పుట:కాశీమజిలీకథలు -01.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నా తండ్రి నాయవస్థకు మిగులఁ బరితపించుచు అమ్మా! నీమగం డేమయ్యె నూతిలో నేటికి బడితివి! నేను మీ కిచ్చిన ధనము సురక్షితముగా నున్నదా! యని యడిగిన నే నొక్కింత చింతించి నిజము చెప్పిన గాపురము చెడునని యూహించి యిట్లంటి. నాయనా! నేనును మీ యల్లుడును ధనంబుగొని యిచ్చటినుండి మా యూరి కరుగుచుండ నడుమ నడవిలోఁ గొందఱు దొంగలువచ్చి మా ధనంబ౦తయు దోచుకొనుటయేగాక మీ యల్లుని బారఁగొట్టి నన్ను నూతిలో బడద్రొబ్బిపోయిరి. నేనును దైవప్రేరితులగు మార్గస్థుల కరుణను నిన్నుఁ జేరితిని.

నా పతియు నూరుజేరి యుండవచ్చును. ఆయన నాకై తొట్రుపడుచుండును. వేగ నచ్చటి కరుగవలయునని ప్రయాణంబునకుఁ దొందరపడుదానివలె నభినయించుచుఁ దండ్రి నిర్భంధమునఁ గొన్ని దినంబులుండి యొకనాఁడు నా మగని జూడఁబోయెద నని మా తండ్రితోఁ జెప్పితిని. ఆతండందులకు సంతసించి మరల గొంతధనం బిచ్చి నన్నత్తవారింటి కనిపెను.

నా పల్లకీబోయెల నాదము వినినతోడనే నామగఁ డెద్దియో యనుకొని వాకిటకు వచ్చెను. నేనును బిల్లకిదిగి యెదురనున్న పతికి నమన్కరించి లోనికరిగి నన్ను జూచినంత యతఁడు విభ్రాంతుఁడై యేమియు ననలేక నిలచున్నంతఁ దత్కాలోచితవాక్యంబులచే నతని దిగులువాపి పూర్వమువలె ననురాగముతోఁ గాపురము జేయుచుంటిని. నన్నవమానవరచి తెచ్చిన ధన మంతకుమున్నే జూదంబున నోడిపోయెను. ఎప్పటి‌ దారిద్ర్యముతో నొప్పుచున్న వాని దైన్యమునకు మనంబునఁ బెక్కుగతులం జింతించుచు, నెప్పటికై నను బుద్ధివచ్చునేమోయని యప్పుడప్పుడు కొంచెము ధననహాయము చేయచుంటిని.

పాములకుఁ బాలుపోసినను విషమేయగుచున్నట్లు నా జేయు ధనసహాయము వలన నతనికి విపరీతబుద్ధి పుట్టినది. నేను పుట్టింటనుండి మిగుల ధనము తెచ్చితిననియుఁ దలంచి దనకుఁ జూదమాడుటకు నియ్యననియుఁ దలంచి యొక్కనాఁడు నేను నిద్రించుచుండ దయావిహీనుడై కటికివాఁడు పశువుంబలె నాగొంతు దరిగి చంపెను. నేను బలవన్మరణము నొందియుఁ బాతివ్రత్యవిశేషమహిమం జేసి యిట్టి యుత్కృష్టజన్మ మెత్తి జాతిజ్ఞానము గలిగియుంటిని.

ఎట్టి యుపకారము జేసినను మనంబున నిడికొనక యెన్నో గతులఁ దన్నాశ్రయించుచుండ నాయెడ నొక్కీంచుకేని యక్కటిక ముంచక నన్నుం బరిమార్చెను. వాని క్రూరత్వము వింటివిగద! సీ! వాని నొక్కనిని నననేల? యాజాతి యందట్టి క్రౌర్యము గలిగియున్నది. ఇచ్చకపుమాటలచే మత్తకాశినులు చిత్రవిత్తంబులు హరించి మోసపుచ్చుచుందురు. నాకుఁ దొల్లింటి తెలివి గలిగియున్నది. వాడు చేసిన మోసంబునకు మనంబున నీసు జనింప నాజాతియే చెడుజాతి యని విరసించి యిట్టి