంద్రియమంద ప్రసరింప నన్య మెఱుఁగక తదీయరూపవిభ్రమవిలాసంబులు వర్ణించుచు నా చిన్నది యరిగినప్పుడు సైతము వాని మనంబుఁ గన్నుల వెంబడి నాయండజయాన వెన్నంటి యరిగెను. అయ్యతివ ప్రతిమఁ జూచినప్పుడే మోహపరవశుండైన వాఁడు నిజమైన యాకృతిఁ జూచినప్పుడు వివశుడగుట యక్క జము కాదు.

బహుశ్రుతుండును నా పాటలగందుల మాట లాలించుచు నాటలం జూచుచుఁ తదీయవిలాసంబంతయుం గాంచియు నప్రమత్తుడై యామానినులరిగిన పిమ్మట మెల్లన చెట్టుదిగి విక్రమసింహుని దిగుమని పలికిన నతఁ డొడలెరుఁగక చెట్టుకొమ్మ సందున చిక్కుపడి దిగకుండుటకు వెరగందుచు బహుశ్రుతుఁడు మరలఁ జెట్టెక్కి యెట్టకేలకు వానిఁ బ్రబోధితునిఁ జేసి బలాత్కారంబుగఁ జెట్టు దింపించెను.

అప్పుడు విక్రమసింహుఁడు తెలివితెచ్చుకొని విరహతాపముతో అన్నా! పురుషద్వేషిణి యెందేగినది. ఇప్పుడు నన్నా సుందరిం జేర్చుము. యోహో! యా మోహనాంగి సోయగం బీక్షించితివా? అది యంతయు నాకొక కలగానున్నది సుమీ! నిజముగా కలయేకాదుగద. కాదు. అదిగో! ఆ ముద్దులగుమ్మ జలకేళిం దేలిన కొలను కనఁబడుచున్నది. ఆ చిన్నదానిం గూడక నా ప్రాణంబులు నిలువవు. వేగ నట్టిప్రయత్నము చేయ నీ పాదంబుల కిదియే మ్రొక్కుచున్నవాడనని యడుగులంబడిన బహుశ్రుతుఁడు వాని లేవనెత్తి నవ్వుచు, ఆహా! మేటిధైర్యశాలివే. మాటిమాటికి నింత తొందరపడినచోఁ గార్యములు సమకూరునా? ఆ చేడియ లొండొరులాడుకొనిన మాట లాలించితివా? యని యడిగిన నతండన్నా! అప్పుడు నాచిత్తం బమ్మత్తకాశినీవిలాసవర్ణనాయత్తంబై యున్నదిగాక వారి మాటలలో నాకొక్కటియు వినఁబడినదికాదు. ఏమేమి సంభాషించుకొనిరో తెలియఁ జేయుమనివేడిన బహుశ్రుతుండు నాపూవుఁబోణు లాడుకొనిన మాటలన్నియుఁ జెప్పి మిత్రమా! నీవు చింతింపకుము. నీ కార్యము సులభమార్గమున సాధించెదరమ్ము. ఆ పురుషద్వేషిణి యున్న పురంబునకుఁ బోదమని యతని తాపంబు గొంత యుడిగించి వానితో సాయంకాలమున కాపట్టణంబుజేరెను.